Telangana DGP Shivadhar Reddy: తెలంగాణ పోలీసు దళానికి కొత్త సారథిగా శివధర్‌రెడ్డి
Telangana DGP: 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బత్తుల శివధర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. ప్రభుత్వం ఆయనకు డీజీపీ పదవితో పాటు, హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

Telangana DGP Shivadhar Reddy: తెలంగాణ రాష్ట్ర పోలీస్ దళానికి నూతన సారథిగా బత్తుల శివధర్‌రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోలీస్ వ్యవస్థకు నాయకత్వం వహించబోతున్న ఆయన, తన సుదీర్ఘ అనుభవం, ముఖ్యంగా శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స్ రంగాల్లో పని చేసిన విధానం రాష్ట్రంలో సీనియార్టీ కారణంగా ఈ ఉన్నత పదవికి ప్రభుత్వం ఆయన్ని ఎంపిక చేసింది. పలువురు సీనియర్ ఐపీఎస్ ఉన్నతాధికారుల పేర్లు డీజీపీ పదవికి బలంగా వినిపించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ వైపే మొగ్గు చూపింది.
అదనపు బాధ్యతలతో అక్టోబరు 1న పదవీ స్వీకారం
1994 బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డిని డీజీపీగా నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, తదుపరి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు, హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్‌గా పూర్తి అదనపు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. ఈ నియామకం ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న డా.జితేందర్ ఈ నెలాఖరుతో ఉద్యోగ విరమణ చేయనున్నారు. కొత్త డీజీపీ శివధర్‌రెడ్డి అక్టోబరు 1వ తేదీన తన పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. తనను డీజీపీగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శివధర్‌రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు.
శివధర్‌రెడ్డి ప్రస్థానం
శివధర్‌రెడ్డి ప్రొఫెషనల్ ప్రయాణం అత్యంత వైవిధ్యభరితమైనది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ (పెద్దతూండ్ల) అనే గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లో సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ చదివిన అనంతరం కొంతకాలం పాటు న్యాయవాదిగా పనిచేశారు. న్యాయశాస్త్రంపై పట్టు, న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఆయన వృత్తి జీవితంలో చట్టాలపై మరింత లోతైన అవగాహనను, నిర్ణయాలు తీసుకునే క్రమంలో న్యాయపరమైన కోణాన్ని అందించాయనడంలో సందేహం లేదు. అనంతరం సివిల్స్ పరీక్షలు రాసి, 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా అఖిల భారత సర్వీసుల్లోకి అడుగుపెట్టారు.
సంక్లిష్ట పరిస్థితులలో ప్రత్యేక పాత్ర
ఐపీఎస్ అధికారిగా శివధర్‌రెడ్డి కెరీర్‌లో ఎన్నో కీలకమైన, సవాళ్లతో కూడిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యంత సున్నితమైన శాంతిభద్రతల సమస్యలు ఉండే సౌత్‌జోన్ డీసీపీగా విధులు నిర్వర్తించారు. ఈ పదవిలో ఆయన పనితీరు ముఖ్యంగా 2007లో జరిగిన మక్కామసీదు బాంబు పేలుళ్ల ఘటన . ఆ తర్వాత చెలరేగిన అల్లర్ల నియంత్రణ క్రమంలో కీలకం. ఆ సమయంలో జరిగిన పోలీస్ కాల్పుల్లో 14 మంది మరణించిన అత్యంత క్లిష్టమైన సందర్భంలో, అప్పటి ప్రభుత్వం ఆయన్ని సౌత్‌జోన్ డీసీపీగా నియమించింది. దేశీయ బాధ్యతలతో పాటు, అంతర్జాతీయంగా శాంతి పరిరక్షణలో కూడా శివధర్‌రెడ్డి తనదైన ముద్ర వేశారు. 2003 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో భాగస్వామిగా కొసావోలో విధులు నిర్వహించారు.
కీలక విభాగాలలో ఉన్నత పదవులు
డీఐజీగా పదోన్నతి పొందిన అనంతరం ఆయన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) చీఫ్‌గా నియమితులయ్యారు. ఈ నియామకం నిఘా విభాగంలో ఆయనకున్న పట్టును, అత్యంత రహస్య విషయాలను నిర్వహించగల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో అదనపు డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన, తదనంతరం ఐజీ హోదాలో అదే ఏసీబీకి డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అవినీతి నిరోధక శాఖలో పనిచేసిన అనుభవం, పరిపాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడానికి ఆయనకు ఎంతగానో దోహదపడుతుంది.
తెలంగాణ తొలి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కీలక పాత్ర
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంలో శివధర్‌రెడ్డి వైజాగ్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆయన్ని తెలంగాణకు పంపించారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ని తెలంగాణ రాష్ట్రానికి తొలి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించడం జరిగింది. నూతన రాష్ట్రంలో శాంతిభద్రతల స్థిరీకరణలో, ఇంటెలిజెన్స్ వ్యవస్థను కొత్తగా ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర కీలకమైనది.
శివధర్‌రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలోనే, రాష్ట్ర చరిత్రలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నయీంను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఈ ఘటన రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్ వ్యవస్థపై ఉక్కుపాదం మోపడంలో శివధర్‌రెడ్డి నాయకత్వ పటిమను చాటింది. సుదీర్ఘకాలం పాటు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేయడం, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై, వ్యవస్థీకృత నేరాలపై ఆయనకు ఉన్న సమగ్ర అవగాహనను తెలియజేస్తుంది. గతేడాది (2023) డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం, మరోసారి ఆయన్ని ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించారు.
శివధర్‌రెడ్డి తన ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) ప్రయాణంలో నిబద్ధతతో కూడిన పనితీరుకు గాను అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. ఆయన శౌర్యపతకం , ఐపీఎం, పీపీఎం వంటి గౌరవాలు పొందారు.





















