Atchennaidu Letter: 'ఆ ఇద్దరినీ విధుల నుంచి తప్పించండి' - రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి అచ్చెన్నాయుడు లేఖ
Andhrapradesh News: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా CFMS ద్వారా కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు.
Atchennaidu Letter To Ec: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchennaidu).. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు (Mukeshkumar Meena) లేఖ రాశారు. ఈ మేరకు రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలపై ఫిర్యాదు చేశారు. ఆర్థిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన CFMS వ్యవస్థను నాశనం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన సీఎఫ్ఎంఎస్ ను సీఎం కార్యాలయం ఆధీనంలోకి తీసుకుందని.. సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డి నిధులు దారి మళ్లిస్తున్నారని తెలిపారు. వైసీపీకి మద్దతుగా నిలిచే కాంట్రాక్టర్లకు CFMS ద్వారా ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా డబ్బులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం కార్యాలయం నుంచే అనేక చెల్లింపులు జరుగుతున్నాయని.. దీనిపై ప్రత్యేక స్క్వాడ్ ఏర్పాటు చేసి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. వారిద్దరినీ వెంటనే విధుల నుంచి తప్పించాలని లేఖలో కోరారు.
మరోవైపు, సీఎం ట్విట్టర్ హ్యాండిల్ లో జగన్ ఫోటో ఉండడం అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా.. ట్విట్టర్ హ్యాండిల్ లో సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం ఉందని లేఖలో పేర్కొన్నారు. వెంటనే సీఎంకు సంబంధించిన అన్ని ఫోటోలు, సంక్షేమ పథకాల సమాచారం ప్రభుత్వ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఈవో కీలక ఆదేశాలు
అటు, ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు చెందిన నేతల వ్యవహారశైలి, ప్రచారం వంటి అంశాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించి అనేక నిబంధనలు విధించిన ఎన్నికల కమిషన్.. తాజాగా ఇంటింటి ప్రచారానికి సంబంధించి కొన్ని షరతులను విధించింది. ఈ మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలోని ఈసీ కార్యాలయంలో సీఈవో ముఖేష్ కుమార్ మీనా మంగళవారం సమావేశం నిర్వహించారు. సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు 'suvidha.eci.gov.in' పోర్టల్ వినియోగించాలని సూచించారు. ఇంటింటి ప్రచారం, సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
48 గంటలు ముందే..
రాజకీయ పార్టీల నాయకులు సభలు, ర్యాలీలు, ఇతర ప్రచారానికి సంబంధించి 48 గంటలు ముందుగానే సువిధ యాప్, పోర్టల్ నుంచి సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సీఈవో సూచించారు. దరఖాస్తు చేసిన 24 గంటల్లోగా ప్రచారానికి సంబంధించిన అన్ని అనుమతులు జారీ అవుతాయని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ నామినేషన్లు, అఫిడవిట్ దాఖలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు కోసమే ప్రత్యేకంగా పోర్టల్‌ను రూపొందించినట్టు వివరించారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుసరించాల్సిన విధి విధానాలు, తీసుకోవాల్సిన అనుమతులపైనా అవగాహన ఉండాలని వెల్లడించారు. కోడ్ అమల్లో భాగంగా నేతల కదలికలను ఈసీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈసీ సూచన మేరకు పోలీసులు ప్రధాన నగరాల్లో క్షేత్రస్థాయిలో కవాతు నిర్వహిస్తూ.. కోడ్, నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు.