What Next : తగ్గని ప్రభుత్వం - పట్టు వీడని ఉద్యోగులు ! సమ్మె ఖాయం.. తర్వాత ఏంటి ?
ఉద్యోగులు, ప్రభుత్వం ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉండటంతో ఏపీలో సమ్మె ఖాయంగా కనిపిస్తోంది. నివారించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య ఏర్పడిన వివాదం అంతకంతకూ పీట ముడి పడిపోతోంది. అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగులు తగ్గడం లేదు. ప్రభుత్వం చర్చలకు రెడీ అంటోంది కానీ తాము చెప్పింది విని ఆందోళనలు విరమించాల్సిందేనన్న ఒక్క చాయిస్ మాత్రమే ఉద్యోగుల ముందు పెట్టింది. కానీ ఉద్యోగులు మాత్రం హక్కులు సాధించుకునేవరకూ వెనక్కి తగ్గబోమని అంటున్నారు. దీంతో సమ్మె ఖాయమని స్పష్టమయిపోయింది.
శుక్రవారం నుంచి సమ్మె ప్రారంభమైనట్లే !
శుక్రవారమే ఉద్యోగులు పెన్ డౌన్ చేయడంతో సచావాలయం అంతా బోసిపోయింది. సిబ్బంది కార్యాలయానికి వచ్చిన తమ నిరసనను వ్యక్తం చేశారు. ఏం చర్చించినా.. తమ పీఆర్సీ పెరగాల్సిందేనని సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని ద్యోగులు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి చర్చలకు సిద్ధమనే సంకేతాలు వస్తున్నా హెచ్ఆర్‌ఏ పెంపు సహా సీపీఎస్ రద్దు అంశాలపై మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. హెచ్‌ఆర్‌ఏ పెంచే ప్రశ్నే లేదని చెబుతోంది. సీపీఎస్ గురించి ఇప్పుడేమీ చెప్పలేమని అంటున్నారు. దీంతో ఉద్యోగులకు సమ్మెకు వెళ్లడం ఖాయం అయిపోయింది.
ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు !
ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ప్రభుత్వ వ్యవస్థ దాదాపు స్తంభించి పోతుంది. న్యాయ, ఆర్టీసీ, వైద్య ఉద్యోగులు కూడా వీరికి సంఘిభావం చెబుతున్నారు. వారు కూడా సమ్మెలోకి వెళ్తే ప్రభుత్వానికి కాళ్లూ చేతులూ ఆడవు. ఇప్పుడు ఈ సమ్మె సెగ నుంచి ఎలా బయటపడాలనేదే ప్రభుత్వానికి ముఖ్యమైన అంశం. ఒకవైపు చలో విజయవాడ సక్సెస్ కావడంతో సమ్మెకు రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు రెడీ అయ్యారు. చలో విజయవాడలో ఉద్యోగులు ఓ మాదిరిగా కనిపించినా ప్రభుత్వం పైచేయి సాధించినట్లుగా ఉండేది. కానీ అంచనాలకు మించి ఉద్యోగులు తరలి వచ్చారు. ఇప్పుడు వారిని అదుపు చేయడం.. సమ్మెకు వెళ్లకుండా చేయాలంటే ప్రభుత్వం ముందున్న ఒకే ఒక మార్గం.. వారు చెప్పినట్లుగా జీవోలు రద్దు చేయడం. కానీ ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదు.
ఎస్మా ప్రయోగించి దారికి తెస్తారా ?
ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్న ఉన్న ఒకే ఒక్క పరిష్కారం ఎస్మా ప్రయోగించడం. ఉద్యోగులు వస్తే చర్చలు సాగుతాయి..లేదంటే చట్టం తన పనితాను చేసుకుపోతుందని మంత్రులతో పాటు సజ్జల హెచ్చరిస్తున్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగితే సహించబోమని నేరుగానే చెబుతున్నారు. ఉద్యోగ సంఘం నేతలు కూడా తమను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతూ వస్తున్నారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తే ప్రభుత్వం ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకోవచ్చు. 14 లక్షలకుపైగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఎస్మావంటి చట్ట ప్రయోగం ఎంత వరకు సాధ్యమవుతుందన్న అనుమానం కూడా ఉంది. కొంత మంది ఉద్యోగ సంఘ నేతల్ని అరెస్ట్ చేస్తే మిగతా వారు దారిలోకి వస్తారని ప్రభుత్వం భావించడానికి కూడా అవకాశం లేదు. చలో విజయవాడకు తరలి వచ్చిన ఉద్యోగుల స్ఫూర్తి ఈ ఆలోచనకు గండి కొట్టింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందనేది కీలకమైన అంశంగా మారింది.