Tiger Migration: శ్రీకాకుళం జిల్లాను వణికిస్తోన్న పెద్ద పులి - ఆ గ్రామాల్లో టెన్షన్ టెన్షన్
Srikakulam News: శ్రీకాకుళం జిల్లా వాసులను పులి వణికిస్తోంది. కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లోని గ్రామాల ప్రజలు పులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు.
Tiger Movement In Srikakulam District: సిక్కోలు వాసులను పెద్ద పులి వణికిస్తోంది. గత 2 రోజులుగా కోటబొమ్మాళి (Kotabommali), సంతబొమ్మాళి మండలాల్లో బెంగాల్ టైగర్ సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి పొడుగుపాడు సమీపంలో రోడ్డు దాటుతుండగా పులిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమీప ప్రాంతాల్లో పులి ఆనవాళ్లు గుర్తించిన అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా, ఇటీవలే ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. ఓ యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన మరువకముందే సంతబొమ్మాళి మండలం హనుమంతునాయుడుపేట పంచాయతీలో ఓ ఆవుపై దాడి చేసి చంపేసింది.
ఈ క్రమంలో టెక్కలి (Tekkali) నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పులి జాడ కోసం అటవీ సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. ఒంటరిగా రాత్రి పూట ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. పెద్ద పులి భయంతో సాయంత్రమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనం వణుకుతున్నారు. పశువులపై దాడి చేస్తుండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 20 నుంచి 30 కిలోమీటర్లు నడుస్తూ పశువులే టార్గెట్‌గా పులి రోజుకో మండలంలో సంచరిస్తోంది.
మంత్రి అచ్చెన్నాయుడు ఆరా
అటు, పులి సంచారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో పెద్ద పులి ఆనవాళ్లు గుర్తించామని.. ఒడిశా నుంచి పులి టెక్కలి వైపు వచ్చి ఉంటుందని అటవీ అధికారులు మంత్రికి వివరించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో గ్రామాల్లో చాటింపు వేయించిన అధికారులు.. కరపత్రాలు పంపిణీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని.. గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు.
తెలంగాణలోనూ..
అటు, తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కొన్ని రోజులుగా పులులు స్వైర విహారం చేస్తున్నాయి. పశువుల మందలపై దాడులు చేస్తూ వచ్చాయి. చివరకు పత్తి ఏరుతున్న ఓ యువతిపై దాడి చేసి చంపేసింది. కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి శుక్రవారం ఉదయం మరో ఆరుగురు మహిళలతో కలిసి నజ్రుల్‌నగర్ గ్రామ శివారులోని చేనులోకి పత్తి ఏరేందుకు వెళ్లారు. కొంతసేపటికే చేనులోకి వచ్చిన పెద్దపులి మహిళపై దాడి చేసి నోట కరచుకుని వెళ్లింది. అక్కడున్న వారు కేకలు వేయడంతో ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. స్థానికులు తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
ఈ ఘటనతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. కాగజ్‌నగర్ మండలంలో ఆంక్షలు విధించారు. దాదాపు పది, పదిహేను గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. గన్నారం, ఈజ్గామ్, ఆరెగూడ, నజ్రూల్ నగర్, బాబూనగర్, అనుకోడా, సీతానగర్, కడంబా, చింతగూడ ప్రజలు బయటకు రావద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని హెచ్చరించారు. అటు, సిర్పూర్ (టి)మండలంలోని దుబ్బగూడ గ్రామానికి చెందిన రైతుపై శనివారం పులి దాడి చేసింది. పొలంలో పని చేస్తుండగా పెద్దపులి దాడి చేసింది. పక్కనే ఉన్న వారంతా గట్టిగా కేకలు వేసి అరవడంతో పులి భయపడి పారిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న సురేష్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆయనకు సిర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.
Also Read: Vishnu Meet Lokesh: నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు - ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల కోసమేనా ?