Chandrababu: ప్రజల డేటా ప్రైవేటు సంస్థలకు, ఈసీకి అన్ని ఆధారాలు ఇచ్చాం, హైలెవల్ కమిటీ కోరాం - ఢిల్లీలో చంద్రబాబు
అధికార వైఎస్ఆర్ సీపీ నాయకుల రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎన్నికల యంత్రాంగం స్వతంత్రంగా పనిచేయడానికి వీలుపడడం లేదని చంద్రబాబు ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.
ఎన్నికల కమిషనర్‌ని కలిసేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా చంద్రబాబు సోమవారం (ఆగస్టు 28) మధ్యాహ్నం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కలిశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అధికార వైఎస్ఆర్ సీపీ నాయకుల రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎన్నికల యంత్రాంగం స్వతంత్రంగా పనిచేయడానికి వీలుపడడం లేదని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితాను విడుదల చేయడానికి ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించాలని కోరారు. 2024లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా ఈసీ తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఇప్పటికే 60 లక్షలకు పైగా ఓట్లను వైఎస్ఆర్ సీపీ నేతలు తొలగించారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ఆర్ సీపీ నేతల ఒత్తిళ్ల వల్లే ఓట్లను తొలగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
హైలెవల్ కమిటీ వేయాలని కోరాం - చంద్రబాబు
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ మొత్తం ఏపీకి వచ్చి పరిస్థితులను పరిశీలించాలని ఈసీని కోరినట్లుగా చెప్పారు. తాము ఇచ్చిన డేటాను విశ్లేషించి, ఎన్నికలు సజావుగా జరిగేలా ఎలాంటి మోసం జరిగేందుకు వీలు లేని ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినట్లుగా చంద్రబాబు వివరించారు. ‘‘అవసరమైతే హైపవర్ కమిటీని, వేరే రాష్ట్రాల నుంచి అబ్జర్వర్లను ఏర్పాటు చేయాలని సూచించాం. రిమోట్ టెక్నాలజీ ద్వారా ఓట్లను తొలగిస్తున్నారు. బోగస్ ఓట్లు చేరుస్తున్నారు. ఈ డేటా అంతా ప్యూరిఫై అయ్యాకే ఎన్నికలకు పోవాలని తేల్చి చెప్పాం. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. ఓటర్ల పేర్లు, డోర్ నెంబర్లు, గ్రామాల వివరాలను ఈసీకి అందించాం. వ్యక్తిగత డేటాను వాలంటీర్లకు ఇస్తున్న విషయాన్ని వారికి చెప్పాం. ఓటర్ల వ్యక్తిగత డేటాను ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నారు’’ అని చంద్రబాబు మాట్లాడారు.
#WATCH | TDP chief and former Andhra Pradesh CM N Chandrababu Naidu arrives at the Election Commission office, in Delhi pic.twitter.com/So7XUKKRHS
— ANI (@ANI) August 28, 2023
కేంద్ర ఎన్నికల సంఘానికి సరికొత్త ప్రతిపాదన పెట్టానని చంద్రబాబు అన్నారు. ఆధార్ కార్డును ఓటర్ కార్డును అనుసంధానించాలని ఆయన ఈసీని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఆధార్ కార్డును ఓటర్ కార్డును అనుసంధానిస్తే తాను సంతోషిస్తానని మీడియాతో చంద్రబాబు అన్నారు. తద్వారా పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని, నకిలీ ఓట్లను నిరోధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒక పార్టీ ఓట్లను తొలగించాలన్న అలోచన, ఇంతవరకు ఏ పార్టీకి రాలేదని అన్నారు. వైసీపీ చాలా దారుణాలు చేసిందని, వాటన్నింటిని సాక్ష్యాధారాలతో ఈసీకి సమర్పించామని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడిచేసి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని తెలిపారు. టీడీపీ ఓట్లను భారీ ఎత్తున తొలగించారన్న చంద్రబాబు.. ఓటర్ల జాబితాలో వైసీపీ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు.
మరోవైపు, చంద్రబాబు ఫిర్యాదుకు పోటీగా వైఎస్ఆర్ సీపీ నేతలు కూడా సీఈసీని కలవనున్నారు. చంద్రబాబు హాయాంలోనే నకిలీ ఓటర్లను చేర్చారని వాటిని తొలగిస్తున్నట్లుగా చెప్పారు. ప్రస్తుతం ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని అన్నారు. అవన్నీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే చేర్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.