NDA Meeting TDP : బీజేపీ కూటమి సమావేశానికి టీడీపీకి ఆహ్వానం - ఢిల్లీలో కీలక పరిణామాలు !
బీజేపీ మిత్రపక్షాల కూటమి సమావేశానికి తెలుగుదేశం పార్టీని ఆహ్వానించారు. ఢిల్లీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
NDA Meeting TDP : నేషనల్ డెమెక్రటిక్ అలయన్స్ పేరుతో బీజేపీ మిత్రపక్షాల కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ కూటమిలో గతంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగమే. అయితే విభజన హామీలు నెరవేర్చలేదని 2018లో కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఇప్పుడు మరోసారి బీజేపీ ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల పద్దెనిమిదో తేదీన ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ఎన్డీఏ పక్షాల కూటమి సమావేశం జరగనుంది. అనూహ్యంగా ఈ కూటమి సమావేశానికి రావాలని తెలుగుదేశం పార్టీకి బీజేపీ ఆహ్వానం పంపింది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఒక్కటీడీపీనే కాకుండా ఎన్డీఏ కూటమిలో ఉండి బయటకు వెళ్లిపోయిన శోరోమణి అకాలీ దళ్‌తో పాటు.. రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు నిర్వహిస్తే లోక్ జనశక్తి పార్టీని కూడా ఆహ్వానించారు. దీంతో ఎన్డీఏను పూర్తి స్థాయి లో విస్తరించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. కొద్ది రోజుల కిందట ఢిల్లీలో అమిత్ షాతో పాటు జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు. ఆ సమావేశం వివరాలేమీ బయటకు రాలేదు. చంద్రబాబునాయుడు కూడా బీజేపీతో పొత్తుల అంశంపై ఎప్పుడూ స్పందించలేదు. ఓ జాతీయ మీడియా చానల్‌తో ఇటీవల మాట్లాడినప్పుడు మోదీ విధానాలను సమర్థిస్తానని.. ఎన్డీఏలో చేరికపై కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఆ తర్వాత బీజేపీ వైపు నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదు. కానీ ఇటీవల రాష్ట్రంలో రెండు బహిరంగసభలను నిర్వహించిన సందర్భంగా ఏపీలోని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై అమిత్ షా, జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు.
దీంతో బీజేపీ స్టాండ్.. తెలిసిపోయిందని.. టీడీపీతో పొత్తు కోరుకుంటోందని అనుకున్నారు. అయితే వైఎస్ఆర్‌సీపీ అదినేత జగన్మోహన్ రెడ్డి.. బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రెండు రోజుల కిందట కూడా ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షా, ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ ఎన్డీఏలో చేరుతుందనే ఊహాగానాలు వినిపిస్తోంది. వచ్చే మంత్రి వర్గ విస్తరణలో ఆ పార్టీకి కేబినెట్ బెర్తులు కేటాయిస్తారన్న ప్రచారమూ జరిగింది. అదే సమయంలో బీజేపీకి టీడీపీని దూరంగా ఉంచడానికి.. తాము కూడా ఎన్డీఏలో చేరుతామన్న సంకేతాలను జగన్.. ఇచ్చారని కూడా అంటున్నారు. అయితే అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ మీటింగ్ కు ఆహ్వానం పంపడం అంటే.. బీజేపీ.. టీడీపీనే ఎంపిక చేసుకున్నట్లుగా భావిస్తున్నారు.
అయితే ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానం వచ్చిందా లేదా.. అన్నదానిపై తెలుగుదేశం పార్టీ వర్గాలు ఇంకా స్పందించలేదు. ఒక వేళ ఆహ్వానం వస్తే వెళ్తారా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు. ఎన్డీఏలో చేరడానికి టీడీపీ .. బీజేపీ, వైసీపీకి మధ్య ఉన్న బంధంపై క్లారిటీ కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ అంశంపై గతంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు చేసిన విమర్శలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. మొత్తంగా దేశ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.