CM Jagan Review : కరవు ప్రాంతాల్లో చెరువులు కాల్వలతో అనుసంధానం-సీఎం జగన్
CM Jagan Review : రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలోని కరవు ప్రాంతాల్లో చెరువులను కాల్వలతో అనుసంధానం చేయాలని సీఎం జగన్ సూచించారు.
CM Jagan Review : ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్‌టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్(EAP)పై సీఎం జగన్ శుక్రవారం సమీక్షించారు. న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, జపాన్ ఇంటర్నేషనల్ కో- ఆపరేషన్ ఏజెన్సీ, ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకుల ఆర్థికసాయంతో చేపడుతున్న పలు ప్రాజెక్టులను సీఎం జగన్ సమీక్షించారు. మొత్తం 10 ప్రాజెక్టులకు రూ. 25,497.28 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ ఈఏపీ ప్రాజెక్టులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలోని కరవు ప్రాంతాల్లో చెరువులను కాల్వలతో అనుసంధానం చేయాలని సూచించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని చెరువుల పరిస్థితిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
చెరువులు కాల్వలతో అనుసంధానం
అవసరమైన చోట చెరువులు లేకపోతే కొత్త చెరువులు తవ్వాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. చెరువులన్నింటికీ గ్రావిటీ ద్వారా నీరు అందేలా కాల్వలతో అనుసంధానం చేయాలని ఆదేశించారు. చెరువుల నిర్మాణంతో భూగర్భజలాలు పెరుగుతాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. చెరువు కింద చక్కగా భూములు సాగు అవుతుందని, వ్యవసాయం అభివృద్ధి చెందితే ఉపాధి, ఆదాయ మార్గాలు మెరుగుపడతాయన్నారు. ప్రపంచబ్యాంకు వంటి ఆర్థిక సంస్థల సాయంతో ఇలాంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
పోర్టుల వద్ద ల్యాండ్ బ్యాంక్
పనులు మధ్యలో నిలిచిపోయిన బ్రిడ్జ్ లు, ఫ్లైఓవర్లు, ఆర్వోబీల పూర్తిచేయడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో మూడు పోర్టులు నిర్మిస్తున్నామని, ఈ పోర్టుల చుట్టుపక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ పోర్టుల పరిధిలో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోర్టు ఆధారితంగా అభివృద్ధి జరుగుతుందని అధికారులతో సీఎం జగన్ అన్నారు.
ఈ నెల 22న కుప్పం పర్యటన
సీఎం జగన్ ఈ నెల 22న ముఖ్యమంత్రి జగన్ కుప్పంలో పర్యటించనున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న వైసీపీ... ముందుగా చంద్రబాబు నియోజకవర్గం కుప్పంను లక్ష్యంగా చేసుకుంది. కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలనే లక్ష్యంతో పావులు కదుపుతుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ.. సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం సీటు సాధించాలనే పట్టుదలతో ఉంది. చంద్రబాబు స్థానాన్ని కైవసం చేసుకుంటే టీడీపీ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి భరత్ ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని సీఎం జగన్ ప్రకటించేశారు. ఈ పరిస్థితుల మధ్య సీఎం హోదాలో తొలిసారి కుప్పం పర్యటనకు వెళ్తుండడంపై ఈ పర్యటనపై సర్వత్రా ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల చంద్రబాబు పర్యటనలో కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. అన్న క్యాంటీన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేయగా, వైసీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేశారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : బెజవాడలో రోజురోజుకీ పెరుగుతున్న పొలిటికల్ హీట్, ఇందులో కీలక పాత్ర ఆయనదేనా?