Palasa Cashew Cultivation: తీవ్ర నష్టాల్లో సిక్కోలు జీడి పరిశ్రమ... మూతపడుతున్న పలాస పరిశ్రమలు...
తెల్లబంగారంగా పిలిచే జీడిపప్పు పంటకు శ్రీకాకుళం జిల్లా పలాస పెట్టింది పేరు. తిత్లీ, కరోనా ప్రభావంతో జీడి పంట దిగుబడి తగ్గిపోయింది. జీడి రైతుల కష్టాలపై ఏబీపీ దేశం ప్రత్యేక కథనం.
వరుస తుపాన్ల ప్రభావంతో తెల్లబంగారం పిలిచే జీడి పరిశ్రమ తీవ్రనష్టాల్లో పడింది. శ్రీకాకుళం జిల్లా పలాస జీడి పప్పు సాగుకు పెట్టింది పేరు. ఇప్పుడు ముడిసరుకు కొరతతో జీడి పరిశ్రమలను నడపలేమంటూ యాజమాన్యాలు చేతులేత్తేస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జీడి పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నెలలో వచ్చిన తిత్లీ తుపాను ప్రభావంతో వేలాది ఎకరాల్లో జీడి తోటలు నష్టపోయాయి. దీంతో రైతులు, వ్యాపారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. సిక్కోలు ఆర్థిక వ్యవస్థకు జీడిపప్పు పరిశ్రమలది ప్రధానపాత్ర. ఏటా వేల కోట్ల రూపాయల లావాదేవీలకు కేరాఫ్ అడ్రస్. దశాబ్ధాలుగా వేలాది మందికి జీవనోపాధినిస్తున్న ఆ ఇండస్ట్రీ ఇప్పుడు కుదేలయ్యింది. ఫ్యాక్టరీలపై కరోనా ప్రభావంతో రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. లాక్ డౌన్ కారణంగా మూతపడిన పలాస జీడిపప్పు పరిశ్రమలపై ఏబీపీ ప్రత్యేక కథనం.
తిత్లీ, కరోనా ప్రభావంతో తీవ్ర నష్టాలు
శ్రీకాకుళం జిల్లా జీడి పప్పు పరిశ్రమపై తిత్లీ తుపాను, కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. వేలాది ఎకరాల్లో జీడి తోటలు దెబ్బతిన్నాయి. తిత్లీ తుపాను దాటిన వెంటనే కరోనా రక్కసి వచ్చిపడింది. ఆ తర్వాత వేలాది ఎకరాల్లో జీడి తోటలకు తెగుళ్లు శోకి స్థానికంగా టన్నుల కొద్ది జీడి పిక్కలు పాడైపోయాయని రైతులు వాపోతున్నారు. దీంతో ఈ ఏడాది ఉద్దాన ప్రాంతం నుంచి జీడి పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. పంటలేక పోవడంతో పరిశ్రమలు మాతపడేస్థితికి చేరుకున్నాయి. ప్రతి ఏడాది ఉగాది తర్వాత జీడి పిక్కలు దిగుబడికి రావడంతో వ్యాపారాలు పుష్కలంగా సాగేవి. దీంతోపాటు విదేశాల నుంచి జీడి పిక్కలు దిగుబడి చేసుకోవడంతో పరిశ్రమలు పుష్కలంగా పనిచేసేవి. కార్మికులకు చేతి నిండా పనిదొరికేది. వాణిజ్య కేంద్రమైన పలాసలో కోట్లాది రూపాయలు టర్నోవర్ ఉండడంతో ప్రభుత్వ ఖజనా నిండేది. అలాంటిది ఈ ఏడాది ఇప్పటివరకు జీడిపిక్కలు కొనుగోలు ప్రక్రియ అంతంత మాత్రంగా ఉండడంతో పలాస జీడి పరిశ్రమ యాజమాన్యాలు తుని, రాజమండ్రి, నర్సీపట్నం, పార్వతీపురం, ఒడిశా పరిసర ప్రాంతాల నుంచి జీడిపిక్కలు దిగుమతి చేసుకుంటున్నాయి. గత ఏడాది తిత్లీ తుపాను బీభత్సానికి సర్వం కోల్పోయామని రైతులు వాపోతున్నారు. బీమా చెల్లించిన పరిశ్రమలకు ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చారు. బీమా లేని వారికి అసలు పరిహారం అందలేదన్నారు.
