Tirumala News : తిరుమల శ్రీవారికి భక్తులు భారీ విరాళం, ఒక్క రోజులో విరాళాల్లో అత్యధికం
Tirumala News : తిరుమల శ్రీవారికి భక్తులు భారీ విరాళాలు సమర్పించుకున్నారు. ఒక్క రోజు విరాళాల్లో ఇదే అత్యధికమని టీటీడీ తెలిపింది. తమిళనాడుకు చెందిన భక్తులు టీటీడీకి చెందిన వివిధ ట్రస్టులకు రూ. 10 కోట్లు అందించారు భక్తులు.
Tirumala News : తిరుమల శ్రీవారికి ఒకే రోజు భక్తులు భారీ విరాళం అందించారు. తమిళనాడు తిరునెల్వేలికి చెందిన గోపాల బాలకృష్ణ అనే భక్తుడు ఏడు కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. టీటీడీలోని వివిధ ట్రస్టులైన శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు, శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టు, బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రిహాబిలేషన్ ఫర్ డిసేబుల్డ్, శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టు, శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాద ట్రస్టు, శ్రీ వేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టు, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టులకు కోటి రూపాయల చొప్పున మొత్తం ఏడు కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.
రూ. 10 కోట్లు విరాళాలు
తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలికి చెందిన ప్రైవేటు కంపెనీ అధినేత బాలకృష్ణ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టు, సీ-హబ్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ కి కోటి రూపాయలు విరాళం అందించగా, టీటీడీ వేంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్టుకు కోటి రూపాయలు అందించారు. వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఏ-స్టార్స్ టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు మరో కోటి రూపాయలను విరాళంగా అందించారు. దీంతో ఒకే రోజు దాదాపు పది కోట్ల రూపాయలను వివిధ ట్రస్టులకు విరాళంగా భక్తులు అందించారు. నిన్న రాత్రి తిరుమలలోని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో దాతలు డీడీలను అందజేశారు.
కళ్యాణమస్తు కార్యక్రమం
వివాహాల విషయంలో పేదవారికి అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తున్నారు. కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పున ప్రారంభించి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీ ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజేశఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమస్తు పేరు మీదుగా ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహించారని గుర్తు చేశారు. వైఎస్సార్ మరణం తరువాత ఈ కార్యక్రమం అర్ధంతరంగా నిలిపి వేశారని, వైసీపి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పున: ప్రారంభించాలని తమ పాలకమండలి నిర్ణయం తీసుకుందని టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి వివరించారు. పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారమై వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు జరిపించనున్నామని చెప్పారు.