Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్-ఆర్జిత సేవా, అంగప్రదక్షిణం టికెట్లు విడుదల
Tirumala Tickets : తిరుమల శ్రీవారి ఆర్జిత, అంగ ప్రదక్షిణతో పాటు పలు సేవల టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది.
Tirumala Tickets : తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం కోసం భక్తకోటి వేయి కళ్లతో వేచిచూస్తుంది. తిరుమల దర్శనం టికెట్ల ఎప్పుడూ విడుదల చేస్తారా అని ఎదురుచూస్తుంది. ప్రత్యేక, సర్వదర్శనం టికెట్ల ఒక నెల ముందుగా విడుదల చేసే టీటీడీ, ఆర్జిత, అంగ ప్రదక్షిణ టికెట్ల రెండు నెలల ముందుగానే విడుదల చేస్తుంది. జూన్ నెల కోటకు సంబంధించి ఆర్జిత సేవాల టికెట్లను టీటీడీ గురువారం వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. నేటి ఉదయం 10 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో టికెట్లను అందుబాటులో ఉంచారు ఆలయ అధికారులు. జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ్టి నుంచి విడుదల చేసింది. నేడు, రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లతో పాటుగా అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
మార్చి 24న టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు ఉంటాయని టీటీడీ తెలిపింది. ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ ద్వారా అందిస్తామని, ఈ ప్రక్రియ మార్చి 24న మొదలవుతుందని తెలిపింది. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు రుసుం చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టికెట్ల కోటాను మార్చి 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది అధికారులు తెలిపారు. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెలకు సంబంధించిన ఉచిత దర్శనం టోకెన్లను మార్చి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. తిరుమలలో దళారులకు చెక్ పెట్టేందుకు టీటీడీ సాంకేతికను వినియోగిస్తుంది. సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు వద్ద ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. మార్చి ఒకటి నుంచి ఈ టెక్నాలజీని అమలుచేస్తుంది. సర్వదర్శనం కాంప్లెక్స్‌లో ఒకే వ్యక్తికి ఎక్కువ లడ్డూ టోకెన్లు పొందకుండా, గదుల కేటాయింపు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల దగ్గర ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.
తిరుమల భక్తుల రద్దీ
తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం రోజు 53,146 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.. 18,655 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ఈ క్రమంలోనే నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3 కోట్లు రూపాయలు లభించింది. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 2 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహించే క్రమంలో గురువారం మధ్యాహ్నం నుండి స్వామి వారికి పూలంగి సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తొంది. స్వామి వారిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి, అరుదైన సుంగంధ పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తారు. దీనినే పూలంగి సేవ అని కూడా పిలుస్తారు. ఎలాంటి ఆభరణాలు లేకుండా పూలతో అలంకరించిన స్వామి వారు భక్తులను మంత్రముగ్ధులను చేస్తారు.