(Source: ECI/ABP News/ABP Majha)
Avinash Reddy Gets Bail: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌కు ఊరట- ముందస్తు బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఏప్రిల్ 25 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఏప్రిల్ 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని CBIని ఆదేశిస్తూ మద్యంతర ఉత్తర్వులిచ్చింది. వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి అరెస్టు తర్వాత నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ సోమవారం విచారణకు రావాలని ఆయన కుమారుడు, వైఎస్సార్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. దీనిపై అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై రెండు రోజులుగా విచారణ సాగింది. మంగళవారం సాయంత్రం అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణను ఆడియో, వీడియో రూపంలో రికార్డ్ చేయాలని కోర్టు సూచించింది. సీబీఐ అడిగిన ప్రశ్నలకు ఎంపీ అవినాష్ రెడ్డి రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. విచారణకు అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరించాలన్న కోర్టు.. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏప్రిల్ 25వ తేదీ వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని తన ఆదేశాలలో స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. దీంతో రేపు ఉదయం గం. 10:30కి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర చాలా స్పష్టంగా ఉందని వాదిస్తున్న సీబీఐ ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని వాదించింది. వివేక హత్య కేసులో 40 కోట్ల డీల్ జరిగిందని దీనిపై అన్నింటికీ ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి సరైన సమాధానాలు ఇవ్వడం లేదన్నారు. ఎప్పుడు విచారణకు పిలుస్తున్నా కోర్టులకు వెళ్లి దర్యాప్తునకు ఆటకం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.
సీబీఐ వాదనలు ఇలా ఉన్నాయి..
వివేక హత్య జరిగిన రోజు అవినాష్ ఇంట్లోనే ఉన్నారు.
సునీల్ యాదవ్ వివేకాపై గొడ్డలితో దాడి చేశాక ఎంపీ అవినాష్ ఇంటికి వెళ్లాడు.
వివేక హత్య జరిగిన రోజున అవినాష్ మొబైల్ యాక్టివిటీస్ చాలా కీలకం
హత్య రోజు జరిగిన నాలుగు కోట్ల లావాదేవీల వ్యవహారంపై విచారణ జరగాలి
ఏ6 ఉదయ్‌కుమార్ తండ్రి వివేకా బాడీపై ఉన్న గాయాలకు కుట్లు వేశారు.
వివేకా హత్య వెనుక ఉన్న కుట్ర కోణం వెలికి తీసే ప్రయత్నాల్లో ఉన్నాం
వివేక హత్య విషయం తెలిసిన వెంటనే అవినాష్ రెడ్డి స్పాట్‌కు వెళ్లారు
గుండెపోటుతో మరణించారని అవినాష్ ధ్రువీకరించారు.
ఇప్పటి వరకు నాలుగు సార్లు అవినాష్‌కు విచారించాం.
ఈ పిటిషన్‌లో వివేక కుమార్తె సునీత కూడా ఇంప్లీడ్ అయ్యారు. ఈ కేసులో అవినాష్ రెడ్డిదే కీలక పాత్ర అని వాదించారు. సీబీఐ నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టులకు వచ్చి దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారని అన్నారు.
సునీత వాదనలు వాదనలు ఇలా..
కుమార్తె, తండ్రి మధ్య విభేదాలు లేవు
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కేసు బదిలీ కావడానికి ప్రధాన కారణం అవినాష్
ఏపీలో పలుకుబడి ఉపయోగించి కేసును తప్పుదారి పట్టించారు
అందులో అవినాష్ రెడ్డి ఒకరు
వివేక హత్య రోజున అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి వచ్చారు
వివేక చనిపోయిందని గుండెపోటుతోనే అని తేల్చారు.
ఎప్పుడు నోటీస్ ఇచ్చినా అరెస్టు చేయొద్దని అవినాష్ కోర్టును ఆశ్రయిస్తున్నారు.
గూగుల్ టేక్ అవుట్ సాక్ష్యాలు సరిపోతాయా లేవా అనేవి ఇప్పుడు నిందితుడు తేల్చేది కాదు.
ఈ విషయాన్ని సరైన సమయంలో కోర్టులు పరిశీలిస్తాయి.
విచారణ అడ్డుకోవడానికి ప్రతిసారీ అవినాష్ ప్రయత్నం చేస్తున్నారు.
వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర చాలా స్పష్టంగా ఉందని వాదిస్తున్న సీబీఐ ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని వాదించింది. వివేక హత్య కేసులో 40 కోట్ల డీల్ జరిగిందని దీనిపై అన్నింటికీ ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి సరైన సమాధానాలు ఇవ్వడం లేదన్నారు. ఎప్పుడు విచారణకు పిలుస్తున్నా కోర్టులకు వెళ్లి దర్యాప్తునకు ఆటకం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.