AP News: మూడేళ్లలో 4.25 లక్షల కోట్ల అప్పులు, ఆడిట్ లెక్కలు చెప్పాలంటూ బుగ్గనకు యనమల లేఖ
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. వైఎస్ జగన్ పాలనలో మూడేళ్లలోనే రూ.3.25 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు.
టీడీపీ హయాంలో 1.39 లక్షల కోట్ల అప్పులు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ళలో చేసిన అప్పు, స్థూల ఉత్పత్తి నిష్పత్తుల వివరాలపై యనమల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 1.39 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఏదేదో మాట్లాడారని, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మూడేళ్లలోనే 3.25 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో 97 ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే 30 సంస్థలే ఆడిట్ లెక్కలు చూపినట్లు కాగ్ తెలియజేసిందన్నారు. 67 సంస్థలు లెక్కలు చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు యనమల. సెప్టెంబర్ నాటికి ఉన్న రాష్ట్ర అప్పుల వివరాలు మొత్తం చెప్పాలని యనమల డిమాండ్ చేశారు. ఉద్యోగులు, గుత్తేదారులు, విద్యుత్ సంస్థల బకాయిలు చెప్పాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఖర్చు లెక్కలు అందించాలని లేఖలో కోరారు యనమల
67 సంస్థలు ఆడిట్ లెక్కలు చెప్పలేదు
కాగ్ 2021-22 నివేదిక ప్రకారం మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత మూడేళ్ళలోనే రూ.3.25 లక్షల కోట్లు అప్పు చేశారని యనమల గుర్తు చేశారు. అప్పు, స్థూల ఉత్పత్తి నిష్పత్తి 40 నుంచి 45 శాతం వరకు ఉందని, 2021-22 ఆడిట్ తరువాత సంవత్సరన్నర కాలంలో సుమారు రూ.1.25 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. నాలుగున్నర సంవత్సరాలలో 4.5 లక్షల కోట్లు అప్పుతో ఈ ప్రభుత్వం నడుస్తోందన్నారు. 97 పబ్లిక్ సెక్టార్ సంస్థలకు కేవలం 30 సంస్థలు మాత్రమే ఆడిట్‌కు లెక్కలు సమర్పించినట్లు కాగ్ తెలిపిందన్నారు. లక్ష కోట్ల రూపాయల అప్పును ప్రతి యేటా చేస్తూ, వచ్చే సంవత్సరం నుంచి రూ.50 వేల కోట్లకు మించిన చెల్లింపుల భారాన్ని ప్రజల మీద పెట్టారని కాగ్ చెబుతోందని లేఖలో ప్రస్తావించారు యనమల రామకృష్ణుడు.
ఓవర్ డ్రాఫ్టులోనే రాష్ట్రం
ప్రస్తుత నెలాఖరులోనూ రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్‌లోనే కొనసాగుతోంది. కొత్త త్రైమాసికంలో మొదటి 10 రోజుల్లోనే మళ్లీ ఓవర్ డ్రాఫ్టులోకి వెళ్లింది ఏపీ. అప్పులకు తోడు చేబదుళ్లు కూడా తీసుకున్నా ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడకపోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రం 1,684 కోట్ల ఓవర్ డ్రాఫ్టులోనే ఉంది. అక్టోబరు ప్రారంభంలోనూ ఇదే వెసులుబాటును ఉపయోగించుకుని జీతాలు, పెన్షన్ల వంటి అవసరాలను తీర్చుకుంది. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 7 వరకు ఏపీ ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్‌లో ఉందని, ప్రస్తుతం 2,229.83 కోట్ల ఓడీలో ఉందని ఆర్బీఐ తెలిపింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు చర్యలు తీసుకోవాలని, రిజర్వు బ్యాంకు జనరల్ మేనేజర్ రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అక్టోబరు 9న సమాచారం పంపారు. సాధారణంగా రిజర్వుబ్యాంకు ద్వారా కొన్ని రుణ వెసులుబాట్లు ఉంటాయి. ఖజానాలో నిధులు లేకపోయినా తొలుత ప్రత్యేక ఆర్థిక సాయం కింద కొంత మొత్తం వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత వేస్ అండ్ మీన్స్ రూపంలో మరికొంత మొత్తం లభిస్తుంది. అది కూడా దాటిన తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. దాదాపు 2,400 కోట్ల మేర ఓడీ వెసులుబాటు ఉంది. ఆ పూర్తి మొత్తం ఓడీ వరుసగా 5 రోజులకు మించి ఉండకూడదు.