Independence Day 2025: వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి రథోత్సవం, స్వాతంత్య్ర పోరాటానికి లింకేంటి ? అమరుల స్థూపం వెనుక రహస్యం!
స్వాతంత్య్ర పోరాటంలో తెల్లదొరల దాష్టికానికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చాలా మంది అమరులు అయ్యారని, కొందరు క్షతగాత్రులుగా మిగిలారని, ఆలయం ముందు ఉన్న స్మారక స్తూపం చెబుతోంది..

Vadapalli Venkateswara swamy Temple | వాడపల్లి: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వాడపల్లి అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఏడువారాల వెంకటేశ్వరస్వామి.. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి తెలుగు రాష్ట్రాలనుంచే కాక ఇతర రాష్ట్రాలనుంచి, విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.. అయితే ఇంతటి ప్రసిద్ధ ఆలయంలోకు స్వాతంత్య్ర ఉద్యమానికి విడదీయలేని సంబంధం ఉందంటే నమ్ముతారా.. దీనికి ప్రత్యక్ష సాక్షంగా ఆలయం ముంగిటలోనే ఉన్న అమరుల స్మారక స్థూపం కనిపిస్తుంటుంది.
దేశ స్వాతంత్య్ర పోరాటంలో తెల్లదొరల దాష్టికానికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ ప్రాంతానికి చెందిన చాలా మంది అమరులు అయ్యారని, కొందరు క్షతగాత్రులుగా మిగిలారని, మరికొందరు అప్పటి బ్రిటీష్ పాలకులు పెట్టిన అక్రమ కేసుల్లో అనేక ఇబ్బందులు పడ్డారని చారిత్రక వాస్తవంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఉన్న స్మారక స్తూపం చెబుతోంది.
రథంపై త్రివర్ణ పతాకం ఎగిరిందని...
అది భారత దేశానికి స్వాతంత్య్రం కోసం వాడవాడలా పోరాటాలు మిన్నంటిన సమయం.. కోనసీమ ప్రాంతంలోనూ స్వాతంత్య్ర ఉద్యమ పోరాటాలు ఉదృతంగా సాగుతున్న పరిస్థితి.. కులమతాలకు అతీతంగా అంతా ఏకమై దేశభక్తిని అనువణువునా నింపుకుని జీవిస్తున్న తరుణంలో వాడపల్లిలో ఓ సంఘటన చోటుచేసుకుంది..
ఆరోజు 1931 మార్చి 30వ తేదీ చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినం.. ఈ సందర్భంగా వాడపల్లి వెంకటేశ్వరస్వామిని రథంపై ఊరేగిస్తున్న తరుణంలో భక్తితో పాటు దేశభక్తి చాటిచెప్పేందుకు వెంకటేశ్వర స్వామి రథానికి త్రివర్ణ పతాకాన్ని కట్టి ఎగురవేశారు.. అదేవిధంగా దానికి తోడు గాంధీజీ ఫోటోను రధానికి తగిలించారు. ఉత్తుంగ తరంగంలా కదిలిన భక్త సంద్రం అంతే ఉత్సాహంగా స్వామి రథాన్ని లాగుతూ అంతే స్థాయిలో దేశభక్తిని నింపుకుని ఓ వైపు గోవింద నామంతోపాటు దేశభక్తి నినాదాలతో రథయాత్ర ముందుకు సాగింది.. ఇది శత్రు స్థావరం మీదకు దండెత్తుతున్న సైనికుల దండులా కనిపించే సరికి బ్రిటీష్ అధికారులు చూసి ఓర్వలేకపోయారు..
గాలిలోకి కాల్పులు జరిపినా వెనక్కు తగ్గని ప్రజలు..
వాడపల్లిలో జరగుతోన్న వెంకటేశ్వరస్వామి రథయాత్రలో స్వాతంత్య్ర ఉద్యమ నినాదాలు గురించి తెలుసుకున్న అప్పటి రాజమండ్రి డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ గా పనిచేస్తున్న ముస్తపా ఆలీఖాన్ రంగంలో దిగారు. సీతానగరంలోని గాంధీ ఆశ్రమాన్ని చిన్నాభిన్నం చేసి అక్కడ వారిని రక్తమోడేలా కొట్టడంతో బ్రిటిష్ అధికారుల వద్ద మన్ననలు పొందిన పోలీసు అధికారిగా గుర్తింపు పొందిన ముస్తఫా ఆలీఖాన్ రథంపై ఎగురుతోన్న జెండాను, గాంధీ చిత్రపటాన్ని తీసివేయాలని హెచ్చరించాడు. అయితే ఆమాట లెక్కచేయని ప్రజలు అంతే ఉత్సాహంతో రథాన్ని ముందుకు తీసుకెళ్తుండడంతో గాల్లోకి కాల్పులు జరిపించాడు.. అయినా లెక్కచేయని ప్రజలు ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు.. దీంతో పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించి ప్రజలపైన తన బలగాలతో కాల్పులు జరిపించాడు. ఈ దాడిలో కొంతమంది నేలకొరిగి ప్రాణాలు విడిచారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. ఇంత జరిగినా భయపడని ప్రజలు బ్రిటీష్ సైనికులుపై తిరగబడ్డారు. తమ వారిపై కాల్పులు జరపమని ఆదేశించిన పోలీసు అధికారి ముస్తపా ఆలీఖాన్ అంతుచూడాలని ఖాకీ దుస్తులు ధరించిన ఓ సైనికునిపై దాడిచేయడంతో మృతిచెందాడు. అయితే అప్పటికే ఆలీఖాన్ అక్కడినుంచి తప్పించుకుని పారిపోయినట్లు తరువాత నిర్ధారణ అయ్యింది..
వాడపల్లి ఆలయం ముందు స్మారక స్థూపం
వాడపల్లి రథోత్సవంలో జరిగిన ఈ సంఘటనలో వాడపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు అమరులయ్యారు.. పలువురు అవయువాలు కోల్పాయారు.. మరికొందరు బ్రిటీష్ పాలకులు పెట్టిన కేసుల్లో జైలు పాలయ్యారు.. ఈ పోరాటంలో త్యాగ జీవులుగా నిలిచిన జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక చిహ్నమే వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం ముంగిట ఉన్న స్థూపం అప్పటి చేదు ఘటనను స్ఫూర్తిని కలిగిస్తుంది.. వాడపల్లిరథోత్సవం సందర్భంగా జరిగిన ఘటనలో కొందరిపై బ్రిటీష్ పాలకులు, పోలీసులు మోపిన అభియోగాలు వాస్తవ విరుద్థమని అప్పటి జిల్లాన్యాయాధికారి 23 నవంబర్ 1931న తీర్పునిచ్చారు.
ఈ సంఘటనకు గుర్తుగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు స్వాతంత్ర సమరయోధుల శిలాఫలకంను 1987 అక్టోబర్ 2 గాంధీ జయంతి వేడుకల సందర్భంగా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే మంతెన వెంకట సుబ్బరాజు నిర్మించి ప్రారంభించారు. అంతటి చరిత్ర కలిగిన స్థూపం ఆలయం ముంగిటే ఉన్నా నేటి తరం కనీసం దానికి చూడకపోవడం, చాలా మంది గమనించకపోవడం కనిపిస్తుంటుంది..
స్థూపం అభివృద్ధికి చర్యలు..
వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వాడపల్లికి తరలివస్తున్న భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో ఈ ఆలయానికి ఎదురుగా హుండీలు మధ్యన ఉండే స్థూపాన్ని అక్కడి నుంచి మార్చి అభివృద్ధి చేయడానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర రావులు చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి ఈ స్మారక స్థూపాన్ని కొత్తగా నిర్మిస్తున్న కోనేరు వద్ద ఏర్పాటు ప్రతిపాదనకు జిల్లా కలక్టర్ నుంచి అనుమతులు లభించినట్లు తెలుస్తోంది..





















