TTD Seva Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, నేటి నుంచి ఆర్జిత సేవ, అంగ ప్రదక్షిణ టికెట్లు అందుబాటులోకి!
TTD Seva Tickets : శ్రీవారి భక్తులకు రేపటి ఆర్జిత సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. లక్కీడిప్ ద్వారా భక్తులకు ఆర్జిక టికెట్లు కేటాయించనున్నారు. ఇవాళ్టి నుంచి కరెంట్ బుకింగ్ అందుబాటులోకి వస్తుంది.
TTD Seva Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన శ్రీవారి ఆర్జిత సేవలను రేపటి నుంచి ప్రారంభిస్తుంది. ఇందుకు గాను నేటి నుంచి ఆర్జిత సేవా టికెట్లను ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తుంది. లక్కీ డిప్ ద్వారా భక్తులకు కరెంట్ బుకింగ్ విధానాన్ని తిరిగి రెండేళ్ల తర్వాత ఇవాళ ప్రారంభిస్తుంది. తిరుమల సీఆర్‌వో జనరల్ కౌంటర్లలో కరెంట్ బుకింగ్ కు ఏర్పాట్లు చేశారు. ఆర్జిత సేవా టికెట్లను తిరుమలలోని కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు ఈ కౌంటర్లలో టికెట్ తీసుకుంటే రెండు అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌లు ఇస్తారు. ఒక స్లిప్ లో భక్తుని నమోదు సంఖ్య, సేవ తేదీ, వ్యక్తి పేరు, మొబైల్ నంబర్‌లు నమోదు చేస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆటోమేటెడ్ ర్యాండమైజ్డ్ నంబరింగ్ సిస్టమ్ ద్వారా లక్కీ డిప్ తీస్తారు. శుక్రవారం అడ్వాన్స్‌డ్ బుకింగ్ టికెట్లు కలిగి ఉన్న భక్తులు గురువారం రాత్రి 8 గంటలలోపు ఆర్జిత కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి.
అంగప్రదక్షిణ టోకెన్లు జారీ
లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులకు వారి మొబైల్ కు రాత్రి 11 లోపు సమాచారం వస్తుంది. టికెట్లు పొందని వారికి కూడా సమాచారం అందిస్తారు. లక్కీ డిప్ విధానంలో టికెట్లను ఆటో ఎలిమినేషన్ ప్రక్రియ అమలు చేస్తుంది. ఈ విధానంలో ఆర్జిత సేవ పొందిన భక్తులు ఆరు నెలల వరకు మరే ఆర్జిత సేవలను పొందేందుకు అనుమతి ఉండదు. ఆర్జిత సేవల నమోదు కోసం ఆధార్ తప్పనిసరి ఉండాలి. ఎన్‌ఆర్‌ఐలు అయితే పాస్‌పోర్ట్ ఉండాలి. యాత్రికులు ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డుతో కౌంటర్ వద్దకు తీసుకెళ్లారు. కొత్తగా పెళ్లైన జంటలకు ఆహ్వాన పత్రిక, లగ్న పత్రిక, ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు సమర్పిస్తే కల్యాణోత్సవం టికెట్ల కేటాయింపు నిర్ణీత కోటా ప్రకారం జరుగుతుంది. వివాహం జరిగిన 7 రోజులు మించకుండా వివరాలు సమర్పించాలి. అంగప్రదక్షిణం టోకెన్లను కూడా టీటీడీ జారీ చేస్తుంది. ఈ నెల 31 తిరుమలలో రెండు కౌంటర్లలో ప్రతిరోజూ 750 టోకెన్లు జారీ చేయనున్నారు. శుక్రవారాల్లో అభిషేకం కారణంగా భక్తులకు దర్శనం లేకుండా అంగప్రదక్షిణకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ కారణంగా ఏప్రిల్ 1న భక్తులకు అంగప్రదక్షిణకు అనుమతి ఉంటుంది.
రేపటి నుంచి ఆర్జిత సేవలు
కోవిడ్ వ్యాప్తి పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టడంతో గత పాలక మండలి సమావేశంలో ఆర్జిత సేవల పునఃప్రారంభించేందుకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలపడంతో ఏప్రిల్ 1వ తేదీ నుండి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడ, మేల్‌చాట్ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తారు. అయితే కోవిడ్ పరిస్ధితుల విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొనసాగించనుంది టీటీడీ. అదేవిధంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించి భక్తులు నేరుగా పాల్గొనే విధానంతో పాటు వర్చువల్ విధానం కూడా యథావిధిగా కొనసాగించనుంది. అయితే వర్చువల్ సేవలను బుక్ చేసుకున్న భక్తులు ఆయా సేవల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేదని స్పష్టం చేసింది. వర్చువల్ ఆర్జిత సేవల బుక్ చేసుకున్న భక్తుల దర్శనం కల్పించడంతో పాటు ప్రసాదాలు మాత్రమే అందించనుంది. అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న వారిని, ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని సేవలు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుంచి కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు అనుమతిస్తున్నారు.