Central Ministers: కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తెలుగు రాష్ట్రాల ఎంపీలు - లక్ష్యాలు నెరవేరుస్తామన్న కేంద్ర మంత్రులు
Telugu States MPs: తెలుగు రాష్ట్రాల ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. వారికి అధికారులు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
Telugu States Mps Takes Charge As Central Ministers: తెలుగు రాష్ట్రాల ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఢిల్లీలోని వారి వారి ఛాంబర్లలో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు (Rammohan) పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అటు, తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి (KishanReddy) కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో మంత్రులకు అధికారులు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే అత్యంత చిన్న వయస్సులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేతగా రామ్మోహన్ నాయుడు రికార్డు సృష్టించారు. అటు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎలాంటి ఆడంబరం లేకుండా సాదాసీదాగా బాధ్యతలు స్వీకరించారు.
భోగాపురం ఎయిర్ పోర్టుపై
#WATCH | Delhi | On aviation infrastructure development in the country, Union Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu says, "...We want India to lead in aviation infrastructure development. Under the leadership of PM Modi, we will give civil aviation the top priority… pic.twitter.com/0ob5bhPff3
— ANI (@ANI) June 13, 2024
కేబినెట్‌లో అత్యంత చిన్న వయసులో నాపై ప్రధాని మోదీ తనపై బాధ్యత పెట్టారని.. ఇది యువతపై ప్రధానికి ఉన్న నమ్మకం అని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అశోక్ గజపతిరాజు హయాంలో ఏపీలోని భోగాపురం ఎయిర్‌పోర్టుకు పునాది పడిందని.. గత ఐదేళ్లలో అక్కడ అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. రికార్డు సమయంలో ఆ ఎయిర్‌పోర్టు పూర్తి చేసి విమానాలను ల్యాండ్ చేస్తాం. 'పౌర విమానయాన శాఖ ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. శాఖకు సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నాం. సాంకేతిక వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. సామాన్యుడికి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ తీసుకువస్తాం. ప్రయాణికునికి భద్రత, సౌకర్యంగా ఉండేలా చూస్తాం. ఎయిర్‌పోర్టులను పర్యావరణ హితంగాచేయడానికి చర్యలు చేపడతాం. సామాన్య ప్రయాణికుడికి విమానయానం అందుబాటులోకి తీసుకొచ్చేలా చేస్తాం. టైర్ 2, టైర్ 3 నగరాలకు విమానాశ్రయాలు తీసుకొస్తాం. రాజమహేంద్రవరం, కడప, కర్నూలు ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేస్తాం. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి అక్కడ విమానయాన శాఖ కార్యక్రమాలు ప్రోత్సహిస్తాం.' అని రామ్మోహన్ పేర్కొన్నారు.
'బొగ్గు ఉత్పత్తి పెంచుతాం'
మరోవైపు, తెలంగాణకు చెందిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి (Kishan Reddy) కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా గురువారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. 'అన్ని రాష్ట్రాల్లో గత పదేళ్లలో ప్రధాని మోదీ విద్యుత్ కొరతకు చెక్ పెట్టారు. ఆయన నాయకత్వంలో గత పదేళ్ల నుంచి వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహాలకు సరిపోను కరెంట్ వస్తోంది. దానికి ప్రధానమైన కారణం.. బొగ్గు. దీని ద్వారానే ఈ రోజు ఎక్కువ శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి మనం కొంత దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో మన అవసరాలకు సరిపోయేలా దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచుతాం. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడం, భారత్ ఖనిజాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తాం. అధికారులందరితో కలిసి టీమ్ వర్క్‌తో పనిచేసి భారత్‌ను అగ్రపథంలో నడిపించేందుకు క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో పనిచేస్తా.' అని కిషన్ రెడ్డి తెలిపారు.
#WATCH | Delhi: BJP MP from Secunderabad, G Kishan Reddy takes charge as Union Minister of Coal and Mines in the presence of Union Minister Pralhad Joshi. pic.twitter.com/y45fcrlFBO
— ANI (@ANI) June 13, 2024
కేంద్ర మంత్రిగా బండి సంజయ్
అటు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జగద్గురు శంకరాచార్య, హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆయనకు సహచర మంత్రులు, అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
#WATCH | Bandi Sanjay takes charge as the Minister of State for Home in the North Block office of the Ministry of Home Affairs. pic.twitter.com/pdoM4O9k3V
— ANI (@ANI) June 13, 2024
Also Read: Target KCR : కేసీఆర్ చుట్టూ కేసులు, విచారణల వల - బీఆర్ఎస్‌కు మరింత గడ్డు కాలం తప్పదా ?