Konaseema Latest News:అంబేద్కర్ కోనసీమలో మద్యం మాఫియా: ఎక్సైజ్ అధికారులపై షాపుల యజమానుల తిరుగుబాటు, అసలేం జరిగింది?
Konaseema Latest News:అబ్కారీశాఖ, మద్యం దుకాణ దారుల మధ్య అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వార్ జరుగుతోంది. ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటుండడం విమర్శలకు తావిస్తోంది..

Konaseema Latest News: అబ్కారీ శాఖ, మద్యం దుకాణదారుల మధ్య అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వార్ జరుగుతోంది. ఇది చివరకు జిల్లా అబ్కారీశాఖ కార్యాలయం ముందు నిరసనకు దిగేలా చేసింది. బాబోయ్ వీళ్ల లంచాలు దోపిడీని మేము తట్టుకోలేకపోతున్నాం. నెలకు లక్ష రూపాయలు తెచ్చి ఇవ్వాలంటే ఎక్కడ తేవాలంటూ బహిరంగ విమర్శలకు మద్యం షాపు యజమానులు దిగారు. ఏకంగా దుకాణాలు బంద్ చేసి ఆపై షాపుల తాళాలు పట్టుకొచ్చి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో అప్పగించి నిరసనకు దిగడం పెద్ద హైడ్రామాను తలపించింది.
ఇదిలా ఉంటే మద్యం షాపుల పరిధిలో అనధికార బెల్ట్‌షాపులను విచ్చలవిడిగా నడుపుతున్నరని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతుంటే చూస్తూ కూర్చోవాలా అన్నది ఎక్సైజ్‌శాఖ అధికారుల వాదన. మొత్తం మీద అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో మాత్రం వీరి మధ్య యుద్ధం మామూలుగా జరగడం లేదని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు.
అసలు ఏం జరిగిందంటే..
మద్యం దుకాణదారులమైన తమ నుంచి ఇష్టానుసారంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారంటూ మద్యం దుకాణదారులు తమ షాపులకు తాళాలు వేసి జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్దే ధర్నాకు దిగారు.
లక్షల రూపాయలు వెచ్చించి మద్యం షాపులు దక్కించుకున్న తమను ఎక్సైజ్ శాఖ అధికారులు తరచూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని వైన్ షాపు నిర్వహకులు సోమవారం ఆందోళన చేపట్టారు. షాపులకు తాళాలు వేసి అమలాపురంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్దకు చేరుకుని తాళాలు ఎక్సైజ్ ఆఫీసులో ఇచ్చేసిన మద్యం షాపుల నిర్వాహకులు తమ నిరసన వ్యక్తం చేశారు.
ఎక్సైజ్ అధికారుల వేధింపులు భరించలేకపోతున్నామని ప్రతి నెల షాపునకు రూ. లక్ష ఇవ్వాలని ఎక్స్సైజ్ అధికారుల డిమాండు చేస్తున్నారంటూ ఆరోపించారు.
ప్రతినెల ఎక్సైజ్ అధికారులకు మామూళ్లు ఇవ్వకపోతే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మద్యం వ్యాపారాలు వాపోయారు. తరచూ తమపై ఎక్స్సైజ్ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని కార్యాలయం అందోళన చేపట్టారు. షాపుల వద్ద మద్యాన్ని కొనుగోలు చేసే వారిని సైతం అరెస్టులు చేసి షాపులపై కేసులు కడుతున్నారని, ఇలాగైతే షాపులు మేము నడపలేమని ఎక్సైజ్ సిఐ కు తాళాలు అప్పగించి షాప్ యజమానులు తమ నిరసన తెలిపారు.
మరి ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు..
మద్యం దుకాణాల పరిధిలో విచ్చలవిడిగా అనధికార బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారని, ఎమ్మార్పీ రేటు కంటే అధికంగా లిక్కర్ విక్రయాలు జరుగుతున్నాయని, మా దాడుల్లో దొరికిన పలువురిపై కేసులు నమోదు చేశామని చెబుతున్నారు. అయితే ఈ దాడుల నేపథ్యంలోనే మద్యం దుకాణదారులు తమపై కక్షకట్టి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నరని మండిపడుతున్నారు. మద్యం దుకాణదారుల నుంచి తాము లక్షల రూపాయలు వసూళ్ల చేస్తున్నారని కొందరు మద్యం దుకాణదారులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని చెప్పుకొస్తున్నారు.
ఎక్కువగా అమ్ముకోండి .. మామూళ్లు ఇచ్చేయండి..
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మద్యం షాపు నిర్వహకులమైన తమ నుంచి భారీ ఎత్తులో మామూళ్లు వసూళ్లకు అధికారులు పాల్పడుతున్నారని మద్యం షాపుల నిర్వాహకులు మండిపడుతున్నారు. మేమంతా సిండికేట్‌గా ఏర్పడి లక్షల రూపాయలు పోగేసి అధికారులుకు ఇవ్వాలట.. ఎమ్మార్పీ రేటు కంటే అధికంగా అమ్ముకున్నా మాట్లాడరట అని చెప్పు కొస్తున్నారని మద్యం షాపు నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై ఎక్సైజ్ సూపరింటెండెంట్ వివరణ కోరగా ఇది నిరాధారమైన ఆరోపణలని కొట్టి పడేశారు.. మద్యం దుకాణాల పరిధిలో విచ్చలవిడిగా బెల్టషాపులను నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మాత్రమే తాము దాడులు చేశామని ఆయన చెప్పారు.





















