AP IPS Sanjay: ఏపీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్‌కు షాక్ - ముందస్తు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
Supreme Court : ఏపీ ఐపీఎస్ అధికారి సంజయ్ కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్లుగా కేసు నమోదు చేశారు.

Supreme Court cancels anticipatory bail of AP IPS officer Sanjay: ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. గత విచారణలో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన సమయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు ముందస్తు బెయిల్ పై విచారణ సమయంలో ట్రయల్ పూర్తి చేసినట్లుగా తీర్పు ఇచ్చిందని అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఎదుట లొంగిపోవడానికి సంజయ్ కు మూడు వారాల గడువు ఇచ్చింది. కస్టడీ కోసం దర్యాప్తు సంస్థ దిగువకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. యాంటీ-కరప్షన్ బ్యూరో (ACB) 2024 డిసెంబర్ 24న సంజయ్‌పై అవినీతి నిరోధక చట్టం, 1988 మరియు భారతీయ శిక్షాస్మృతి (IPC) కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలు ఆధారంగా, సంజయ్‌పై విచారణ కొనసాగుతోంది.
ఐపీఎస్ అధికారి సంజయ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా , అడిషనల్ డైరెక్టర్ జనరల్ (సీఐడీ)గా పనిచేస్తున్న సమయంలో, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. మొత్తం రూ. 1.76 కోట్ల విలువైన నిధులను అక్రమంగా ఉపయోగించినట్లు తేల్చారు. ఆటోమేటెడ్ గవర్నెన్స్ అండ్ నోసీ ఇంటిగ్రేషన్ (AGNI-NOC) వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి కోసం టెండర్ ప్రక్రియలో అవకతవకలు చేసినట్లు కేసులు నమోదయ్యాయి. సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 2.29 కోట్ల విలువైన కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ, 2023 ఏప్రిల్ నాటికి కేవలం 14 శాతంపని మాత్రమే పూర్తయినట్లు విచారణ కమిటీ నివేదిక పేర్కొంది.
టెండర్ ప్రక్రియలో నిబంధనలు (GO నం. 94) ఉల్లంఘించడం, ప్రీ-క్వాలిఫికేషన్ బిడ్స్, సాంకేతిక అర్హత పరిశీలించకపోవడం వంటి ఉల్లంఘనలకు సంజయ్ పాల్పడ్డారు. అలాగే సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సమయంలో, SC/ST (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) యాక్ట్‌పై అవగాహన కార్యక్రమాల కోసం క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 1.19 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ కార్యక్రమాలు నిర్వహించబడలేదని, క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ అనే సంస్థ ఉనికిలో లేదని యాంటీ-కరప్షన్ బ్యూరో (ACB) ఆరోపించింది. ఈ కార్యక్రమాలను సీఐడీ అధికారులు నిర్వహించారని, కేవలం రూ. 3.10 లక్షల ఖర్చుతో నిర్వహించినట్లుగా గుర్తించారు. దీనివల్ల రూ. 1.15 కోట్లు అక్రమంగా మళ్లించినట్లుగా గుర్తించారు.
AGNI యాప్ అమలు కోసం ఎనిమిది మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 8 , రెండు యాపిల్ ఐప్యాడ్ ప్రో పరికరాలను ఈ-ప్రొక్యూర్మెంట్ లేదా పోటీ ధరల కొటేషన్లు లేకుండా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరికరాల కోసం సౌత్రిక టెక్నాలజీస్‌కు రూ. 17.89 లక్షలు చెల్లించినట్లు, అధిక ధరలతో బిల్లులు లేకుండా చెల్లింపులు జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గుర్తించింది. ఈ ఆరోపణల కారణంగా సంజయ్‌ను 2024 డిసెంబర్ 3న సస్పెండ్ చేశారు . అతను విజయవాడలోనే ఉండాలని, ప్రభుత్వ అనుమతి లేకుండా విడిచి వెళ్లకూడదని ఆదేశించబడింది.





















