Srikakulam Bear Roaming : రాత్రిపూట వీధుల్లో ఎలుగుబంట్లు, హడలెత్తిపోతున్న గ్రామస్థులు!
Srikakulam Bear Roaming : శ్రీకాకుళం జిల్లాలో రాత్రిపూట జనావాసాల మధ్య ఎలుగుబంట్లు సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
Srikakulam Bear Roaming : శ్రీకాకుళం జిల్లా వాసులను ఎలుగుబంట్లు హడలెత్తిస్తున్నాయి. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ ఎలుగుబంటి హల్ చల్ చేసింది. గ్రామ వీధుల్లోకి ప్రవేశించి ఇళ్ల మధ్య సంచరించింది. గ్రామంలో ఎలుగు బంటి సంచరించడాన్ని గ్రామస్థులు వీడియో తీశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొద్ది నెలల క్రితం ఇదే మండలంలో ఎలుగుబంటి దాడిలో ముగ్గురు మరణించారు. మళ్లీ మండలంలో ఎలుగు సంచరించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లు నుంచి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
భయాందోళనలో గ్రామస్తులు
చినవంక గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఎలుగుబంటి గ్రామస్థులను భయాందోళనకు గురిచేసింది. రాత్రి 11 గంటలు తరువాత ఎలుగుబంటి గ్రామంలోని వీధుల్లో సంచరిస్తూ భయాందోళనకు గురిచేసింది. శీతాకాలం కావడంతో బయట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్థులు చెబుతున్నారు. ఇంటి గేట్ల ముందు, గుడిలో, రోడ్లపై ఎలుగు సంచరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాసేపటికి ఎలుగుబంటి సమీపంలోని తోటల్లోకి వెళ్లిపోయింది. ఇటీవల ఈ ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం పెరిగిందని గ్రామస్థులు అంటున్నారు. ఇప్పుడు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయని, ఎప్పుడు దాడికి పాల్పడతాయో అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంట్ల నియంత్రణకు అటవీశాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సిక్కోలులో తరచూ ఘటనలు
శ్రీకాకుళం జిల్లా బేతాళపురంలో ఇటీవల ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. పాతాళేశ్వరస్వామి ఆలయంలోకి చొరబడిన ఎలుగుబంటి భక్తులను భయాందోళనకు గురిచేసింది. దీంతో భక్తులు పరుగులు తీశారు. ఆలయం నుంచి సముద్రతీరం వైపు ఎలుగుబంటి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి రావడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. వన్య మృగాలు గ్రామాల్లోకి ప్రవేశిస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. సిక్కోలు జిల్లాలో సమీపంలోని అడవుల్లోంచి గ్రామాల్లోకి వస్తున్న ఎలుగుబంట్లు గ్రామస్థులపై దాడికి పాల్పడుతున్నాయి. సో౦పేట మ౦డల౦ ఎర్రముక్కంలో ఎలుగుబంటి ఇటీవల బీభత్సం సృష్టించింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనంలోకి ప్రవేశించిన ఎలుగుబంటి స్కూల్ బిల్డింగ్ కిటికీ ఊసలను వ౦చి వంటగదిలోకి ప్రవేశించింది. వంటగదిలోని నూనె పాకెట్స్ ని చి౦చి ఆయిల్ తాగేసింది. వ౦టగదిలోని బెల్లం, వేరుశెనగలును తిని వంట సామగ్రిని ధ్వంసం చేసింది. అయితే ఎలుగుబంటిని పసిగట్టిన స్థానికులు దానిని వెంబడించి తరిమికొట్టేందుకు ప్రయత్నించగా ఎలుగుబంటి తిరగబడి ప్రజలను భయపెట్టింది.
ఇటీవల గ్రామస్థులపై దాడి
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని కిడిసింగి గ్రామశివారులో ఎలుగుబంటి గ్రామస్తులపై దాడి చేసిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. అతి కష్టంమీద దానిని అటవీ అధికారులు పట్టుకున్నారు. విశాఖ జూకు తరలించే క్రమంలో ఎలుగుబంటి మృతి చెందింది. అదే ప్రాంతంలో మరో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాం ఏజెన్సీలోని పలు గ్రామాల్లో ఎలుగుబంటి సంచారంతో గిరిజనులు హడలిపోతున్నారు. కిడిసింగి వద్ద తోటల్లో ఎలుగుబంటి రైతులపై చేసిన దాడిలో ఒకరి మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పలువ తాడివాడ వద్ద మరో ఎలుగుబంటి సంచారం అప్పట్లో స్థానికంగా కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా మండలంలో ఎలుగుబంట్ల సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.