Chinarajappa: చినరాజప్ప హ్యాట్రిక్ కొడతారా ? - జ్యోతుల నెహ్రూ నాల్గోసారి అసెంబ్లీలో అడుగుపెడతారా ?
Eastgodavari News: తూ.గో జిల్లాలోని జగ్గంపేటలో టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రు, పెద్దాపురంలో మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ముమ్మడివరంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు బరిలోకి దిగుతున్నారు.
East Godavari Political Situation: తూర్పు గోదావరి జిల్లా (East Godavari)లో మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను తెలుగుదేశం (Tdp ) ఖరారు చేసింది. కొన్ని సీట్లను మిత్రపక్షం జనసేనకు కేటాయించింది. జగ్గంపేట (jaggampet)లో టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రు (Jyothula Nehru), పెద్దాపురంలో మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప (Chinarajappa), ముమ్మడివరంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు బరిలోకి దిగుతున్నారు.
జగ్గంపేటలో టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రు, వైసీపీ తరఫున తోట నరసింహం పోటీ చేయనున్నారు. తొలి నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల, తోట కుటుంబాలు గెలుస్తూ వస్తున్నాయి. గతంలో ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పని చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుని పక్కనపెట్టి తోట నరసింహాంని బరిలోకి దింపింది వైసీపీ. నరసింహం జగ్గంపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జ్యోతుల నెహ్రూ ఆరుసార్లు పోటీ చేయగా మూడుసార్లు గెలిచి మూడుసార్లు ఓడిపోయారు. 1994, 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున, 2014లో వైసీపీ తరఫున జ్యోతుల నెహ్రూ గెలుపొందారు.
చినరాజప్ప హ్యాట్రిక్ కొడతారా ?
పెద్దాపురం వైసీపీ అభ్యర్థిగా దవులూరు దొరబాబు పోటీ చేస్తుంటే ఆయనపై టీడీపీ అభ్యర్థిగా నిమ్మకాయల చినరాజప్ప బరిలోకి దిగుతున్నారు. 2014, 2019లలో వరుసగా రెండుసార్లు పెద్దాపురం నుంచి విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి గెలుపొంది...అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు నిమ్మకాలయ చినరాజప్ప. 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో...హోం శాఖ మంత్రిగా పని చేశారు. పార్టీ ఆవిర్బావం నుంచి తెలుగుదేశంలో పార్టీలో కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలం పాటు తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో గెలవలేదు.. గత రెండు ఎన్నికల్లోనూ ఇద్దరు అభ్యర్థులు పోటీ చేసినా ఓటమి తప్పలేదు.. దొరబాబు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
తునిలో యనమల కూతురికి టికెట్
తుని నుంచి మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ నుంచి పోటీ చేస్తుంటే టీడీపీ తరఫున యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యను అభ్యర్థిగా ప్రకటించారు. 1983 నుంచి తుని నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు రామకృష్ణుడు. 2009లో తొలిసారి ఆయన ఓడిపోయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 2014, 2019లలో రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు పోటీ చేసినా టీడీపీ జెండా ఎగరలేదు. దాంతో ఈసారి కుమార్తెను బరిలోకి దింపారు రామకృష్ణుడు. దాడిశెట్టి రాజా తుని నుంచి వరుసగా రెండుసార్లు పోటీ చేసి విజయం సాధించారు.
ముమ్మిడివరంలో దాట్ల సుబ్బరాజు
ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పొన్నాడ వెంకట సతీష్ పోటీ చేయనున్నారు. టీడీపీ అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజును ప్రకటించారు. గత ఎన్నికల్లో సుబ్బరాజుపై పొన్నాడ సతీష్ విజయం సాధించారు. 2014లో ముమ్మిడివరం నుంచి టీడీపీ అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజు గెలిచారు. 2009లో కాంగ్రెస్ తరఫున సతీష్ విజయం సాధించారు.. నియోజకవర్గంలో మత్స్యకార ఓట్ల కీలకంగా మారనున్నాయి. కాకినాడ రూరల్ నుంచి వైసీపీ తరఫున కన్నబాబు పోటీ చేస్తుండగా, జనసేన అభ్యర్థిగా పంతం నానాజీ పోటీ చేయనున్నారు.. నియోజకవర్గంలో కాపు శెట్టిబలిజ ఓటర్లు కీలకం... అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఫ్యామిలీ జనసేనతో కలిసి పని చేయడం లేదు. 2009లో పీఆర్పిృీ తరఫున పోటీ చేసిన కన్నబాబు...2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచారు. కన్నబాబుపై పోటీ చేసిన పంతం నానాజీ గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమయ్యారు.