Minister Roja : బీఆర్ఎస్ ఏపీకి వస్తే ఊరుకోం, కుట్రపూరితంగా హైదరాబాద్ ను తెలంగాణకు ఇచ్చారు - మంత్రి రోజా
Minister Roja : ఏపీలో బీఆర్ఎస్ కలకలం రేగుతోంది. వైసీపీ నేతలు, మంత్రులు బీఆర్ఎస్ ఎంట్రీపై స్పందిస్తున్నారు. మంత్రి రోజా స్పందిస్తూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన పార్టీలో చేరే వారికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
Minister Roja : చంద్రబాబు, లోకేశ్, పవన్ లకు అధికారమే పరమావధిగా రాజకీయం చేస్తున్నారని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. మంగళవారం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో ప్రతిపక్షాలు పనికి మాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడడం ప్రజలంతా చూస్తున్నారన్నారు. వేంకటేశ్వర స్వామిని ప్రతిపక్షాలకు గట్టిగా బుద్ది చెప్పాలని కోరుకున్నట్లు తెలిపారు. 2022లో ప్రతిపక్షాలు నీతిమాలిన రాజకీయం చేశాయన్న మంత్రి రోజా, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాకుండా, ప్రజలు సంతోషంగా ఉండే సమయంలో వచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తారని విమర్శలు గుప్పించారు. పేదరికంలో ఉన్న ప్రజలకు ఆశ చూపి ప్రజల ప్రాణాలను బలిగొనడంతో పాటు, కాళ్లు, చేతులు విరిచేలా హేయమైన చర్యలు చేస్తున్నారన్నారు.
పవన్ ఎందుకు నోరు మెదపడంలేదు
ప్రజల జీవితాలతో నిజంగా చెలగాటం ఆడిన వారికి దేవుడు బుద్ధి చెప్పాలని కోరుకున్నానని మంత్రి రోజా అన్నారు. కందుకూరిలో అన్యాయంగా ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలను తీశారని, బుద్ధి లేకుండా మళ్లీ గుంటూరులో పేదలకు ఆశ చూపి ముగ్గురు ప్రాణాలు పోగొట్టాడని చంద్రబాబు కారణం అయ్యారన్నారు. కనీసం క్షతగాత్రులను పరామర్శించకుండా మానవత్వం లేకుండా హైదరాబాద్ కు వెళ్లి ఎంజాయ్ చేశారని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ ప్రజల కోసం పార్టీ పెట్టానని చెప్తారు కానీ, చంద్రబాబు సభలో మొన్న ఎనిమిది మంది, నిన్న ముగ్గురు చనిపోయిన, చాలా మంది ప్రజలు ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతుంటే పవన్ నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటంలో అన్యాయంగా, అక్రమంగా నిర్మించిన గోడలు కొడితే మాత్రం ఏదో తప్పు అయినట్లు డబ్బులు ఇచ్చారని, చంద్రబాబు సభలో ప్రాణాలు పోగొట్టున్న వారికి పవన్ ఎందుకు డబ్బులు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కానీ, పవన్ కానీ, లోకేశ్ కానీ అధికారమే పరమావధిగట ఉన్నారే తప్పా వీరికి ప్రజలపై ప్రేమ లేదని పేర్కొన్నారు.
ప్రజల ప్రాణాలను తీసి ప్రభుత్వంపై విమర్శలు
చనిపోయిన కుటుంబాలను పరామర్శించాల్సిన లోకేశ్ పనికి మాలిన ట్వీట్ లు చేస్తున్నాడని మంత్రి రోజా విమర్శించారు. వైసీపీ నాయకుల కుట్ర అంటూ లోకేశ్ ట్వీట్ చేశారని ఆక్షేపించారు. టీడీపీ తరపున శ్రావణ్ కుమార్ ఎందుకు సభ అనుమతికి లేఖ పెట్టారని ప్రశ్నించారు. చంద్రబాబు వస్తున్నారని ఎందుకు ప్రచారం చేశారని అడిగారు. పది వేల మందికి అనుమతి తీసుకున్న మీరు, ముప్ఫై వేల మందికి టోకెన్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సభలో తొక్కిసలాట కారణమైంది టీడీపీనా, వైసీపీనా చెప్పాల్సిన అవసరం లోకేశ్ కి ఉందన్నారు. పది వేల మందికి అనుమతి తీసుకుని, ముప్పై వేల మందికి టోకెన్లు ఇచ్చి, వెయ్యి మందికి పంచితే తొక్కిసలాట జరగదా అని ప్రశ్నించారు. ఇంత ఘోరంగా ప్రజల ప్రాణాలను తీసి ప్రభుత్వంపై వేసి, పోలీసులను తిట్టడం ఫ్యాషన్ గా మారిందని మండిపడ్డారు. పోలీసులు సక్రమంగా పని చేశారు కాబట్టే ముగ్గురు ప్రాణాలు మాత్రమే పోయిందన్నారు. టీడీపీ చేతగానీ తనం, పబ్లిసిటీ పిచ్చి కారణంగా చనిపోయారు కాబట్టి దీనికి బాధ్యత టీడీపీ వహించాలన్నారు. చంద్రబాబు, లోకేశ్, శ్రావణ్ బాబును ముద్దాయిలుగా చేర్చి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. చనిపోయినా ముగ్గురు కుటుంబాలకు చంద్రబాబు రెండు కోట్లు రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాయాలైన వారికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పై ఫైర్
ఏపీలో బీఆర్ఎస్ పార్టీపై స్పందిస్తూ...ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది ఎవరని ప్రశ్నించారు మంత్రి రోజా. వాళ్ల రాష్ట్రం వాళ్లు తీసుకుని మళ్లీ బీఆర్ఎస్ పేరుతో రాష్ట్రంలోకి వస్తే ఊరుకోమన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన బీఆర్ఎస్‌ను ప్రజలు ఆదరించరన్నారు. విభజన చట్టంలో హామీలను నేరవేర్చని పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏపీకి రాజధాని కూడా లేకుండా చేసిన పార్టీలో చేరే వారికి ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రి రోజా అన్నారు. కుట్రపూరితంగా హైదరాబాద్ ను తెలంగాణకు ఇచ్చారన్నారు.