TDP Janasena : విడిపోయిన మనుషులను కలిపిన జగన్ - జనసేన,టీడీపీ పొత్తులో కీలక భూమిక వైసీపీదే !
టీడీపీ, జనసేన పొత్తుల ప్రకటనకు వేదికను కల్పించింది సీఎం జగనే అన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. విపక్షాలపై దాడులు చేసి..చేసి .. తిట్లతో విరుచుకుపడిన ప్రతిఫలంగా పొత్తలు ఖరారయ్యాయన్న వాదన వినిపిస్తోంది.
TDP Janasena : అక్టోబర్ 18, 2022 సరిగ్గా ఇక్కడే మొదలైంది పవన్ కళ్యాణ్- టీడీపీ కలిసి ఎన్నికలు వెళ్తున్నాయనే స్పష్టత వచ్చిన రోజు. దానికి రెండు రోజుల ముందు పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించారు. అయితే ఆయన పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. కనీసం ప్రజల్లోకి వెళ్లే అవకాశం కూడా ఇవ్వకుండా వైసీపీ నాయకులు, సీఎం జగన్ అరాచక పాలన చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. హోటల్ రూమ్ నుంచే జనసేన కార్యకర్తలకు అభివాదం చేసి తిరిగి వచ్చిన పవన్..ఆ తర్వాత అక్టోబర్ 18న మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల మీటింగ్ లో వైసీపీ శ్రేణులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అప్పటివరకూ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ వాడని భాషతో వైసీపీ నాయకులను నానా బూతులు తిట్టారు.
పవన్ పై బూతుల దాడి చేసిన వైసీపీనేతలు
అదే రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ ను కలిసి సంఘీభావం ప్రకటించారు చంద్రబాబు. ప్రతిపక్షాలపై సీఎం జగన్ చూపిస్తున్న నియంతపూర్వక వైఖరిని ఖండించిన చంద్రబాబు..ఎన్నడూ పెద్దగా అరవని పవన్ కళ్యాణ్ నోట బూతులు వినటం ఫస్ట్ టైమ్ అంటూ ఛలోక్తులు విసిరారు. అప్పుడే పొత్తు ఉంటుందా కలిసి పోటీ చేస్తున్నారన్న ప్రశ్నలకు ఇది ప్రజాస్వామ్యం కోసం పోరాటం అంటూ తప్పించుకుంటూనే పరోక్ష సంకేతాలు పొత్తుపై ఇచ్చారు
వరుస దాడులతో కలసి పోరాడాలని నిర్ణయం
ఆ తర్వాత జనసేన వారాహియాత్రకు ముందు పవన్ కళ్యాణ్- చంద్రబాబుల భేటీ జరిగింది. వారాహియాత్ర షెడ్యూల్ టీడీపీనే ఇచ్చిందని వైసీపీ నేతలు కామెంట్లు కూడా చేశారు. ఆ తర్వాత ఎన్డీయే దేశవ్యాప్తంగా తమ అనుకూల పార్టీలతో నిర్వహించిన సమావేశానికి పవన్ కళ్యాణ్ కు మాత్రమే తెలుగు రాష్ట్రాల నుంచి ఆహ్వానం అందింది. టీడీపీకి అలాంటి ఆహ్వానం లేకపోవటంతో చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ సముఖంగా లేదా..కనుక జనసేన తో కూడా పొత్తు లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. కానీ చంద్రబాబు అరెస్ట్ తో సమీకరణాలు మారిపోయాయి. అదే రోజు మంగళగిరి వచ్చేందుకు ప్రయత్నించిన..పవన్ కళ్యాణ్ ను సరిహద్దుల్లో అడ్డుకోవటం..అక్కడ నుంచి పాదయాత్ర చేస్తానంటూ పవన్ కళ్యాణ్ పోలీసులతో వాగ్వాదానికి దిగటం..రోడ్డుపై పడుకోవటం పెద్ద రచ్చే జరిగింది ఆరోజు రాత్రి. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ ఇలా ప్రవర్తిస్తున్నారని ఆయన అరెస్ట్ తోనే ఇంత ఆవేశానికి లోనయ్యారని వైసీపీ శ్రేణులు విమర్శించాయి.
ఇక కలిసి యుద్ధం చేయడమే !
ఈ రోజు చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ములాఖత్ ఇక ఈ తరహా ఆరోపణలకు తెరదించేశారు పవన్ కళ్యాణ్. బీజేపీ సంగతి తనకు తెలియదు కానీ టీడీపీ మాత్రం వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించేశారు జనసేనాని. జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా వైసీపీ ని ఎదుర్కోవాలో..ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలో నిర్ణయించుకుంటామని స్పష్టమైన ప్రకటన చేశారు. అలా విశాఖ అడ్డుకోవటాలతో మొదలైన జనసేన-టీడీపీ పొత్తుల చర్చ..ఈ రోజు పవన్ ప్రకటనతో ఫుల్ క్లారిటీని సంతరించుకుంది.