TDP Janasena Protest: ఏపీలో రోడ్ల దుస్థితిపై టీడీపీ-జనసేన ఉమ్మడి పోరు-గుంతల ఆంధ్రప్రదేశ్‌కి దారేది పేరుతో నిరసన
Andhra Pradesh News: గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది అంటూ ఉమ్మడి పోరాటం చేస్తున్నాయి టీడీపీ-జనసేన పార్టీలు.
TDP Janasena Protest: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి దిగాయి తెలుగుదేశం-జనసేన పార్టీలు. గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది పేరుతో రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అన్నదే లేదని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక.. ఏపీలో రోడ్లకు మరమ్మతులు లేక... రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్ల దుస్థితిపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు విడివిడిగా రకరకాల ఆందోళనలు చేపట్టాయి. అయితే ఇప్పుడు టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడి పోరాటం సాగిస్తున్నాయి.
ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని నిర్ణయించిన టీడీపీ-జనసేన పార్టీ... వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేశాయి. ప్రజాసమస్యలపై కలిసి పోరాటం చేస్తామని ప్రకటించాయి. ఇందులో భాగంగా... ముందుగా రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ఉమ్మడి పోరు ప్రారంభించాయి. అధ్వాన్నంగా తయారైన రోడ్లపై.. నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన నేతలు ఆందోళనలు కూడా నిర్వహిస్తున్నాయి. ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి రావాలిని, ఎక్కడ గుంత కనిపిస్తే అక్కడ సెల్ఫీ దిగాలని చెప్పారు. ఆ ఫొటోలు, వీడియోలు #GunthalaRajyamAP, #WhyAPHatesJagan హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పాలకుల కళ్లు తెరిపించాలని ఆ పార్టీల నాయకులు పిలుపునిచ్చారు.
ఏపీకి ఇతర రాష్ట్రాల వాళ్లు... 'గుంతల ఆంధ్రప్రదేశ్' అని పేరు పెట్టారాని. కానీ వైఎస్‌ఆర్‌సీపీ పాలకులు కళ్ళకు గంతలు కట్టుకున్నారని టీడీపీ-జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే వాళ్లకు రోడ్లపై పడిన గుంతలు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ పాలకుల కళ్లు తెరిపించేందుకే తెలుగుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడిగా గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు.
ఇప్పటికే సెల్ఫీ దిగి పోస్ట్ చేయడం ప్రారంభించారు టీడీపీ-జనసేన నేతలు, కార్యకర్తలు. గుంతల రోడ్ల ఫొటోలు తీసి... ఇది రోడ్డే...కాకపోతే గోతులు, గుంతల రోడ్డు అంటూ కాప్షన్లు పెడుతున్నారు. గుంటూరు నుంచి నందివెలుగు వెళ్లే ప్రధాన రహదారిపై సెల్ఫీ తీసుకుని... ఇది ఆ రోడ్డు దుస్థితి అంటూ ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఇక, కొలకలూరు గ్రామం దగ్గర రోడ్డు మధ్యన పెద్ద గొయ్యి ఉంది అంటూ ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. రోడ్డుపై ఉన్న ఆ గుంత కారణంగా ప్రమాదాలు జరగకుండా... ఎవరూ పడిపోకుండా జనమే రాళ్లు, చెట్టు కొమ్మలు పెట్టుకున్నారని చెప్పారు. ఇది మాత్రమే కాదు... రాష్ట్రమంతా ఇలానే ఉందని చెప్తున్నారు. కొలకలూరు గ్రామం దగ్గర రోడ్డు మధ్యన ఒక గొయ్యి ఉంటే... రాష్ట్రంలోని కొన్ని రోడ్లపై మొత్తం గుంతలే అంటూ విమర్శిస్తున్నారు. గుంతలు పడటంతో.. అసలు రోడ్డే కనిపించడంలేదని మండిపడుతున్నారు.
ఇవాళ, రేపు... గుంతల ఆంధ్రప్రదేశ్‌కి దారేది పేరుతో డిజిటల్ క్యాంపెయిన్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి ప్రపంచానికి తెలియచేస్తామంటున్నాయి టీడీపీ-జనసేన పార్టీలు. ఇది ఆరంభం మాత్రమే అని.. ఆంధ్రప్రదేశ్‌లో పేరుకుపోయిన సమస్యలపై టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడి పోరాటం చేస్తూనే ఉంటామని ప్రకటించారు.ప్రజావంచక ప్రభుత్వాన్ని సాగనంపుతామంటున్నారు.