TDP Support Employees : ఉద్యోగుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు .. ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చాలని చంద్రబాబు, లోకేష్ డిమాండ్ !
ఉద్యోగుల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికింది. జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చంద్రబాబు, లోకేష్ డిమాండ్ చేశారు.
ఉద్యోగుల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. శాంతియుతంగా చేస్తున్న ఉద్యోగుల నిరసనలపై ఉక్కుపాదం మోపడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఖండించారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సిఎం జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం రివర్స్ పిఆర్సిని వెనక్కి తీసుకుని.. నియంతృత్వం వీడి పరిష్కారం చూపాలన్నారు.
లక్షల మంది సమస్యపై అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు ఉందని.. ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా..? రాష్ట్రంలో భాగస్వాములు కాదా? అని ప్రశ్నించారు. రాజకీయ పక్షాలపై పెట్టినట్లు ఉద్యోగులపై గృహ నిర్భంధాలు పెట్టడం సిఎం జగన్ వైఖరిని స్పష్టం చేస్తున్నాయన్నారు. పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్భందించడం... విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమేనని విమర్శించారు.
చలో విజయవాడలో ఉద్యోగుల నిరసనలపై @ysjagan ప్రభుత్వ నియంతృత్వ తీరును ఖండిస్తున్నాను.ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా?విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సిఎం జగన్ సమాధానం చెప్పాలి.రివర్స్ పిఆర్సిని వెనక్కి తీసుకోవాలి..నియంతృత్వం వీడి పరిష్కారం చూపాలి.(1/5)
— N Chandrababu Naidu (@ncbn) February 3, 2022
మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఉద్యోగులను అగౌరపరిచే , ఆత్మగౌరవం దెబ్బతీసే విధానాన్ని జగన్ ఇప్పటికైనా వీడాలని హెచ్చరించారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామమని.. జగన్ సర్కార్ లా....ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి జీతాలు రికవరీ చెయ్యడం దేశంలోనే ఇప్పటి వరకు జరగలేదని ఎద్దేవా చేశారు.
.@ysjagan గారూ! ఉద్యోగుల పట్ల ఎందుకింత క్రూరంగా వ్యవహరిస్తున్నారు? తమకు న్యాయబద్ధంగా రావాల్సిన ప్రయోజనాల కోసం-మాట తప్పిన మీ ప్రభుత్వతీరుపై శాంతియుతంగా ఉద్యోగులు నిరసన తెలపడం నేరం ఎలా అవుతుంది?#TDPSupportsGovtEmployees pic.twitter.com/4tfaHltgjg
— Lokesh Nara (@naralokesh) February 3, 2022
ఉద్యోగులు న్యాయబద్దంగా రావాల్సిన ప్రయోజనాల కోసమే ఉద్యమిస్తున్నారని .ఉద్యోగులు నిరసన తెలపడం నేరం ఎలా అవుతుందని నారా లోకేష్ ప్రశ్నించారు. ఇచ్చిన మాట తప్పనని బీరాలు పలికి ఇప్పుడు మాట తప్పుతున్నారని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల్లో వారు వాటాలు అడగడం లేదని.. విశ్వసనీయత అనే పదం అర్థం తెలిస్తే..ప్రభుత్వ ఉద్యోగులకు మీరు ఇస్తామన్నవన్నీ ఇవ్వాలని సలహా ఇచ్చారు. ఉద్యోగుల ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు ప్రకటించారు.