Tammineni on Fire : కంట్రోల్ తప్పిన స్పీకర్ - దిక్కున్న చోట చెప్పుకోవాలని మహిళపై ఆగ్రహం !
స్పీకర్ తమ్మినేని సీతారం ఓ మహిళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దిక్కున్న చోట చెప్పుకోవాలన్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Tammineni on Fire : సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్లాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. వెళ్తేనమో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఎమ్మెల్యేలు కంట్రోల్ తప్పి పోతున్నారు. ఈ సారి స్పీకర్ తమ్మినేని సీతారాంకే ఇలాంటి పరిస్థితి ఎదురయింది. దీంతో ఆయన దిక్కున్న చోట చెప్పుకోపో అని ఓటర్ ను..అదీ కూడా మహిళా ఓటర్ ను అనేశారు. ఇప్పుడీ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
నెల్లిపర్తి గ్రామంలో తనను అంగన్ వాడీ టీచర్‌గా తొలగించడంపై నిలదీసిన శెట్టి పద్మ
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆమదాలవలస మండలం నెల్లిపర్తి గ్రామంలో పర్యటించిన తమ్మినేని సీతారాం ను శెట్టి పద్మ అనే మహిళ నిలదీసింది. ఇంటింటికీ వెళ్తూ టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు శెట్టి నర్సింగరావు కుటుంబసభ్యులు ఉన్న ఇంటికి వెళ్లకుండా ముందుకు సాగారు. నర్సింగరావు మరదలు శెట్టి పద్మ తమ సమస్యలు చెప్పుకోవాలని అప్పటికే ఇంటి ముందు నిల్చోగా, స్పీకర్ వెళ్లిపోవడాన్ని గమనించారు. వెంటనే ముందుకెళ్లి తన అత్త పింఛను సమస్యను స్పీకర్‌కు తెలిపారు. టీడీపీ సానుభూతిపరుల కుటుంబం అన్న కారణంగా పెన్షన్ తీసేశారని శెట్టి పద్మ ఆరోపించారు. శెట్టి పద్మ గతంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేశారు. టిడిపి సానుభూతిపరురాలు అన్న నెపంతో గత యేడాది నవంబర్ లో పద్మను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ కారణంగా గ్రామంలో పర్యటించిన తమ్మినేనికి పద్మ తన ఆవేదనను చెప్పుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన తమ్మినేని బాధిత మహిళపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. తనకు అంతా తెలుసు...దిక్కున్న దగ్గర చెప్పుకో అంటూ ఆగ్రహించారు.
గ్రామంలో గంజాయి అమ్ముతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం
శెట్టి పద్మ భయపడకుండా మీరు వచ్చే ఎన్నికల్లో ఏమవుతారో చూసుకోండి అన్నారు. గ్రామంలో గంజాయి వ్యాపారం జరుగుతున్నా పట్టించుకోరు, సంక్షేమ పథకానికి 3000 రూపాయలు వసూలు చేస్తున్నా మీకు పట్టదు అంటూ స్పీకర్ తమ్మినేని ని సదరు మహిళ కడిగి పారేసింది. తన ఆవేదనను చెప్పుకోవాలని ప్రయత్నిస్తే ఓ శాసన సభాపతిగా ఉన్న వ్యక్తి మహిళ అని కూడా చూడకుండా అవమానపరిచారని పద్మ ఆవేదన వ్యక్తం చేసింది.
దిక్కున్న చోట చెప్పుకోమని స్పీకర్ అనడంపై గ్రామస్తుల విస్మయం
'ఇక్కడ అన్ని సంక్షేమ పథకాలకూ లంచాలే. ఒక్కో పథకానికి రూ.3 వేలు లంచమివ్వాలి. ఓ అంగన్‌వాడీ టీచర్‌ను తప్పు చేయకుండా తీసేయడమేంటి? అడిగితే, దిక్కున్నోడికి చెప్పుకోమంటారా? స్పీకర్ భాషేనా ఇది? ఇదా మీ సంస్కారం? ఈ వీడియో సీఎం జగన్‌కు పెట్టండి. ఇంటింటికీ వచ్చిన స్పీకర్.. మా ఇంటికి రాకుండా ఎందుకు వెళ్లిపోతున్నారని అడిగితే ఇంత కోపమా? ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు సంగతి తేలుస్తాం' అంటూ పద్మ బదులిచ్చారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.