Tirupati Stampede: ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే - తిరుపతిలో ఘోర విషాదానికి అసలు కారణం ఏంటో తెలుసా?
Tirupati News: తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదం నింపింది. ఓ వ్యక్తి అస్వస్థతకు గురి కాగా వైద్యం అందించేందుకు గేట్లు తెరవడంతో పొరపాటున భక్తులు ఒక్కసారిగా వెళ్లడం వల్లే ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
The Reason Behind Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనతో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం రాత్రి ఎటుచూసినా బాధితుల ఆర్తనాదాలు, బాధితులకు పోలీసులు, స్థానిక భక్తులు సీపీఆర్ చేసిన దృశ్యాలే కనిపించాయి. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 48 మందికి గాయాలయ్యాయి. అయితే, ఘటనకు పోలీసుల, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కూడా కారణమని.. సరైన ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. తిరుపతిలోని 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేస్తామని తెలపగా.. బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు. బుధవారం సాయంత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది.
4 ప్రాంతాల్లో తొక్కిసలాట
జీవకోన, బైరాగిపట్టెడ, శ్రీనివాసం, అలిపిరి ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. తొలుత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తోపులాట జరగ్గా.. రాత్రి 7 గంటల సమయంలో భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించబోయారు. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించినా ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది. ఎస్పీ సుబ్బారాయుడు అక్కడికి వెళ్లి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఇక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందని భావిస్తుండగానే.. ఎక్కువ మంది భక్తులుండడంతో అధికారులు వారిని పక్కనే ఉన్న శ్రీ పద్మావతి పార్కులోకి అనుమతించారు.
అసలు కారణం ఇదే..
బుధవారం రాత్రి 8:15 గంటల సమయంలో పార్కులో ఉన్న ఓ వ్యక్తి అస్వస్థతకు గురి కావడంతో ఆయనకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారు. అయితే, క్యూలైన్లలోకి వదిలేందుకే గేట్లు తెరుస్తున్నారని భావించిన కొందరు ఒక్కసారిగా దాన్ని బలంగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో చాలామంది భక్తులు కింద పడిపోయారు. ఈ క్రమంలో ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సులో రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రికి వెళ్లే సమయానికే నలుగురు మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. బైరాగిపట్టెడ వద్ద జరిగిన ఘటనలోనే ఆరుగురు చనిపోయారు. అటు, సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, ఎస్పీ సుబ్బారాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు.
గతంలో బారికేడ్లను ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితిని అనుసరించి భక్తులను క్యూలైన్లలోకి అనుమతించేవారు. ఎన్నడూ లేని విధంగా బైరాగిపట్టెడ టోకెన్ల కేంద్రం వద్ద ఉన్న పార్కులోకి భక్తులను అనుమతించారు. బుధవారం మధ్యాహ్నం నుంచి అక్కడే కూర్చుని ఉండడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. పార్కులో ఎక్కువ మంది ఉండడం.. వారంతా ఒక్కసారిగా వెలుపలికి వచ్చేందుకు గేటును తోయడంతో కిందపడిపోయారు. ఇదే తొక్కిసలాటకు దారి తీసిందని సమాచారం.
Also Read: ఏడు కొండలు వాడా క్షమించు-ఏర్పాట్లు చేయలేకపోయాం- పురందేశ్వరి సంచలన స్టేట్మెంట్