(Source: ECI/ABP News/ABP Majha)
Ram Gopal Varma: ‘వ్యూహం’లో వివేకా మర్డర్, ఏపీ ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది- ఆర్జీవీ
Ram Gopal Varma: వ్యూహంలో తన అభిప్రాయం మాత్రమే ఉంటుందన్నారు. తాను నమ్మిన నిజాన్ని చూపిస్తున్నానని అన్నారు. వివేకా హత్య గురించి కూడా ప్రస్తావిస్తానని ఆర్జీవీ స్పష్టం చేశారు.
Ram Gopal Varma:
రామ్‌గోపాల్ వర్మ.. ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం. ఆయన తీసే ప్రతి సినిమా ఏదో ఒక వివాదం రాజేస్తూ ఉంటుంది. గతంలో అమ్మ రాజ్యం కడప బిడ్డలు సినిమా తీసి వివదాలకు తెరతీశారు. దాని తరువాత లక్ష్మీ పార్వతి వృత్తాంతంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కథతో వ్యూహం తెరకెక్కిస్తున్నారు. చిత్రం షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి నిత్యం వార్తల్లో ఉంటోంది.
రామదూత క్రియేషన్స్ పతాకంపై వ్యూహం చిత్రాన్ని ఆర్జీవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సీఎం జగన్‌గా అజ్మల్, భారతీగా మానస నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం రామ్‌గోపాల్ వర్మ విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
వ్యూహంలో ఎవరిని టార్గెట్ చేయడం లేదన్నారు. జగన్ జీవితంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా జగన్ అంటే ఏంటో చూపిస్తానని స్పష్టం చేశారు. తాను నమ్మిన నిజాన్ని చూపిస్తున్నానని.. ఈ సినిమాలో ఎన్నో అంశాలు ఉంటాయని చెప్పారు. వ్యూహంలో తన అభిప్రాయం మాత్రమే ఉంటుందన్నారు. తాను నమ్మిన నిజాన్ని చూపిస్తున్నానని అన్నారు. వివేకా హత్య గురించి కూడా ప్రస్తావిస్తానని ఆర్జీవీ స్పష్టం చేశారు.
పొగడ్తలు అంటే తనకు చిరాకు అని, విమర్శలు అంటే నాకు చాలా ఇష్టమన్నారు. తనకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తానని, వ్యూహం ఎవరినీ టార్గెట్ చేయలేదన్నారు. సీఎం జగన్‌పై నాకున్న అభిప్రాయాలను మాత్రమే చూపిస్తానని అన్నారు. సినిమా గురించి ఇప్పుడే అన్ని చెబితే ఆసక్తి ఉండదన్నారు. సినిమాల్లో సందేశాలు ఇచ్చే అలవాటు తనకు లేదన్నారు.
ఈ సినిమా వెనుక వైసీపీ నేతలు లేరని స్పష్టం చేశారు. 60 నుంచి 70 శాతం సినిమా కంప్లీట్ అయ్యిందని, త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తామని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తప్పించి మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరూ తనను కామెంట్ చేయడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వ్యూహం సినిమా కచ్చితంగా ప్రభావం చూపుతుందని ఆర్జీవీ పేర్కొన్నారు.
తాను నమ్మిన విషయాన్నేసినిమాగా తీస్తానని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి వ్యూహం కధాంశం సాగుతుందన్నారు. వైఎస్సార్ మరణం తరువాత పరిణామాలు, ఎవరు ఎలాంటి వ్యూహాలు వేశారో సినిమాలో చెబుతామన్నారు. ప్రకాశం బ్యారేజీ పై వ్యూహం సినిమా షూటింగ్ జరుగుతోందని చెప్పారు. రెండు భాగాలుగా ఎన్నికలకు ముందే విడుదల చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పిలిచి అడిగినా దర్శకత్వం చేయనన్నారు. తనకు నచ్చిన పని మాత్రమే చేస్తానన్నారు.
రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హీరోల రెమ్యూనరేషన్‌పై చేసిన వ్యాఖ్యలపైనా ఆర్జీవీ స్పందించారు. తప్పంతా రెమ్యూనరేషన్ ఇచ్చే వాడిదేనని, తీసుకునేవాడిది కాదన్నారు. హీరోల మార్కెట్‌ను బట్టి రెమ్యూనరేషన్ ఉంటుందని ఆర్జీవీ స్పష్టం చేశారు. చిరంజీవి ఏ ఉద్దేశంతో కామెంట్స్ చేశారో తెలియదన్నారు. భోళా శంకర్ సినిమా డాకుమెంట్స్ ఏవో టైంకు ఇవ్వలేదని తెలిసిందని, ఆ వివరాలు పూర్తిగా తనకు తెలియవన్నారు.