TTD Fake Web Sites : శ్రీవారి భక్తులను బురిడీ కొట్టిస్తున్న సైబర్ కేటుగాళ్లు, టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్ సైట్!
TTD Fake Web Sites : మరో నకిలీ వెబ్ సైట్ పై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీటీడీ పేరుతో పుట్టుకొస్తు్న్న నకిలీ వెబ్ సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
TTD Fake Web Sites : కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి క్షణకాలం పాటు దర్శనం కోసం భక్తులు పరితపించి పోతుంటారు. వేల కిలోమీటర్ల సైతం లెక్క చేయకుండా శ్రీనివాసుడి సన్నిధికి చేరుకుంటూ ఉంటారు భక్తులు. అయితే ఇలా వచ్చిన భక్తులకు టీటీడీ వివిధ పద్ధతుల ద్వారా శ్రీవారి దర్శనాలు కల్పిస్తుంది. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి సిఫార్సు లేఖలు పొంది దర్శనం చేసుకుంటే, మరికొందరు ఆన్లైన్ లో టికెట్లను బుక్ చేసుకుంటే, మరికొందరు సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు, దివ్యదర్శనం, ఆర్జిత సేవ ద్వారా స్వామి వారి దివ్య మంగళ స్వరూపం దర్శించి పునీతులు అవుతుంటారు. అయితే అధిక శాతం టీటీడీ ఆన్లైన్ విధానం ద్వారానే టికెట్లు, గదుల కేటాయింపు లాంటివి కొనసాగిస్తూ ఉంటుంది. ఆన్లైన్ లో దర్శన టోకెన్లు, గదులను బుక్ చేసుకునే భక్తులకు వెబ్‌సైట్లపై అవగాహన ఎంతో అవసరం. టీటీడీ వెబ్‌సైట్ యే కదా అని ఏదొక వెబ్ సైట్ లో టికెట్లు, గదులు బుక్కింగ్ చేసుకుంటే ఇక సైబర్ మాయగాళ్ల వలలో పడిపోయినట్టే.
పుట్టగొడుగుల్లా నకిలీ వెబ్ సైట్లు
అవగాహన లేని భక్తులను సైబర్ మాయగాళ్లు టార్గెట్ చేసుకుని వివిధ రూపాల్లో దోచేస్తున్నారు. ఇలాంటి వెబ్‌సైట్లపై టీటీడీ ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేస్తున్నా, సైబర్ కేటుగాళ్లు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ అమాయకపు భక్తులను సులువుగా మోసం చేస్తున్నారు. టీటీడీ వెబ్ లైట్ లో దర్శన టోకెన్లు, గదులు దొరికాయని నమ్మి సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తుల ఆశలు అడియాసలు గానే మిగిలి పోతున్నాయి. చివరికి తాము మోసపోయామని గ్రహించి టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసి వెళ్లిపోతున్నారు. ఇలా నకిలీ వెబ్సైట్లపై అధికంగా ఫిర్యాదులు రావడంతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో పుట్టగొడుగుల వెలసిన నకిలీ వెబ్ సైట్లపై టీటీడీ దృష్టి సారించింది. టీటీడీ పేరు మీదుగా ఉన్న నకిలీ వెబ్ సైట్లు ఏది నిజమైన వెబ్ సైట్ కనుక్కోవడం టీటీడీ ఐటీ విభాగం అధికారులకే కష్టతరంగా మారింది. ఇలా దాదాపు 40కి పైగా నకిలీ వెబ్ సైట్లను టీటీడీ గుర్తించింది.
40 నకిలీ వెబ్ సైట్ల పై ఫిర్యాదు
టీటీడీ పేరుతో భక్తులను మోసగిస్తున్న 40 వెబ్ సైట్లపై గత వారంలో పోలీసులకు టీటీడీ ఐటీ జీఎం సందీప్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దర్శన టోకెన్లు వసతి గదులు కేటాయింపు అదేవిధంగా టీటీడీలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోసం చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో మరో నకిలీ వెబ్ సైట్ ను టీటీడీ ఐటీ విభాగం గుర్తించి తిరుపతి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ 19/2023 యు/ఎస్ 420, 468, 471 ఐపీసీ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్ కు అప్పగించారు. ఈ మేరకు సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్ సైట్ పై విచారణ ప్రారంభించారు. ఇది వరకే 40 నకిలీ వెబ్ సైట్లపై కేసులు నమోదు కాగా, దీంతో కలిపి కేసుల సంఖ్య 41కి చేరింది. అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ఇలా ఉండగా, చిన్న మార్పులతో కొందరు వ్యక్తులు రూపొందించిన https://tirupatibalaji-ap-gov.org/ వెబ్ సైట్ ను టీటీడీ గుర్తించింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతుంది. దీంతో పాటు టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ను TTDevasthanams కూడా వినియోగించవచ్చని కోరుతుంది.