Ramya Murder: రమ్య మృతదేహం తరలింపు అడ్డగింత.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు, ఫ్యామిలీకి నగదు చెక్కు అందించిన హోంమంత్రి
ఆదివారం (ఆగస్టు 15)న హత్యకు గురైన రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రమ్య మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లనివ్వకుండా వారు అడ్డుకున్నారు.
గుంటూరులో ఆదివారం నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయింది. గుంటూరులోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో ఆమె మృతదేహానికి పోస్టు మార్టం చేశారు. ఆ వెంటనే రమ్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు యత్నించే క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. టీడీపీ సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు జీజీహెచ్ దగ్గరికి చేరుకొని నిరసన చేపట్టారు. రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రమ్య మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లనివ్వకుండా విపక్షాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. రమ్యను చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలని వారు అక్కడే కూర్చొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూడాలని నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళనలతో రమ్య మృతదేహాన్ని మరో మార్గం ద్వారా తరలించాలని చూస్తున్నారు.
మరోవైపు, బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను హోంశాఖ మంత్రి సుచరిత పరామర్శించారు. సోమవారం మంత్రి గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లి వారిని కలిశారు. అదే సమయంలో ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్కును అందజేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని మంత్రి సుచరీత హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుచరీత మాట్లాడుతూ.. ‘‘తాడేపల్లి ఘటనలో నిందితుల్లో ఒకరిని గుర్తించి పట్టుకున్నామని తెలిపారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగానే ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశామని అన్నారు. సీఎం వెంటనే స్పందించి నిందితులను పట్టుకోమని పోలీసులను ఆదేశించారని అన్నారు. ఒక్క నిందితుడు కూడా తప్పించుకోవడానికి వీల్లేదని సీఎం ఆదేశించారని చెప్పారు. పార్లమెంట్‌లో దిశ చట్ట రూపం దాల్చితే ప్రత్యేక న్యాయస్థానాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. సురక్షితంగా లేని ప్రదేశాలకు వెళ్లకూడదని ప్రజలు భావించాలి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
Also Read: AP CM YS Jagan: తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్..
అసలేం జరిగిందంటే..
దేశమంతా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న వేళ గుంటూరులో ఆదివారం నాడు ఘోరం జరిగింది. గుంటూరులోని పెదకాకాని రోడ్డులోని పరమాయికుంటలో టిఫిన్ తీసుకెళ్లేందుకు వచ్చిన యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచాడు. రక్తపు మడుగులో ఉన్న బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయింది. యువతిపై కత్తితో దాడి చేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు కొందరు స్థానికులు ప్రయత్నించారు. కానీ, దుండగుడు స్థానికులను కత్తితో బెదిరించి బైక్‌పై పరారయ్యాడు. అటుగా వచ్చి ఆ యువకుడు యువతిని తన బైక్‌పై ఎక్కాలని కోరినట్లు తెలుస్తోంది. అందుకు ఆమె నిరాకరించడంతో యువకుడు తన వెంట తీసుకొచ్చిన కత్తితో విద్యార్థిని మెడ, పొట్ట భాగంలో పొడిచాడు.
Also Read: Guntur Crime: గుంటూరు బీటెక్ విద్యార్థిని హత్య సీసీ కెమెరా దృశ్యాలు
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలను మృతురాలి తల్లి, సోదరుడిని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అడిగి తెలుసుకున్నారు. బాధిత యువతి ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. యువతికి పరిచయం ఉన్న యువకుడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావించారు.
Also Read: Banjara Hills: ఇంట్లో నుంచి వెళ్లిపో.. లేదంటే రేప్ చేయిస్తా..! కూతురుకి కన్న తండ్రి బెదిరింపులు..