Also Read: వైసీపీ నేతపై ఆ పార్టీ నేతలే దాడి... మోకాళ్లపై కూర్చొబెట్టి క్షమాపణలు చెప్పించి వార్నింగ్
కరోనా ప్రభావంతో నిలిచిన ఎగుమతి
శ్రీకాకుళం జిల్లాలోని పలాస- కాశీబుగ్గ పరిసర ప్రాంతాల్లో 320 వరకూ చిన్న, పెద్ద జీడిపప్పు పరిశ్రమలున్నాయి. ఉద్దానం పరిధిలో పండే జీడిపంట ఆధారంగా చేసుకునే ఈ పరిశ్రమలన్నీ నడుస్తున్నాయి. దీంతో దాదాపు 30 వేల కుటుంబాలకు జీడి పప్పు ఇండస్ట్రీతో అనుబంధం ఉంది. 320లకు పైగా ఉన్న పరిశ్రమల ద్వారా జీడిపప్పు రవాణా, ఇతర కార్యకలాపాలతో మరో రూ.1500 కోట్లు లావాదేవీలు సాగుతున్నాయి. పలాస పరిధిలోని ఈ జీడిపరిశ్రమల నుంచి నిత్యం 100 నుంచి 150 టన్నుల జీడిపప్పు విదేశాలకు ఎగుమతి అవుతుంది. పలాస నుంచి మంగుళూరు చేరిన సరుకు అక్కడ్నుంచి ఇతర దేశాలకు ముఖ్యంగా చైనా, వియత్నం, ఇతర యూరోపియన్ దేశాలన్నింటికీ ఎక్స్ పోర్ట్ అవుతుంది. ఐతే చైనాలో మొదలైన కరోనా వైరస్... ప్రపంచ దేశాలన్నింటిలోనూ విస్తరించడంతో ఆ ప్రభావం పలాస జీడి ఎగుమతులపై పడింది. పలాస నుంచి ఎక్స్ పోర్ట్ అయ్యే జీడిపప్పులో ఎక్కువ భాగం చైనా, వియత్నాం, ఇండోనేషియాలదే. వీటితో పాటు ఇతర దేశాలకూ మంగుళూరు నుంచి ఎగుమతి అవుతుంది. కానీ కరోనా విజృంభణ తర్వాత ఎగుమతులు పూర్తిగా నిలిపివేశారు. దేశాలకు మధ్య సరిహద్దులు మూసేయడంతో సరుకురవాణా నిలిచిపోయిది. కరోనా చైనాను గట్టిదెబ్బ కొట్టడంతో ఆ ఎఫెక్ట్ జీడిపప్పు ఎగుమతులనూ తాకింది. దీంతో సరుకు ఎగుమతి నిలిచిపోయింది.
Also Read: మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కోసం ఏపీ సీఐడీ పోలీసుల సెర్చింగ్ ! అరెస్ట్ కోసమేనా ?
విదేశీ పప్పుపై ఆధారపడలేం
పలాస పరిసర ప్రాంతాల్లో మొత్తం 320 పరిశ్రమలు ఉన్నాయి. రోజుకి సుమారు అయిదు వేల బస్తాల జీడిపిక్కలు అవసరం ఉంటుంది. ఈ సీజన్ లో సరాసరి లక్షా 50 వేల బస్తాల జీడిపిక్కలు కావాల్సి ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది జీడి దిగుబడి తగ్గిపోవడంతో పరిశ్రమలకు ముడి సరుకు కొరత తీవ్రంగా వేధిస్తోంది. స్థానికంగా ముడిసరుకు లభించకపోవడంతో ఏడాది పొడవునా విదేశీ పిక్కలపై ఆధారపడి పరిశ్రమలు కొనసాగించాలంటే కష్టంగా మారిందంటున్నారు. మార్కెట్లో నిలబడాలంటే స్థానికంగా జీడి పిక్కలు దిగుబడి ఉంటేనే సాధ్యమని అంటున్నారు. ముడిసరుకు అందుబాటులో లేదని పరిశ్రమలు నడవకపోతే యంత్ర పరికరాలు పాడైపోతాయని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నారు. విదేశీ పిక్కలు దిగుమతి వ్యాపారాలు చేయాలనుకున్నా ఆ పప్పు నాణ్యత ఉండడంలేదని అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ ఉన్న పలాస జీడిపప్పునకు చెడ్డపేరు తీసుకురాకూడదనే వ్యాపారాలకు దూరమవ్వాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
Also Read: టీడీపీలో చేరేందుకు సూరి తాపత్రయం.. అడ్డం పడుతున్న శ్రీరామ్ ! ఎవరిది పైచేయి ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి