TDP MLC Whip : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కొత్త వ్యూహం - ఎమ్మెల్యేలకు విప్ జారీ !
టీడీపీ ఎమ్మెల్యేలు పంచుమర్తి అనురాధకు ఓటేయాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. పార్టీని ధిక్కరించిన నలుగురు ఎమ్మెల్యేలకు ఈ విప్ ఇబ్బందికరంగా మారనుంది.
TDP MLC Whip : ఏపీ ఎమెల్యేల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది. ఈనెల 23న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధకు ఓటు వేయాలని తమకు ఉన్న మొత్తం 23 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. ఈ 23 మంది టీడీపీకి ఓటు వేస్తే ఆ పార్టీ అభ్యర్థి అనూరాధ విజయం సాధి్తారు. అయితే నలుగురు ఎమ్మెల్యేలు ధిక్కరించడంతో వారు వైఎస్ఆర్‌సీపీకి ఓటు వేసే అవకాశం ఉంది. ఇలా పార్టీని కాదని ఇతర పార్టీకి ఓటు వేస్తే అనర్హతా వేటు పడుతుంది.అందుకే వ్యూహాత్మకంగా టీడీపీ ఎమ్మెల్యే , శాసనసభ పక్ష విప్, డాక్టర్ డోల బాల వీరాంజనేయస్వామి విప్ జారీ చేశారు. 23న జరిగే ఎన్నికల్లో పాల్గొని టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయాలని విప్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఏడు స్థానాలకు ఈ నెల 23న మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరపున పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులు ఉన్నారు. ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఒక్కొక్కరికి 25 ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలా కాకపోయినా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికి గెలుపు లభిస్తుంది. వైఎస్ఆర్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఏడుగురు అభ్యర్థులకు ఓట్లను సమానంగా పంచితే ఒక్కొక్కరికి 21 ఓట్లు లభిస్తాయి. మరో నలుగురు అభ్యర్థులకు మరో ఓటు అదనంగా వేయించవచ్చు. అంటే నలుగురికి 22 ఓట్లు, ముగ్గురుకు ఇరవై ఒక్క ఓట్లు పంచుతుంది. ఇక తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే... వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల కన్నా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు ఉన్నట్లు లెక్క.
టీడీపీ తరపున గెలిచిన మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ వైసీపీకి అనధికారికంగా మద్దతు పలికారు. అలాగే జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా వైసీపీకే మద్దతుగా నిలిచారు. కానీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు విప్ జారీ చేస్తాయి. వీరు పార్టీ విప్ ను ఉల్లంఘిస్తే అనర్హతా వేటు వేయమని పార్టీలు ఫిర్యాదు చేస్తాయి. అదే జరిగితే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పైగా తమది నైతిక రాజకీయాలని.. వైసీపీ ప్రకటిస్తూ ఉంటుంది. అందుకే వారికి ఇంకా అధికారికంగా పార్టీ జెండా కప్పలేదు. ఇప్పుడు వారితో ఓటు వేయించుకోవాల్సి ఉంటుంది. ఓటు వేస్తే వారిపై అనర్హతా వేటు వేయాల్సి వస్తుంది. ఇదే వ్యూహంతో టీడీపీ విప్ జారీ చేసినట్లుగా కనిపిస్తోంది.