Srilakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు గట్టి షాక్ - ఓబులాపురం కేసులో మళ్లీ విచారణ
Obulapuram Case: ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఓబులాపురం కేసులో హైకోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ ఆర్డర్ ను పక్కన పెట్టింది.

Supreme Court shock to IAS Srilakshmi: ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఓబులాపురం కేసు నుంచి బయటపడ్డారని అనుకున్నారు కానీ ఈ కేసులో శిక్షలు ఖరారు అయిన తరవాత రోజే ఆమెకు సుప్రీంకోర్టు నుంచి షాకింగ్ న్యూస్ వచ్చింది. ఈ కేసు నుంచి గతంలో శ్రీలక్ష్మి హైకోర్టు డిశ్చార్జ్ చేసింది. కానీ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఈ కేసులో.. తీర్పుతో సంబంధం లేకుండా శ్రీలక్ష్మి పాత్రపై విచారణ చేయాలని ఆదేశించింది. మరో నెలల్లో విచారణ చేయాలని సూచించింది.
గాలి జనార్ధన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో మైనింగ్ శాఖ ఉన్నతాధికారిగా శ్రీలక్ష్మి ఉన్నారు. లీజుల్లో అవకతవకలు దగ్గర నుంచి గాలి జనార్ధన్ రెడ్డి కి అర్హత లేకపోయినా లీజులు కట్టబెట్టడం వరకూ చాలా తప్పులు ఆమె చేతులు మీదుగా జరిగాయని సీబీఐ కేసులు పెట్టింది. గాలి జనార్ధన్ రెడ్డి నుంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందినట్లుగా ఆరోపించారు. అయితే ఈ కేసుతో తనకు ఏం సంబంధం లేదని మొదటి సీబీఐ కోర్టు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. కానీ సీబీఐ కోర్టు కొట్టి వేసింది. అదే పిటిషన్ ను హైకోర్టులో వేశారు. 2022లో ఆమెను కేసు నుంచి డిశ్చార్డ్ చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.
హైకోర్టు తాము చూపించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుడా డిశ్చార్జ్ చేశారని సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. మూడు నెలల్లోగా విచారణ చేయాలని సూచించింది. అంటే.. ఈ కేసులో ఒక్క శ్రీల క్ష్మి విషయంలోనే నేరం చేశారా లేదా అన్నది విచారణ జరిపి ఆమె నేర ప్రమేయంపై సాక్ష్యాలు ఉంటే దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేస్తారు.
ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సుదీర్గంగా సాగిన విచారణ తర్వాత తీర్పు వచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్‌లతో పాటు ఓఎంసీ కంపెనీని దోషులుగా తేల్చారు. ఇందులో ఏ వన్ గా శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. మిగిలిన నిందితులకూ అదే జైలుశిక్ష విధించారు. ఓఎంసీ కంపెనీకి లక్ష జరిమానా విధించారు.
కర్ణాటక, అనంతపురం సరిహద్దుల్లో ఐరన్ ఓర్ ను ఇష్టం వచ్చినట్లుగా తవ్వేసి ఎగుమతి చేసుకున్నారన్నా ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దులు కూడా చెరిపేశారని సీబీఐ కేసులు నమోదు చేసింది. 2009లో సీబీఐ ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి సీబీఐ జేడీ లక్ష్మినారాయణ గాలి జనార్ధన్ రెడ్డిని బళ్లారి నుంచి అరెస్టు చేసి తీసుకు వచ్చారు. మూడేళ్లకుపైగా జైల్లో ఉన్న తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది.





















