Telugudesam Joinings: టీడీపీలో కోవర్టుల కలకలం - హైకమాండ్ పర్మిషన్ ఉంటేనే ఇక కండువా !
TDP : టీడీపీ హైకమాండ్ నుంచి పర్మిషన్ ఉంటేనే పార్టీలో చేర్చుకుంటారు. ఈ మేరకు ఆ పార్టీ పార్టీ నేతలందరికీ సమాచారం ఇచ్చింది.

Telugudesam: తెలుగుదేశం పార్టీలో కోవర్టులు చేరుతున్నారన్న ప్రచారంతో ఆ పార్టీ అప్రమత్తమయింది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలో చేరుతున్నారు. వీరి వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని.. టీడీపీలో చేరి.. టీడీపీ కార్యకర్తలుగా మారి.. టీడీపీ నేతలను హత్యలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. స్వయంగా చంద్రబాబు నాయుడు ఇటీవల టీడీపీ కార్యకర్తల హత్యల విషయంలో ఇదే జరిగిందని పార్టీ ప్లీనరీలో చెప్పారు. కోవర్టులు ఉన్నారని వారిని ఏరివేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో పార్టీ నాయకత్వం చేరికలపై ఆంక్షలు విధించింది.
ముఖ్య గమనిక:
— Vempati Praveen TDP (@VempatiOfficial) June 7, 2025
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను టీడీపీలోకి జాయిన్ చేసుకునేముందు తప్పని సరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి. వారి గురించి పూర్తిగా కేంద్ర కార్యాలయం విచారణ చేసిన తర్వాత పార్టీ… pic.twitter.com/VshGIJblJv
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీల్లోకి పెద్ద ఎత్తున వలసలు వస్తాయి. ప్రతీ సారి ఇదే సమస్య ఉంటుంది. ఈ సారి మూడు పార్టీల కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. వైసీపీ పూర్తి గా సమస్యల్లో పడటం,ద్వితీయ శ్రేణి నాయకులు తమ అవసరాల కోసం ఈ మూడు పార్టీల్లో ఒక దాంట్లో చేరేందుకు ప్రయత్నించడం కామన్ గా మారిపోయింది. జిల్లా స్థాయి నేతల చేరికల విషయంలో మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటున్నాయని చెబుతున్నారు. అయితే కింది స్థాయి .. గ్రామ స్థాయి క్యాడర్ విషయంలో మాత్రం పార్టీ నేతలు స్వచ్చగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే అలా చేరుతున్న వారిలో కోవర్టులు, నేరగాళ్లు ఉండటం ఆ పార్టీకి సమస్యగా మారింది.
కోవర్టుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు స్పష్టమైన సమాచారం ఉండటంతో పలుమార్లు పార్టీ వేదికలపై సూటిగానే హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడిన వారి అవకాశాలను కొట్టేయడానికి చాలా మంది చేరుతున్నారని అనుమానిస్తున్నారు. చంద్రబాబు నేరుగా హెచ్చరించినా కోవర్టుల చేరికలు ఆగకపోవడంతో అధికారికంగా సమాచారం పంపినట్లుగా చెబుతున్నారు. ఇక ముందు నుంచి ఎవరూ టీడీపీలో చేరాలన్నా పార్టీ హైకమాండ్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో అవకాశాల కోసం చాలా మంది ఇతర పార్టీల నేతలు టీడీపీలోకి వస్తున్నారు. మాచర్లలో జరిగిన టీడీపీ నేతల జంట హత్యల వెనుక ఇలా అవకాశాల కోసం వచ్చిన వారే ఉన్నారని.. వారు తమ అవకాశాలను మెరుగుపర్చుకోవడానికి టీడీపీలో ఉన్న వారిని హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వారు అంతకు ముందు వైసీపీలో ఉండేవారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం.. చేరికలు ఆపేయడమేనని నర్ణయానికి వచ్చారు.





















