GVL Vs Vishnu : విష్ణు ఖండిస్తే జీవీఎల్ స్వాగతించారు - రోడ్ షోలు - ర్యాలీల నిషేధంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు !
ఏపీలో ప్రచార ర్యాలీలు, రోడ్ షోల నిషేధంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విష్ణువర్ధన్ రెడ్డి ఖండిస్తే.. జీవీఎల్ స్వాగతించారు.
GVL Vs Vishnu : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో రాజకీయ పార్టీలను నియంత్రించేలా రోడ్ షోలు, ర్యాలీలు నిషేధించడం, అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే అనుమతి ఇస్తామని జీవో జారీ చేయడం వివాదాస్పదమవుతోంది. ఈ అంశంపై రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. అయిేత ఏపీ బీజేపీలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జీవో గురించి తెలిసిన వెంటనే ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ సోషల్ మీడయా ఇంచార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఇది ప్రతిపక్షాలను నియంత్రించాలనే కుట్ర అని ఆరోపించారు. చీకటి జీవోగా పేర్కొన్నారు.
విష్ణువర్ధన్ రెడ్డి వ్యతిరేకిస్తే విశాఖలో జీవీఎల్ సమర్థిస్తున్నట్లుగా స్పందన
అయితే విశాఖలో మాట్లాడిన జీవీఎల్ నరసింహారావు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లుగా మాట్లాడారు. కొంత కాలం అయినా నియంత్రణ విధించాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్యంలో పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం ప్రాథమిక హక్కు అని దాన్ని తొలగిస్తామంటే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీలను నియంత్రించడానికే ఇలాంటి జీవోలు తీసుకొస్తే మాత్రం ఖండిస్తామన్నారు. జీవీఎల్ నరసింహారావు రెండు విధాలుగా స్పందించారు. ప్రతిపక్షాలను నియంత్రించడానికే జీవోలు తెచ్చారని జీవీఎల్ అనుకోవడం లేదు. రాజకీయ పార్టీలు స్వీయ నియంత్రణ పాటించాలని ఓ సారి... ఆ జీవోను అమలు చేయాల్సిన అవసరం ఉందని మరోసారి సమాధానం చెప్పి గందరగోళపరిచారు.
జీవోపై పెద్ద ఎత్తున వస్తున్న విమర్శలు
మరో వైపు ఈ జీవో అంశంపై రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నా... అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకి్తున్నాయి. ఇది కుట్ర పూరితంగా తీసుకున్న నిర్ణయంగా అనుమానిస్తున్నారు. టీడీపీ నేతలు .. చంద్రబాబు, లోకేష్ ప్రజల్లోకి వెళ్తున్నందున వారిని ఆపడానికి .. కుట్రు చేసి ప్రజలు చనిపోయేలా చేసి ఈ జీవో తెచ్చారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అలాంటిదేం లేదని.. ప్రజల ప్రాణాలు కాపాడటానికే ఈ జీవో ఇచ్చామంటున్నారు.
ఇప్పటికే జీవో అమలు ప్రారంభం - చంద్రబాబు కుప్పం పర్యటనపై ఆంక్షలు
ఈ జీవో అమలును ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. కుప్పం పర్యటనకు వెళ్తున్న చంద్రబాబుకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. టూర్ డీటైల్స్ ఇస్తే అనుమతి గురించి పరిశీలిస్తామని అనుమతి తీసుకోకుండా రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయ పార్టీలన్నీ.. ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో జారీ చేసిన ఈ జీవోలు ఇప్పుడు కలకలానికి కారణం అవుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం సమర్థించుకుంటోంది. ఈ ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయని.. వైసీపీ కూడా వర్తిస్తాయని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. అయితే కరోనా సమయంలో కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టారని కానీ వైసీపీ నేతలు ఎక్కడ పాటించారని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ ఏపీకి వస్తే ఊరుకోం, కుట్రపూరితంగా హైదరాబాద్ ను తెలంగాణకు ఇచ్చారు - మంత్రి రోజా