Vishnu Meet Lokesh: నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు - ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల కోసమేనా ?
Manchu Vishnu: మంచు విష్ణు నారా లోకేష్ ను కలిశారు. ఏ అంశాలపై చర్చించారో చెప్పలేదు కానీ చాలా మాట్లాడుకున్నామన్నారు.
Manchu Vishnu meets Nara Lokesh : మంచు విష్ణు ఏపీ మంత్రి నారా లోకేష్‌తో సమావేశం అయ్యారు. తన సోదరుడితో చాలా విషయాలు చర్చించానని ఆయనకు మరింత పవర్ ఇవ్వాలని ఈ సందర్భంగా చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. నారా లోకేష్ పాజిటివ్ ఎనర్జీ బ్రిలియంట్ అని ప్రశంసించారు.
Had a very fruitful interaction with my brother and the dynamic Minister of Higher education Sri @naralokesh on various topics. His positive energy is just brilliant. God Speed my brother and more power to you! Har Har Mahadev! pic.twitter.com/Yv7SqNODv9
— Vishnu Manchu (@iVishnuManchu) November 30, 2024
అసలు ఏ అంశంపై సమావేశమయ్యారో మంచు విష్ణు ప్రకటించలేదు. మంచు విష్ణు సినీ హీరో, నిర్మాత మాత్రమే కాదు విద్యావేత్త కూడా. మంచు మోహన్ ప్రారంభిచిన విద్యానికేతన్ విద్యాసంస్థలతో పాటు మోహన్ బాబు యూనివర్శిటీ బాధ్యతలను కూడా ఆయన చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంబీయూ పని మీదనే నారా లోకేష్ తో సమావేశమయ్యారని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధుల కోసం ఆయన నారా లోకేష్ ను కలిసి ఉంటారని భావిస్తున్నారు. నారాలోకేష్ విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారు.
గత ప్రభుత్వం ఫీజురీఎంబర్స్ మెంట్ కాలేజీలకు ఇవ్వలేదు. విద్యార్థి తల్లి ఖాతాల్లో జమ చేసింది. వారు కాలేజీకి కట్టాల్సిఉంది. ఇలా చేయడం వల్ల చాలా వరకూ విద్యార్థులు ఫీజులు కట్టలేకపోయారు. అదే సమయంలో మూడు త్రైమాసికాలుగా వైసీపీ ప్రభుత్వం ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనూ ఫీజు జమ చేయలేదు. దాంతో వారు సొంతంగా కట్టుకోవాల్సి వస్తోంది. ఇలా చేయడం వల్ల.. చదువు అయిపోయిన వారి సర్టిఫికెట్లు కూడా కాలేజీ వద్దనే ఉంటున్నాయి. ఫీజులు చెల్లించి తీసుకెళ్లాలని అంటున్నాయి.
ఇలాంటి ఫీజుల భారం ఎక్కువగా ఉండటంతో తన కాేలేజీకి రావాల్సిన వాటిని ఇప్పించాలని కోరుతూ మంచు విష్ణు నారా లోకేష్ నుకలిసినట్లుగా తెలుస్తోంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ తో పాటు గత ప్రభుత్వం విద్యాశాఖకు రూ. ఆరు వేలు ఐదు వందల కోట్ల మేర బిల్లులు పెండింగ్ లో పెట్టిపోయిందని నారా లోకేష్ మండిపడుతున్నారు. విడతలవారీగా చెల్లించి విద్యార్థులకు సమస్యలు లేకుండా చేస్తామన్నారు.ఈ ఏడాది నుంచి నేరుగా కాలేజీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టేలా నిర్ణయం తీసుకున్నారు.
2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో మంచు విష్ణుతో పాటు మంచు మనోజ్, మోహన్ బాబు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేసి రోడ్డుపై ధర్నా చేశారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. తర్వాత మోహన్ బాబు వైసీపీలో చేరారు. ఈ ధర్నాపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసులు కూడా నమోదయ్యాయి.