Andhra News : ఓట్ల జాబితా పరిశీలనలోనూ వాలంటీర్లు - నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఈసీ ఆదేశం!
ఓటర్ జాబితా వెరిఫికేషన్‌లో వాలంటీర్లు పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. కర్నూలులో బీఎల్‌వోను అధికారులు సస్పెండ్ చేశారు.
Andhra News : ఏపీలో ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతోంది. ఓటర్ జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులు రావడంతో నెల రోజుల పాటు ఓటు జాబితా పునంపరిశీలన చేయించాలని ఈసీ నిర్ణయించింది. బూత్ లెవల్ ఆఫీసర్లతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా వెళ్లి సరి చూసుకోవచ్చని చెప్పింది. వాలంటర్ల జోక్యం లేకుండా చూడాలని ఈసీ ఆదేశించింది. అయితే వాలంటీర్లే.. బీఎల్వోతో పాటు ఇంటింటికి వెళ్తూండటంతో .. విపక్ష పార్టీలు మరోసారి ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఓటర్ల జాబితా పరిశీలన కోసం బీఎల్‌ఓలతో పాటు వాలెంటీర్‌లు వెళ్తున్న ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ
బీఎల్‌ఓలతో పాటు వెళుతున్న వాలెంటీర్‌ల ఫోటోలు తీసి ఎన్నికల కమిషన్ సీఈఓకు టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్.. వాలెంటీర్‌లు వెళ్లిన జిల్లాల నుంచి వెంటనే నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. వాలెంటీర్‌లను ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియలో జోక్యం చేసుకోనివ్వకూడదని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అక్రమాలను బహిర్గతం కాకుండా బీఎల్‌ఓలకు చెప్పేందుకు వాలెంటీర్‌లను కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. బీఎల్‌ఓలతో వాలెంటీర్‌లు వస్తే వెంటనే ఫోటోలు తీసి పంపాలని టీడీపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఇచ్చింది. వాలెంటీర్‌ను వెంటపెట్టుకొని వెళ్లిన ఒక బీఎల్‌ఓను కర్నూలు అధికారులు సస్పెండ్ చేశారు. తెలుగుదేశం ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకొని మరికొంతమంది బీఎల్‌ఓలు, వాలెంటీర్‌లపై చర్యలు తీసుకునేందుకు ఈసీ అధికారులు సిద్ధమవుతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా వాలెంటీర్‌ల జోక్యంపై ప్రతిపక్ష నేతలు ఫిర్యాదు చేశారు.
కర్నూలులో బీఎల్‌వో సస్పెన్షన్
కర్నూలులో ఎక్కువగా వాలంటీర్ల జోక్యం ఉన్నట్లుగా ఫిర్యాదులు రావడంతో.. ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.సుజనా సిబ్బందిని ఆదేశించారు. కర్నూలు జిల్లాలో ఇంటింటికి ఓటర్ల సర్వే కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన కర్నూల్ రెవెన్యూ డివిజన్ లోని వెల్దుర్తి మండల కేంద్రంలో బీఎల్ఓ పై సస్పెన్షన్ వేటు వేశారు. వాలంటర్‌తో కలిసి బీఎల్ఓ ఇంటింటా సర్వేలో పాల్గొన్నారు. దీంతో కలెక్టర్ డాక్టర్ సుజనా సస్పెన్షన్ కు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాన్ని నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు ఉంటాయని సూచించారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వాలంటరీతో కలిసి సర్వే చేస్తే సస్పెన్షన్స్ ఉంటాయని సూచించారు.
విశాఖలో ఓట్ల తొలగింపుపై ప్రత్యేక విచారణ
విశాఖలో 40 వేల ఓట్లను తొలగించారని టీడీపీ ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ బాబు ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఓట్ల తొలగింపుపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. కలెక్టర్ ఇచ్చిన తప్పుడు నివేదికలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. సరైన యాక్షన్ లేకపోవడం వల్లే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. న్యాయం చేయాలని కోరాం. వీటన్నిటిపైన పరిశీలించేందుకు ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని కూడా కోరాం. అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తాం. తాత్కాలిక వలసలు పేరుతో తొలగించారు. అసలు ఈ నిబంధనే లేదు. ఓట్ల తొలగింపుపై కలెక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారు ఎమ్మెల్యే ఆరోపించారు.