మండపేటపై వైసీపీ కన్ను- దశమికి టిడ్కో ఇళ్ళు పంపిణీ
టిడ్కో అపార్టుమెంట్లు పంపిణీపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఓ ఏడాదిగా మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు తేదీ ప్రకటించడంతో లబ్ధిదారులు ఖుషిగా ఉన్నారు.
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో ఉన్న టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు దసరా కానుకగా ఇవ్వబోతున్నట్టు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెలిపారు. విజయ దశమి నాడు సుమారు రెండు వేల మందికి అపార్టుమెంట్లు స్వాధీనం చేయనున్నారు.
మూడున్నర ఏళ్ళుగా ఈ ఇళ్లు ఎప్పుడు ఇస్తారా అని లబ్ధిదారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లకు ఇప్పుడు ఇళ్లు ఇస్తున్నందుకు వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతలో రెండు వేల మందికి ఇళ్లు అప్పగిస్తారు. తర్వాత మిగిలిన వారికి స్వాధీనం చేస్తారు.
టిడ్కో అపార్టుమెంట్లు పంపిణీపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఓ ఏడాదిగా మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు తేదీ ప్రకటించడంతో లబ్ధిదారులు ఖుషిగా ఉన్నారు. మండపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మండపేట వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ తోట త్రిమూర్తులు ఈ విషయాన్ని ప్రకటించారు.
మండపేటలో పాగా వేసేందుకేనా...
2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గాలిలో మండపేట నియోజకవర్గంలో టిడిపి విజయ డంకా మోగించింది. ఇక్కడ టిడిపి నుంచి బలమైన అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ తోట త్రిమూర్తులను మండపేట నియోజకవర్గం ఇన్చార్జిగా నియమిస్తూ మండపేట గెలుపు బాధ్యతలను ఆయనకు అప్పగించింది వైసిపి అధిష్ఠానం. ఆనాటి నుంచి చురుగ్గా మండపేటలో తిరుగుతున్న తోట త్రిమూర్తులు ప్రభుత్వ పెద్దలను ఒప్పించి విమర్శలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నటువంటి మండపేట టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఎక్కడా ఇవ్వకపోయినా మండపేటలో మాత్రం లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించే పనికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
ఎట్టకేలకు టిడ్కో ఇళ్లకు మోక్షం ...
ఇల్లు లేని నిరుపేదలకు గత ప్రభుత్వ హయాంలో మండపేట గొల్లపుంతలో టిడ్కో ద్వారా నిర్మించిన ఇళ్లకు ఎట్టకేలకు మోక్షం లభిస్తుంది. లక్షలు అప్పుచేసి డీడీలు చెల్లించిన లబ్ధిదారులపై వడ్డీ భారం పడింది. అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
లబ్ధిదారులకు సౌకర్యాలతో సిద్ధమైన గృహాలను గత ఏడాది జూన్ నెలాఖరు నాటికి ఇవ్వనున్నట్లు అధికారులు చెప్పారు. ఏళ్ల తరబడి అందని ద్రాక్షలా ఉన్న టిడ్కో భవనాలు కొన్నింటిని జూన్ నెలాఖరుకు, మరికొన్నింటిలో సౌకర్యాలు పూర్తిచేసి డిసెంబరు చివరి నాటికి ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు. కాగా పలు కారణాలతో వాటి పంపిణీ పూర్తి కాలేదు. ఇప్పుడు వాటిని అందజేసేందుకు సిద్ధమయ్యారు.
మండపేట సమీపంలోని గొల్లపుంతలో ఫేజ్-1 కింద 4,060, ఫేజ్-2 కింద 2,064 వెరసి 6,124 ఇళ్లు నిర్మించారు. వీటిలో 2,400 వరకు బ్యాంక్ రుణాలు లింకేజ్ పూర్తి కాగా మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. వయస్సు ఎక్కువగా వున్న లబ్ధిదారులకు రుణం ఇచ్చేందుకు బ్యాంకులు అయిష్టత చూపుతున్నారు. వారి నుంచి సబ్సిడీ పోను మిగిలిన సొమ్ము వసూలు చేసి ఇల్లు స్వాధీనం చేస్తామని అధికారులు చెబుతున్నారు.