TDP News : కన్నాకు టీడీపీలో ఆ పోస్ట్ - చంద్రబాబు స్కెచ్ వేస్తే అలాగే ఉంటుందా ?
కన్నాకు టీడీపీలో కీలక పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన సీనియార్టీని, అనుభవాన్ని రాష్ట్రం మొత్తం ఉపయోగించుకోవాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
TDP News : భారతీయ జనతా పార్టీ నుంచి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మినారాయణకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమయింది. ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఎన్నికల రాజకీయాల్లో ఆయన వ్యూహాలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందుకే ఓ కీలక పదవిని ఆయనకు అప్పగించబోతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీలో చేరిన వెంటనే అందర్నీ కలుపుకుని వెళ్తున్న కన్నా
కన్నా లక్ష్మినారాయణ...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నే కీలక నేతగా వ్యవహరించిన ఆయన ఇటీవలే తెలుగు దేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే టీడీపీ నేతలందరితో కలిసి పని చేసేందుకు అవసరమైన గ్రౌండ్ రెడీ చేసుకున్నారు. తన రాక వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని చేతలతో చూపించారు. అందరి ఇళ్లకు వెళ్లి కలిశారు. అందర్నీ పిలిచి తన ఇంట్లో విందు కూడా ఇచ్చారు. టీడీపీ నేతలు ఎవరు పిలిచినా వెళ్లి వారి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గుంటూరులో రాయపాటి కుటుంబంతో ఉన్న విభేదాలను సైతం పక్కన పెట్టేశారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మినారాయణ కు టీడీపీలో వ్యతిరేకులెవరూ లేరు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కన్నా లక్ష్మినారాయణకు కొన్ని కీలక బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్నారు.
గుంటూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసే బాధ్యత తీసుకున్న కన్నా
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ స్దానాలు, మూడు పార్లమెంట్ స్దానాలు గెలిపించేందుకు కన్నాకు బాద్యతలను అప్పగించారని చెబుతున్నారు. ఇప్పుడున్న పార్టీ నేతలు సైతం కన్నాకు టచ్ లోకి వెళ్లారు. వారంతా కన్నా కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. సుదర్గ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా.. మంత్రిగా కూడా అత్యధిక కాలం పని చేశారు. రోశయ్య సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేసులో కన్నా పేరు కూడా వినిపించింది. తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో రాజకయాలు మారిపోయాయి. ఆయన ఒడి దుడుకులు ఎదుర్కొన్నప్పటికి ఇప్పుడు ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. టీడీపీలో ఆయన యాక్టివ్ అయ్యారు. గుంటూరు జిల్లాలో అన్ని స్థానాలను టీడీపీ గెలిచేలా ఆయన వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు.
ఏపీ టీడీపీఅధ్యక్ష పదవి ఇస్తారా ?
కన్నా లక్ష్మినారాయణ సీనియర్ నేత మాత్రమే కాదు... ఎన్నికల్లో గెలుపోటముల్ని నిర్దేశిస్తాయని భావిస్తున్న కాపు సామాజికవర్గం నేత. ఆయనకు తన వర్గంలో మంచి పలుకుబడి ఉంది. అందుకే ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా అవకాశం ఇవ్వవొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. దీంతో అధ్యక్షుడి మార్పు ఉంటుందని అంటున్నారు. ఒక వేళ అధ్యక్ష పదవి కాకపోయినా కన్నా రాజకీయ అనుభవాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవడానికి కీలకమైన బాధ్యతలే చంద్రబాబు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు.