CPS Vs GPS : సీపీఎస్ రద్దు చేసే చాన్సే లేదు - ఏపీ ఉద్యోగులకు మరోసారి తేల్చేసిన ప్రభుత్వం !
సీపీఎస్ రద్దు చేయబోమని ఉద్యోగ సంఘ నేతలకు మరోసారి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మరోసారి చర్చలకు పిలవవద్దని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి.
CPS Vs GPS : పాత పెన్షన్ స్కీం అమలు చేయటం సాధ్యం కాదని మంత్రుల కమిటీ మరోసారి ఉద్యోగ సంఘం నేతలకు స్పష్టం చేసింది. ఉద్యోగులు జిపిఎస్ కు అంగీకరించి, సహకరించాలని కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీనిపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ససేమిరా అనడంతో చర్చలు ఎటూ తేలకుండానే ముగిసాయి. మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో మంత్రుల కమిటీ చర్చలు జరుపుతోంది. ఎన్ని సార్లు చర్చలు జరిగినా ప్రభుత్వం, ఉద్యోగులు తమ మాట మీదే ఉన్నారు. ఇప్పటికై జీపీఎస్ ను అంగీకరించాలని మంత్రులు బొత్స, బుగ్జన ఒత్తిడి తేగా... ఒప్పుకునేది లేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పాత పెన్షన్‌పై చర్చిద్దాం అన్న మీదటే చర్చలకు వచ్చామని పిలిచి మరలా జీపీఎస్ గురించే మాట్లాడుతున్నారని.. ఇకపై అసలు చర్చలకు పిలవవద్దు అని చెప్పామని ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు.
మరోసారి చర్చలకు పిలువవద్దన్న ఉద్యోగసంఘాలు
ప్రభుత్వం తీరు పై ఉద్యోగ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మిలియన్ మార్చ్ ద్వారా సీపీఎస్ మహమ్మారిని తరిమి కొట్టాలని బావించామని .. గత 7 సంవత్సరాల్లో పోలీసుల అనుమతి లేకపోతే ఏ కార్యక్రమం చేయలేదన్నారు. సీఎం ఎం ఇల్లు ముట్టడి నెపాన్ని చూపి తమకు సంబంధం లేకపోయినా కేసులు పెట్టారని మండిపడ్డారు. అక్రమ కేసులను రద్దు చేయాలని కోరామన్నారు. డీజీపీని కలిసి కేసులు ఎత్తివేయాలని కోరనున్నట్లు చెప్పారు. అక్రమ కేసులు పెట్టినందున మంత్రులు బొత్స, బుగ్గనలకు వినతి పత్రం ఇచ్చామని ఉద్యోగ సంఘం నేతలు చెప్పారు సెప్టెంబర్ 11న మిలియన్ మార్చ్, చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి ఇస్తే చేస్తాము లేకపోతే మరల వాయిదా వేస్తామని ఉద్యోగ నేతలు చెబుతున్నారు.
ఉద్యోగులు అంగీకరించకపోయినా కొత్త విధానం అమలుకు చర్యలు
అయితే సీపీఎస్ రద్దు చేసే ప్రశ్నే లేదని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కానీ ఇటీవల పలు రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నాయి. జార్ఖండ్, రాజస్తాన్, చత్తీస్ ఘడ్ కూడా సీపీఎస్‌ను రద్దు చేశాయి. ఈ కారణంగా ఉద్యోగుల్లోనూ ఆశలు పెరిగాయి. కొంత మంది ఉద్యోగ సంఘం నేతల్ని ఆయా రాష్ట్రాలకు పంపి పరిశీలన కూడా చేయించుకొచ్చారు. ఇంటలిజెన్స్ సిబ్బంది వెంట వారు అనధికారికంగా వెళ్లి అమలు తీరును పరిశీలించి వచ్చారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయలేదు. కానీ చర్చల పేరుతో పదే పదే పిలుస్తున్నారు.
ఉద్యోగులకు కేసుల భయం
వచ్చే కేబినెట్ మీటింగ్‌లో సీపీఎస్ రద్దు చేయకుండా... ఉద్యోగులకు జీపీఎస్ అమలుచేయాలని నిర్ణయం తీసుకోనున్నట్లుగా చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల్లో చీలిక తీసుకు వచ్చి ఈ నిర్ణయానికి కొంత మందితో అయినా ఆమోదముద్ర వేయించాలని ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో సీపీఎస్ రద్దు అంశం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.