Ys Sharmila: 'వారు జగన్ పడేసే బిస్కెట్లకు ఆశ పడేవారే' - జగన్ ను సాయం అడిగానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని షర్మిల సంచలన వ్యాఖ్యలు
Andhrapradesh News: తాను సీఎం జగన్ ను సాయం అడిగానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అలా చేసే వారు జగన్ పడేసే బిస్కెట్లకు ఆశ పడేసే వాళ్లే అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు.
Ys Sharmila Sensational Comments On CM Jagan: తాను సీఎం జగన్ (Cm Jagan) ను పని కావాలని అడిగినట్లు కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Ys Sharmila) మండిపడ్డారు. సోమవారం కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె జగన్ పై విమర్శలు గుప్పించారు. తాను రూ.వెయ్యి కోట్ల పని అడిగానని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అలా మాట్లాడేవాళ్లు జగన్ పడేసే బిస్కెట్లకు ఆశ పడే వాళ్లే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ముందు ఇలా మాట్లాడుతున్నందుకు మీకు ఎంత అందుతున్నాయో చెప్పండి.? అంటూ నిలదీశారు. 'రూ.వెయ్యి కోట్లు ఏంటి రూ.10 వేల కోట్ల వర్క్ అడిగాను అని కూడా చెప్తారు. నేను ఒక్క పైసా సహాయం అడగలేదు. అలా అడిగానని నిరూపిస్తే రాజకీయాలు వదిలి వెళ్లిపోతా. వీళ్లు ఊసరవెళ్లులు. అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరాక పుట్టుకనే అవమానిస్తారు. నా తల్లి విజయమ్మపై సైతం నిందలు వేశారు.' అంటూ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
'గొడ్డలి రాజకీయాలు తెలియదు'
అవినాష్ మాదిరిగా అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని షర్మిల మండిపడ్డారు. జగన్ ను చూసుకునే తెలంగాణ నేత రాఘవరెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రూ.వెయ్యి కోట్లు తీసుకున్నట్లు రుజువులు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 'ఒకసారి ఆలోచన చేయండి. ఇదే జగన్ మోహన్ రెడ్డి వివేకా హత్య తర్వాత CBI విచారణ అడిగారు. సీఎం అయ్యాక విచారణ వద్దు అన్నారు. అప్పుడొక మాట... ఇప్పుడొక మాట. YSR పేరును CBI ఛార్జ్ షీట్ లో పెట్టించారు. పొన్నవోలుకి అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు. సొంత తండ్రి పేరు CBI ఛార్జ్ షీట్ లో చేర్పించిన ఘనత జగన్ ది. నా భర్త అనిల్ పై అవినాష్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ల్యాండ్ క్రూజర్ లో వెళ్లి కలిశాడట. నా భర్తకు ఏ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు.' అని షర్మిల వ్యాఖ్యానించారు.
బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు.?
వైసీపీ ఇంత అవినీతిలో కూరుకుపోయినా బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని షర్మిల ప్రశ్నించారు. 'కంటికి కనిపించని పొత్తును జగన్ కొనసాగిస్తున్నారు. క్రైస్తవులపై దాడి ఘటనలో కూడా వైసీపీ స్పందించలేదు. అదానీ, అంబానీలకు ప్రభుత్వ ఆస్తులను సీఎం దోచిపెట్టారు. జగన్ బీజేపీ దత్తపుత్రుడు అని నిర్మలా సీతారామన్ చెప్పారు. జగన్ వైఎస్సార్ వారసుడిగా కాదు.. మోదీ వారసుడిగానే ఉన్నారు. జగన్ ఆ పార్టీకి దత్తపుత్రుడు కాబట్టే చర్యలు తీసుకోలేదు.' అంటూ షర్మిల ఆరోపించారు.
'ప్రత్యేక హోదా తాకట్టు'
రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని.. చంద్రబాబు, జగన్ ఇద్దరూ మోదీని పట్టుకుని వేలాడుతున్నారని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఒకరు పొత్తు.. ఒకరు తొత్తు. ఇద్దరూ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టారు. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్ ను తాకట్టు పెట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుస్తారని జగన్ కి ఓటేస్తే కుచ్చుటోపీ పెట్టారు. సొంత చిన్నాన్న వివేకా హత్య కేసు నిందితుడికి మళ్లీ పట్టం కట్టారు. వివేకా బిడ్డ ఈనాటికీ న్యాయం కోసం పోరాటం చేస్తోంది. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి హంతకుడిని కాపాడుతుంటే ఇక ప్రజల పరిస్థితి ఏంటి?. వైఎస్ఆర్ బిడ్డ ఇవాళ నిలబడింది వివేకా ఆఖరి కోరిక నెరవేర్చాలని. న్యాయం కోసం ప్రజా కోర్టులో తేల్చుకోవాలని పోటీ చేస్తున్నా. కడప ప్రజలు న్యాయంవైపు నిలబడాలని కోరుతున్నా. వైఎస్ఆర్ బిడ్డగా మాటిస్తున్నా. మీ ఇంట్లో బిడ్డను అవుతాను.' అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.