(Source: ECI/ABP News/ABP Majha)
TDP Joinings : టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ సతీమణి - శృంగవరపు కోటలో వైఎస్ఆర్‌సీపీకి షాక్ !
TDP Joinings : శృంగవరపు కోట నియోజకవర్గ నేత ఎమ్మెల్సీ రఘురాజు సతీమణి అనుచర వర్గంతో టీడీపీలో చేరారు. వైసీపీలో రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆమె తెలిపారు.
Sringavarapu Kota leader SudhaRani : శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సతీమణి సుధారాణి నేతృత్వంలో సుమారు 150 మంది ముఖ్యనేతలు యువనేత లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. అధికార వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో ఇమడలేమంటూ టీడీపీ వైపు చూస్తున్నారు. తాజాగా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అర్ధాంగి సుధారాణి నేతృత్వంలో వివిధ స్థాయిల వైసీపీ నేతలు నేడు టీడీపీలో చేరారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో వారంతా టీడీపీలోకి వచ్చారు. లోకేశ్ వారికి పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరస్వాగతం పలికారు. ఇందుకూరి సుధారాణి, 15 మంది సర్పంచులు, 17 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కన్వీనర్లతో సహా 150 మంది వైసీపీ నేతలు ఇవాళ భారీ కాన్వాయ్ తో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. వారందరికీ లోకేశ్ ఆత్మీయ స్వాగతం పలికారు.
వైసీపీలో ప్రజానేతలకు తమ ఆత్మగౌరవం నిలుపుకోవడం కష్టమైపోతోంది. అందుకే వారంతా టీడీపీలో చేరుతున్నారు. శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సతీమణి సుధారాణి నేతృత్వంలో సుమారు 150 మంది ముఖ్యనేతలు యువనేత లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.#YCPAntham#EndOfYCP… pic.twitter.com/4yn3tp6UY9
— Telugu Desam Party (@JaiTDP) March 4, 2024
రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పారు. పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వారిని కలుపుకొని టీడీపీ గెలుపు కోసం కృషిచేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో జగన్ ను ప్రజలు నమ్మి 151 సీట్లతో అధికారమిస్తే కోట్లాది ప్రజల ఆశలు, ఆశయాలకు గండికొడుతూ... ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలనను ప్రారంభించారని లోకేశ్ మండిపడ్డారు. యువగళం పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యానని తెలిపారు. వారి కష్ట, సుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
"చంద్రబాబునాయుడు గారు వస్తున్నా మీకోసం పాదయాత్రలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకొని 2014-19 నడుమ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. పాదయాత్ర చేసిన జగన్ ప్రజలకు మంచి చేస్తాడని అందరూ భావిస్తే ఆయన మాత్రం విధ్వంసం, వేధింపులు, కక్ష సాధింపులకు ప్రాధాన్యత ఇచ్చారు. జగన్ పాలనలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక సర్పంచ్ లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు తగిన గౌరవంతో పాటు గౌరవ వేతనం పెంచుతాం. శంఖారావం కార్యక్రమంలో భాగంగా శృంగవరపుకోట నియోజకవర్గానికి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నా" అంటూ లోకేశ్ స్పష్టం చేశారు.
రెండేళ్లుగా వైసీపీలో తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని.. తమ గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు. హైకమాండ్ కు చెప్పినా వినిపించుకోలేదని సుధారాణి ఆేదన వ్యక్తం చేశారు.