TDP : వైఎస్ఆర్సీపీ గృహసారథులకు టీడీపీ సాధికార సారథులతో చెక్ - కొత్త వ్యవస్థను ప్రకటించిన చంద్రబాబు !
తెలుగుదేశం పార్టీ ప్రతి 30 ఇళ్లకు ఓ సాధికార సారథిని నియమించాలని నిర్ణయించింది. జగ్గంపేటలో చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు.
TDP : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సొంత పార్టీలో కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా జగ్గంపేటలో పర్యటిస్తున్న చంద్రబాబు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ప్రతి ముఫ్ఫై ఇళ్లకు టీడీపీ తరపున ఓ సాధికార సారధిని నియమించాని నిర్ణయించారు.
వైఎస్ఆర్‌సీపీకి వాలంటీర్లు, గృహసారథులు
వైసీపీ ప్రభుత్వం ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ ను నియమించింది. తర్వాత పార్టీ తరపున అంటూ గృహసారధుల్ని నియమించింది. వీరిలో వాలంటీర్లకు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. రూ. ఐదు వేల వేతనానికి వాలంటీర్లు పని చేస్తున్నారు. వీరికి పెద్దగా పని ఉండనప్పటికీ.. ప్రతి యాభై ఇళ్ల వివరాలు.. ఆ కుటుంబాలకు సంబంధించిన సమస్త సమాచారం వారి దగ్గర ఉంటుంది. ఇది రాజకీయంగా కూడా ఎంతో కీలకమని భావిస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో వీరిపై ఆంక్షలు ఉండే అవకాశం ఉన్నందున పార్టీ తరపున గృహసారధుల్ని సీఎం జగన్ నియమించారు. వారికి తోడు సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను కూడా తీసుకు వచ్చారు.
కౌంటర్‌గా గృహసారథుల వ్యవస్థను ప్రకటించిన చంద్రబాబు
ఇప్పుడు వారికి కౌంటర్‌గా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సాధికార సారధుల్ని నియమించాలని నిర్ణయించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయించుకోలేకపోయమని కొంత మంది కార్యకర్తలు బాధపడ్డారని.. ఈ సారి మాత్రం ప్రత్యేక వ్యవస్థ పెట్టి .. అందరికీ న్యాయం చేస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఏ కార్యకర్తకు పని అవసరం అయినా .. పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇన్‌ఛార్జ్‌లందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించేలా వీళ్లు పనిచేస్తారని వివరించారు. సాధికార సారథులుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందని చెప్పారు.
మైక్రో లెవల్‌కు రాజకీయ పార్టీల వ్యవస్థలు
గతంలో రాజకీయ పార్టీల వ్యవస్థలు బూత్ స్థాయి వరకే ఉండేవి. బూత్ కమిటీల్లో ఉండే నేతలే దిగువ స్థాయి నేతలు., మిగతా వారంతా కార్యకర్తలు. ఇప్పుడు మరింత మైక్రో లెవల్‌కి రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాల్ని తీసుకెళ్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ ఈ విషయంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. వాలంటీర్లతో ఆ పార్టీ గరిష్ట రాజకీయ ప్రయోజనం పొందుతోందన్న విమర్శలు ఉన్నాయి. చివరికి వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలుకు కూడా డబ్బులిస్తున్నారు. ఈ విధంగానూ లబ్ది పొందుతున్నారని చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది.