Chintamaneni Prabhakar: ప్రాణహాని ఉందన్నా పోలీసులు పట్టించుకోలేదు - మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఆవేదన
Chintamaneni Prabhakar Threatening Calls: ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
EX MLA Chintamaneni Prabhakar comments: తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేస్తే కనీసం కేసు కూడా నమోదు చేయలేదని వాపోయారు. కానీ ఏపీ ప్రభుత్వం విధానాలను ప్రశ్నిస్తే మాత్రం తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నానని అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడే పోలీసులు.. ప్రాణహాని ఉందంటే మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓ వ్యక్తి తనకు కాల్ చేసి చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని, అతడి ఫోన్ నెంబర్ పోలీసులకు సమర్పించినా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇటీవల చింతమనేనికి చెందిన ట్రాక్టరును ఓ లారీ ఢీకొట్టింది. అయితే నష్టాన్ని కట్టించేందుకు లారీ ఓనర్ తన బ్యాంక్ ఖాతాలో కొంత నగదు జమచేశారని.. అయితే తాను బెదిరింపులకు పాల్పడి ఆ సొమ్ము తీసుకున్నానని పోలీసులు తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు కొందరు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రాణహాని ఉందని చింతమనేని కామెంట్స్
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. ఆయన్ను హత్య చేసేందుకు ఒక షూటర్ ను ప్రభుత్వం నియమించిందని చింతమనేని ఆరోపిస్తున్నారు. ఆ మేరకు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు చింతమనేని ప్రభాకర్ చెప్పారు. ‘‘నిన్ను హత్య చేసేందుకు ఓ షూటర్‌ని మా బాస్ నియమించాడు’’ అని గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడని చింతమనేని చెబుతున్నారు. ఈ బెదిరింపు కాల్స్ కి సంబంధించి చింతమనేని ప్రభాకర్ ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు.
చింతమనేని ఏలూరు మొబైల్ కోర్టులో ఓ ప్రైవేటు కేసు కూడా దాఖలు చేశారు. ‘‘నన్ను ఎన్ కౌంటర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నాలు చేసింది. టీడీపీ నాయకులు కనుక స్పందించకపోయి ఉంటే నేను ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని. నా తరపు న్యాయవాదికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి వార్నింగ్ లు ఇచ్చారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నేను ప్రశ్నించినందుకు నాపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నాకు ప్రాణహాని ఉంది. సీఎం జగన్‌తోపాటు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, నవ్‌జ్యోత్‌సింగ్ గ్రేవల్‌తో పాటు స్థానిక పోలీసులు, అధికారులు అందుకు సహకరించిన 21 మందిపై చర్యలు తీసుకోవాలి’’ అని ఏలూరు మొబైల్ కోర్టులో చింతమనేని ప్రభాకర్ ప్రైవేటు కేసు ఫైల్ చేశారు.
Also Read: Amalapuram Violence: అల్లర్ల కేసులో మరో 18 మంది అరెస్ట్, నేటి నుంచి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి