Land Titling Act: 'నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని' - విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ సంచలన ట్వీట్
Andhrapradesh News: ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంపై ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
Retired IAS Sensational Tweet On Land Titling Act: ప్రస్తుతం ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ చట్టం ద్వారా వైసీపీ నేతలు భూములు లాక్కునేందుకు కుట్రలు పన్నుతున్నారని టీడీపీ ఆరోపిస్తుండగా.. సీఎం జగన్ (Cm Jagan) పేదలకు భూములు ఇస్తాడని.. భూములు లాక్కోడని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act)పై విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ (PV Ramesh) సంచలన ట్వీట్ చేశారు. తాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఇబ్బందులు పడ్డానని #LandTitlingAct హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేశారు. 'నేను ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి. IAS అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం.' అని ట్వీట్ లో పేర్కొన్నారు.
నేను #AndhraPradesh #LandTitlingAct ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి…
— Dr PV Ramesh (@RameshPV2010) May 6, 2024
చంద్రబాబు స్పందన
కాగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ట్వీట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్ చేసిన ట్వీట్ ను ఆయన రీట్వీట్ చేశారు. 'జగన్ సీఎంఓలో పని చేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇల్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదు!' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
జగన్ సీఎంఓలో పని చేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇల్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదు!#JaganLandGrabbingAct pic.twitter.com/VwEwqljLBs
— N Chandrababu Naidu (@ncbn) May 6, 2024
గత కొద్దిరోజులుగా ల్యాండ్ టైటిలింగ్ అంశం ఏపీలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. ఈ చట్టంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. సీఎం జగన్ సహా ఇతర వైసీపీ నేతలు అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కౌంటర్ ఇస్తున్నారు. మొన్నటి వరకూ పెన్షన్ల పంపిణీపై విమర్శలు, ప్రతివిమర్శలు జోరుగా సాగగా.. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారంపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ టాపిక్ పొలిటికల్ పరంగా ఆసక్తికరంగా మారింది.