Minister Dharmana Prasadarao : రైతులు వరి సాగు తగ్గించి, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టండి : మంత్రి ధర్మాన
Minister Dharmana Prasadarao : వరి పంటతో బతుకుదెరువు లేదని రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వరి వదిలి గోధుమ, అరటి, మినప ఇతర పంటలను పండించాలని సూచించారు.
Minister Dharmana Prasadarao : శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ఫేజ్-2 పనులు, హిరమండలం రిజర్వాయర్ ను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, ఇరిగేషన్ అధికారులు సోమవారం పరిశీలించారు. అనంతరం మీడియా మాట్లాడిన మంత్రి.. వంశధార ఫేజ్-2 కోసం సుమారు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఒడిశాతో ఉన్న వివాదం వల్ల ప్రాజెక్ట్ ప్రతిఫలాలు జిల్లావాసులకు అందడంలేదన్నారు. ఒడిశాతో వివాదం పూర్తయితే కాట్రగడ్డ, నేరడి దగ్గర నిర్మించే ప్రాజెక్టుతో గ్రావిటీ ద్వారానే రిజర్వాయర్ నింపవచ్చు అన్నారు. కానీ ఒడిశాతో సమస్యలు ఎప్పటికి తేలుతుందో తెలియదన్నారు. అందువల్ల కొత్త ప్రతిపాదన చేశామని మంత్రి తెలిపారు.
వేసవిలో సైతం పంటలు
గోట్టా బ్యారేజ్ వద్ద లిఫ్ట్ పెట్టి హిరమండలం బ్యారేజ్ ని నింపడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. గోట్టా బ్యారేజ్-హిరమండలం బ్యారేజ్ మధ్య లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీఎం ఆమోదం తెలిపారన్నారు. సంవత్సరంలోపే ప్రాజెక్టు పూర్తిఅవుతుందని, దీంతో రైతులకు నీరు అందించవచ్చని మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేసవిలో సైతం పంటలు పండించే అవకాశం ఉంటుందన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయన్నారు. వరి పంటతో బతుకుదెరువు లేదని, రైతులు వరి పంట మాని ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలని సూచించారు. వేసవి పంటలపై దృష్టి పెట్టాలన్నారు.
వరికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి
వాణిజ్య పంటలు పండిస్తేనే మంచి రోజులు వస్తాయని మంత్రి ధర్మాన అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంతో నాగావళి నదిని కూడా అనుసంధానం చేయవచ్చని ఆయన తెలిపారు. వంశధార నీటిని, నాగావళి నదిలోకి తరలించవచ్చన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాలకు భూములు ఇచ్చిన వారు నష్టపోతారని, నిర్వాసితుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. వంశధార నిర్వాసితులకు, తిత్లీ బాధితులకు న్యాయం చేద్దామని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. దేశంలో ఏ రైతు సంతోషంగా లేరన్న మంత్రి... ఏపీ మిగతా రాష్ట్రాల్లో కన్నా రైతులను అనేక విధాలుగా ఆదుకుంటుందన్నారు. వరి సాగును వీలైనంత వరకు తగ్గించాలని, వరికి ప్రత్యామ్నాయ పంటలను రైతులు ఆలోచించాలన్నారు. వరి వదిలి గోధుమ, అరటి, మినప ఇతర పంటలను పండించాలని సూచించారు. సీఎం ద్వారా నేరడి బ్యారేజికి శంఖుస్థాపనకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జిల్లాకు సీఎం వచ్చే లోపే నిర్వాసితుల ఖాతాల్లో మిగిలిన పరిహారాన్ని జమచేస్తామని మంత్రి తెలిపారు.
Also Read : jagan Vizag Tour : విశాఖ వెళ్లి హర్యానా సీఎంతో భేటీ కానున్న జగన్ ! ఎజెండా ఏమిటంటే ?