Breaking News Live: టీడీపీ కార్యాలయంపై దాడి.. 10 మందికి పోలీసుల నోటీసులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 22న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
చంద్రబాబు దీక్ష నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్‌కు రెండో రోజు కార్యకర్తల తాకిడి కొనసాగుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 36 గంటల దీక్షకు మద్దతుగా రెండో రోజు కార్యకర్లు తరలివస్తున్నారు. నిన్న రాత్రి 10.30 తర్వాత దీక్షా స్థలిపైనే చంద్రబాబు పడుకున్నారు. ఉదయం 5 గం.కు నిద్రలేచి మళ్లీ దీక్ష కొనసాగించారు. ఇవాళ రాత్రి 8 గంటల వరకూ చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. చంద్రబాబుకు కాసేపట్ల డాక్టర్లు పరీక్షలు నిర్వహించనున్నారు.
మరోవైపు, మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చే మార్గంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. రహదారిపై బారికేడ్లు, ముళ్లకంచెలు అడ్డుపెట్టారు. పోలీసులు ఎన్టీఆర్ భవన్‌కు వచ్చేవారిని అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. 28 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయిపై మాట్లాడితే ఎదురుదాడులా? అని ప్రశ్నించారు. తప్పుచేసిన అధికారుల జాబితా సిద్ధమవుతోందని.. అసమర్థ, అవినీతి పాలనపై సీబీఐ విచారణ చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
Also Read: సీఎంనా ? సజ్జలనా ? ఎవరిని ఉద్దేశించి పట్టాభి " ఆ పదం " వాడారు ?. పూర్తి ప్రెస్‌మీట్ డీటైల్స్ ఇవిగో..
పట్టాభికి రిమాండు
మరోవైపు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారం రాత్రి సమయంలో ఇంటి తలుపులు విరగ్గొట్టి మరీ పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ రోజు ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట హాజరు పరిచారు. నవంబర్ 2 వరకు పట్టాభికి రిమాండ్ విధించారు. దీంతో మచిలీపట్నం సబ్‌జైలుకు పట్టాభిని తరలించే అవకాశం ఉంది.
కోర్టులో పట్టాభిని హాజరు పరిచిన సమయంలో ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని ప్రభుత్వంలో ఉన్న లోపాలనే ప్రస్తావించానని తెలిపారు. తన ప్రెస్ మీట్ వీడియో క్లిప్పింగ్ పరిశీలించాలంటూ పట్టాభి న్యాయమూర్తిని కోరారు. తనకు నోటీస్ ఇవ్వకుండానే రాత్రి 9.30 గంటల సమయంలో అరెస్ట్ చేశారని తెలిపారు. మధ్యవర్తులు లేకుండానే తనతో పోలీసులు బలవంతంగా సంతకం చేయించారని న్యాయమూర్తికి తెలిపారు. అయితే పోలీసులు కొట్టలేదని న్యాయమూర్తికి పట్టాభి చెప్పినట్లుగా తెలుస్తోంది.
Also Read: అంతా చంద్రబాబే చేశారు.. వైసీపీ మంత్రులు, నేతల ఘాటు విమర్శలు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టీడీపీ కార్యాలయంపై దాడి.. 10 మందికి పోలీసుల నోటీసులు
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 10 మందికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులిచ్చారు. శేషగిరి పవన్ కుమార్, అడపాల గణపతి, పానుగంటి చైతన్య, పల్లెపు మహేశ్, షేక్ అబ్దుల్లా, గోకా దుర్గాప్రసాద్, కోమటిపల్లి దుర్గారావు, జోగా రమణ, లంకా అధినాయుడు, పేరూరి అజయ్‌కు నోటీసులు జారీ చేశారు.
పట్టాభి వ్యాఖ్యలపై సీబీఐ విచారణ జరిపాలా.. చంద్రబాబుకు బొత్స కౌంటర్
ఒకప్పుడు సీబీఐని రాష్ట్రంలోకి రావొద్దని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం హాస్యాస్పందంగా ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలో దివాలా తీసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్న బొత్స.. పట్టాభి వ్యాఖ్యలపై సీబీఐ విచారణ జరిపాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు చాలా అసహనంతో ఉన్నారని చెప్పారు.





















