Tirumala News: తిరుపతి స్థానికులకు శ్రీనివాసుడి దర్శనం - టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే?
Andhra News: తిరుమల శ్రీవారి దర్శనాన్ని తిరుపతి స్థానికులకు డిసెంబర్ 3న కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. డిసెంబర్ 1న మహతి ఆడిటోరియం, బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్‌లో టోకెన్లు ఇవ్వనున్నారు.
Tirumala Srivari Darshan To Locals: తిరుపతిలోని (Tirupati) స్థానికులకు శ్రీనివాసుడి దర్శనాన్ని టీటీడీ (TTD) ఇటీవలే పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు డిసెంబర్ 3వ తేదీన (మొదటి మంగళవారం) స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి డిసెంబర్ 1న తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీనగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఈ నెల 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని తీసుకున్న నిర్ణయం మేరకు చర్యలు చేపట్టింది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డు చూపించి టోకెన్లు పొందొచ్చని అధికారులు తెలిపారు.
అటు, సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు 2, 3 గంటల్లోగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించగా.. దీని కోసం ఓ నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని, నివేదిక ఆధారంగా భక్తులకు వెంటనే స్వామి దర్శనం చేసేలా చర్యలు చేపడతామని టీటీడీ తెలిపింది. అలాగే, టీటీడీలో పని చేస్తోన్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వ శాఖలకు బదిలీ చేసేలా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
తిరుపతిలో భారీ వర్షం
మరోవైపు, పెంగల్ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. తిరుమలలో శుక్రవారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఓ వైపు దట్టంగా కురుస్తోన్న మంచు, మరోవైపు వర్షం, పెరిగిన చలితో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తితిదే సూచించింది. పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలు తాత్కాలికంగా మూసేశారు. వృక్షాలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
రాజకీయ ప్రసంగాలపై నిషేధం
అటు, శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ధ్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. గత కొంతకాలంగా కొందరు రాజకీయ నేతలు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం విమర్శలకు తావిస్తోంది. దీంతో పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది. ఈ క్రమంలో రాజకీయ ప్రసంగాలు నిషేధించాలని ఇటీవల జరిగిన తితిదే బోర్డు సమావేశంలో నిర్ణయించగా.. శనివారం నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అలాగే, ఇటీవల శ్రీవారి ఆలయం ముందు ఫోటో షూట్స్ కూడా వివాదంగా మారాయి. ఈ అంశాన్ని కూడా టీటీడీ సీరియస్‌గా తీసుకుంది. ఆలయం ముందు అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.