Polavaram : పోలవరం మొదటి దశలో 41.15 మీటర్ల మేరకే నీటి నిల్వ - తేల్చి చెప్పిన కేంద్రం !
పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వను పరిమితం చేస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది. భూపరిహార నిధుల సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
![Polavaram : పోలవరం మొదటి దశలో 41.15 మీటర్ల మేరకే నీటి నిల్వ - తేల్చి చెప్పిన కేంద్రం ! The Center has said that it is limiting the water storage in the Polavaram project. Polavaram : పోలవరం మొదటి దశలో 41.15 మీటర్ల మేరకే నీటి నిల్వ - తేల్చి చెప్పిన కేంద్రం !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/23/45afd38b3a1817a1874abb0b054666e21679565852438228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Polavaram : పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేసింది. తొలి దశలో పోలవరం ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమని స్పష్టం చేసింది. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని తేల్చి చెప్పింది. వైసీపీ ఎంపీ సత్యవతి లోక్ సభ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. తొలిదశ సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023కే పూర్తి కావాల్సి ఉందని, తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023 నాటికే ఇవ్వాల్సి ఉందని.. దానిని కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదని ప్రహ్లాద్ సింగ్ పటేల్ అన్నారు. కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఏపీ ప్రభుత్వం కల్పించినట్లు చెప్పారు. మిగతావారికి సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇంతవరకు చేయలేదని ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు.
నిజానికి పోలవరంలో మొదటి దశ.. రెండో దశ అనేది లేదు. అయితే ఆర్థిక సమస్యల కారణం ఎత్తు తగ్గించే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ కూడా పలుమార్లు తొలి దశ ప్రస్తావన చేశారు. తొలి దశలో 41.15 మీటర్ల వరకే నిటి నింపడం .. ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఎంత ఎత్తు తగ్గిస్తే ఎంత ముంపును నివారించడానికి అవకాశం ఉందన్న అంశంపై కేంద్ర జల సంఘం ,పోలవరం ప్రాజెక్టు అథారిటీ తదితర సంస్థలను సంప్రదిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. నీటి మట్టాన్ని తగ్గించటం వల్ల ముంపుతో పాటు నిర్మాణ వ్యయాన్ని నియంత్రించవచ్చు అని భావిస్తున్నారు. ప్రధానంగా పోలవరం నీటి సామర్ధ్యం , దానిని ఎంతకు తగ్గించాలి , ఎత్తు ఏ మేరకు తగ్గించాలి , అలా తగ్గిస్తే ఎంత వ్యయాన్ని నియంత్రించవచ్చు , ఏ మేరకు ముంపును తగ్గించవచ్చు అనే అంశాలపై ఇప్పటికే ఓ నిర్మయానికి వచ్చారని అంటున్నారు. అయితే ఎత్తు తగ్గించడం కన్నా.. మొదటి దశలో నీటి నిల్వను పరిమితం చేయడం మంచిదని అంచనాకు వచ్చినట్లుగా తాజా ప్రకటనతో కొంత మంది అంచనా వేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు మొత్తం 1,13,119 ఎకరాల భూమిని సేకరించారు. పోలవరం నిర్మాణంలో భూసేకరణ వ్యయం ఎక్కువగా వున్నందున రెండు దశల్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రెండు దశల్లో కలిపి మొత్తం 45.72 మీటర్ల ఎత్తు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇలా ఎత్తు తగ్గించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్దమని.. పలువురు విమర్శిస్తున్నారు. ఇటీవల ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాసిన మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పోలవరం పూర్తి రిజర్వాయర్ లెవల్ ను 150 అడుగుల నుంచి 140 అడుగులకు తగ్గిస్తే ప్రాజెక్టు నుంచి ఆశించిన ప్రయోజనాలు అందడం అసాధ్యం అని కేంద్ర జల సంఘం ఎప్పుడో చెప్పిందని గుర్తు చేశారు. పోలవరం రిజర్వాయర్ లెవల్ 140 అడుగులు మరియు 150 అడుగుల మధ్య కాంటూర్ లో సహాయ పునరావాస కార్యక్రమాలకు 30 వేల కోట్లు అవసరమవుతాయి.
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పోలవరం జాతీయ ప్రాజెక్టును ఫుల్ రిజర్వాయర్ లెవల్ 150 అడుగుల మేరకు రాష్ట్రంపై భారం లేకుండా పూర్తి కేంద్ర నిధులతో త్వరితగతిన నిర్మించి పూర్తి చేయాలని ఏపీలో విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)