Breaking News: దసరా తర్వాతే హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికలు... ఈసీ స్పష్టం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 4న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
ఈ నెల 21 లేదా 22 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయిదు లేదా ఏడు రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. తిరిగి డిసెంబరులో మరోసారి సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై తుది నిర్ణయం ఇంకా రావాల్సిఉంది. ఈ నెలలో అసెంబ్లీ సమావేశాల్లోనే శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ల ఎన్నికలు నిర్వహించాలని పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీల ఖాళీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
అది ఆత్మీయ సమ్మేళనం కాదు.. రాజకీయ సమ్మేళనం..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ నిర్వహించింది ఆత్మీయ సమ్మేళనం కాదని.. రాజకీయ సమ్మేళనం అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. వైఎస్ సేవలు గుర్తించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. ఏపీ సీఎం జగన్, షర్మిల ఎదిగిన కాంగ్రెస్ కొమ్మని నరకాలని చూస్తున్నారని విమర్శించారు. తండ్రి ఆత్మీయ సమ్మేళనానికి రాని కొడుకు ఉంటాడా? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ బతికి ఉంటే విజయమ్మ తెలంగాణకు వచ్చేవారు కాదని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిని సమర్థిస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లాలని అనుకుంటే వెళ్లండి కానీ వెన్నుపోటు పొడవద్దని హితవు పలికారు.
ఊడిన రన్నింగ్ బస్సు వెనుక చక్రాలు.. తప్పిన ముప్పు
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా బస్సును ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గోకవరం నుంచి పాతకోట వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులు సుమారు 30 మంది ప్రయాణీకులున్నారు.
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై మంత్రి వర్గ ఉపసంఘం భేటీ
అమరావతి సచివాలయం మూడో బ్లాకులో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈసమావేశంలో పథకం అమలుకు సంబంధించిన వివిధ అంశాలు సమీక్షించారు. ఈ భేటీలో సిసిఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, ముఖ్య కార్యదర్శులు గోపాల కృష్ణ ద్వివేది, వి.ఉషారాణి, సిద్దార్థ జైన్ కూడా పాల్గొన్నారు.
గవర్నర్‌తో భేటీ అయిన ఇండోనేషియా కాన్సుల్ జనరల్
ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనో శనివారం రాజ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మానానీయ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను కలిశారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో వీరిరువురు సమకాలీన అంశాలపై చర్చించారు. తొలుత రాజ్ భవన్‌కు విచ్చేసిన ఇండోనేషియా కాన్సుల్ జనరల్ (ముంబై) అగస్ పి. సప్టోనోకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ హరిచందన్ మాట్లాడుతూ దేశంలోనే రెండో పొడవైన తీరప్రాంతం, సమృద్ధిగా సహజ వనరులతో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ కలిగి ఉందని ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్‌కు వివరించారు. ఇక్కడి పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఇండోనేషియా నుంచి పెట్టుబడిదారులు రావచ్చని, రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలను అందిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. గవర్నర్ హరి చందన్ ఇండోనేషియా కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనోను జ్ఞాపికతో సత్కరించారు.
బంజారాహిల్స్‌లో మాదక ద్రవ్యాల పట్టివేత..ముగ్గురు అరెస్టు
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ, 10 కిలోల గంజాయి, 50 గ్రాముల ఛారాస్, నాలుగు బోల్ట్స్ ఎల్‌ఎస్‌డీ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో హైదరాబాద్‌కు చెందిన మద్ది శివశంకర్ రెడ్డి, గంధం మణికాంత్, డార్జిలింగ్‌కు చెందిన శిల్పా రాయ్ ఉన్నారు.