Devineni Issue : దేవినేని ఉమకు జైల్లో హాని..! కుటుంబసభ్యులకు అనుమానం అందుకే..!?
దేవినేని ఉమకు హాని కలిగించేందుకు కుట్ర చేస్తున్నారని హైకోర్టు చీఫ్ జస్టిస్, కేంద్ర హోంమంత్రి , గవర్నర్‌లకు అనుపమ లేఖ
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ భార్య అనుపమ... గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర, రాష్ట్ర హోంమంత్రులకు లేఖ రాశారు. తన భర్తకు ప్రాణ హాని ఉందని లేఖలో పేర్కొన్నారు. అవినీతి, మైనింగ్‌పై పోరాడుతున్న దేవినేని ఉమన అంతమొందించేందుకు కుట్ర చేశారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేవినేని ఉమను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారు. అక్కడ సూపరిండెంట్‌ను రాత్రికి రాత్రి మార్చేసి కొత్త అధికారిని నియమించారు. జైళ్ల శాఖలో బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి.. వెంటనే విధుల నుంచి తప్పించింది. దేవినేని ఉమకు హాని తలపెట్టడానికే కుట్ర పూరితంగా ఇలా చేస్తున్నారని.. టీడీపీ నేతలతో పాటు దేవినేని ఉమ కుటుంబసభ్యులు కూడా అనుమానిస్తున్నారు.
అందుకే లేఖలో గతంలో జైళ్లలో జరిగిన హత్యా ఉదంతాల నేపథ్యంలో తన భర్తకు ఏదైనా హాని తలపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌ను ఆకస్మాత్తుగా బదిలీ చేయడం అనుమానం కలిగిస్తోందన్నారు. తన భర్తకు తగిన భద్రత, రక్షణ కల్పించాల్సిందిగా అనుపమ లేఖలో కోరారు. పదవిలో ఉన్నా లేకపోయినా, తన భర్త దేవినేని ఉమ ప్రజా జీవితంలో ఎంతో చురుగ్గా ఉన్నారని తెలిపారు. ఆయన అవినీతికి తీవ్ర వ్యతిరేకి అని, అక్రమ మైనింగ్ పై మొదటి నుంచి పోరాడుతున్నారని వివరించారు. అందుకే మైనింగ్ మాఫియా తన భర్తను లక్ష్యంగా చేసుకున్నట్టు అనుపమ లేఖలో ఆరోపించారు. తన భర్త ప్రాణాలకే కాకుండా, తమ ఆస్తులకు, ఇతర కుటుంబ సభ్యులకు తీవ్ర ముప్పు కలుగజేసేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని కొండపల్లి రక్షిత అటవీ ప్రాంతాన్ని పరిశీలించేందుకు దేవినేని ఉమ వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడ వివాదం జరగడంతో... కారులోనే కూర్చుని ధర్నాచేశారు. అయితే ఆర్థరాత్రి పోలీసులు దేవినేని ఉమకారు తలుపులను తొలగించి అరెస్ట్ చేశారు. ఆయనపై హత్యాయత్నం... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు తరలించాలన్న లక్ష్యంతోనే ఈ కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది.
ఈ లోపు రాజకీయంగా దేవినేని ఉమ అరెస్ట్‌పై వాదవివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కారు దిగని ఆయన ఎవరిపై హత్యాయత్నం చేస్తారని.. ఎస్సీఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వీరి ఆరోపణలకు దేవినేని ఉమ భార్య రాసిన లేఖ మరింత బలం చేకూరుస్తోంది. అయితే ఆమె రాసిన లేఖపై కేంద్రం కానీ గవర్నర్ కానీ స్పందిస్తారా అన్నది వేచి చూడాలి.. !