Viveka Murder case Investigation : పులివెందులలో జగన్ క్యాంప్ ఆఫీస్ కొలతలు తీసుకున్న సీబీఐ - వివేకా మర్డర్ కేసులో దర్యాప్తు ముందుకే !
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. జగన్ క్యాంప్ ఆఫీస్ , అవినాష్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లను పరిశీలించి సర్వేయర్లతో కొలతలు తీసుకున్నారు.
Viveka Murder case Investigation : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మళ్లీ విచారణ ప్రారంభించింది. ఇటీవల విచారణ కాస్త నెమ్మదించింది. కొద్ది రోజులుగా అనుమానితుల్ని మళ్లీ ప్రారంభించిన సీబీఐ అధికారులు ఈ సారి క్షేత్ర స్థాయి పరిశీలన ప్రారభించారు. పులివెందులలో ఏపీ సీఎం జగన్ఇం క్యాంప్ ఆఫీస్‌ను సీబీఐ అధికారులు పరిశీలించారు. అక్కడ కొలతలు తీసుకున్నారు. సీఎం జగన్‌తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి నివాస ప్రాంతాలను కూడా సీబీఐ అధికారులు పరిశీలించారు. సర్వేయర్లతో కొలతలు తీయించారు. ఇళ్ల కొలతలు తీయించడం ఆసక్తి రేపుతోంది.
ఒత్తిళ్లతో దర్యాప్తు నెమ్మదిగా చేస్తున్న సీబీఐ
సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి ( YS Viveka ) హత్య కేసులో దర్యాప్తు విషయంలో సీబీఐ అధికారులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. సీబీఐ దర్యాప్తు అధికారిపై కూడా కేసు నమోదయింది. అయితే హైకోర్టు స్టే ఇచ్చింది. మరో వైపు ఇటీవల నిందితుల బెయిల్ పిటిషన్లను విచారిస్తున్న సమయంలో ప్రభుత్వం సహకరించడం లేదని.. ఎప్పటికి దర్యాప్తు పూర్తవుతుందో చెప్పలేమని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉందని, అందువల్ల దర్యాప్తును ముగింపునకు తీసుకు రాలేకపోతున్నామని వివరించింది.
ఎప్పటికి దర్యాప్తు పూర్తవుతుందో చెప్పలేమని కోర్టుకు తెలిపిన సీబీఐ
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు గజ్జెల ఉమాశంకర్‌రెడ్డి, ( Uma Sankar Reddy ) దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వై.సునీల్ యాదవ్‌లు జైల్లో ఉన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారారు. వివేకా రాసినట్లు చెబుతున్న లేఖను ఢిల్లీలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, అక్కడి నుంచి నివేదిక అందాల్సి ఉందని సీబీఐ ( CBI ) చెబుతోంది. ఈ కేసులో నిందితులు దర్యాప్తునకు పలు రకాలుగా ఆటంకాలు కలిగిస్తున్నారని సీబీఐ డ్రైవర్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారని అంటున్నారు. ఈ క్రమంలో దస్తగిరిపైనా కేసు నమోదు కావడం కలకలం రేపింది.
వివేకాను ఎవరు హత్య చేశారో తెలుసుకోవాలనుకుంటున్న జనం
వివేకా హత్య కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించినప్పటి నుంచి వివిధ కారణాలతో విచారణ నత్త నడకన సాగుతోంది. హైప్రోఫైల్ కేసు కావడంతో పాటు అధికారుల నుంచి సహకారం కూడా లేకపోవడంతో దర్యాప్తు బృందం ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. అయితే ఇప్పటికే చార్జిషీట్లను ( Chargesheet ) దాఖలు చేసింది. వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలనుకుంటున్నారు.