Vadapalli Sri Venkateswara Swamy Temple: వాడపల్లి వెంకటేశ్వరస్వామి భక్తులకు గుడ్ న్యూస్- ఇంటి నుంచే టికెట్ బుకింగ్ సౌకర్యం
Vadapalli Venkateswara Swamy Temple : వాడపల్లి వెంకటేశ్వరస్వామి సన్నిధికి ప్రతీ శనివారం వేలాదిగా భక్తుల తరలి వస్తున్నారు. దీంతో భక్తులకు మేలు కోసం ఆన్‌లైన్ స్లాట్ విధానం తీసుకొచ్చారు.

Vadapalli Venkateswara Swamy Temple Tickets : కోరిన కోర్కెలు తీర్చే కోనసీము కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం భక్తులకు మరింత సులభంగా మారనుంది. దీని కోసం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఏడు శనివారాల వ్రతం పేరున ఏడు శనివారాలు పాటు స్వామిని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతోందని భక్తుల విశ్వాసం. ఈ నమ్మకంతో శనివారం రోజు వచ్చిందంటే చాలు భారీగా భక్తులు వాడపల్లికి తరలి వస్తుంటారు. వాడపల్లి చుట్టుపక్క నుంచి కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా జనం ఈ దేవాలయాన్ని సందర్శించుకుంటారు.
భారీగా తరలి వచ్చే భక్తులు దర్శనాలకు ఇబ్బంది పడుతున్నారు. అందుకే దీనికి పరిష్కారంగా ముందే టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును దేవస్థానం తీసుకొచ్చింది. ఆన్‌లైన్ స్లాట్ విధానం అమలు చేస్తోంది. సాధారణ భక్తలు యధాతథంగా క్యూలైన్లలో స్వామిని దర్శనం చేసుకోవచ్చు..
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం...
వాడపల్లి వెంకటేశ్వరస్వామి సన్నిధికి సమీప ప్రాంత భక్తులే కాకుండా.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలుతోపాటు విదేశాల నుంచి సైతం వాడపల్లి వెంకన్న కోసం దర్శనం కోసం తరలివస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల దర్శనాల క్యూ లైన్‌లలో ఇబ్బందులు తలెత్తి తోపులాట జరుగుతోంది. ముఖ్యంగా శనివారం అయితే వేలాదిగా తరలివచ్చే భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు విస్తరించారు.
స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనలతో పాటు ఆలయ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధరరావు నేతృత్వంలో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రదక్షిణం చేసే భక్తులకు, దర్శనానికి వెళ్లే భక్తులకు సంబంధం లేకుండా దర్శనం అనంతరం నేరుగా పైనుంచి భోజనశాల వద్దకు చేరుకునేలా ఒక ఫైఓవర్ ఏర్పాటు చేశారు. దీంతో చాలావరకు ఇబ్బందులు తగ్గినప్పటికీ జనం పెరిగే కొద్ది మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి..
మే నెల నుంచి స్లాట్ బుకింగ్ విధానం..
వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకునేందుకు ఇకపై భక్తులు ఆన్‌లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు మే ఒకటో తేదీ నుంచి స్లాట్ విధానం అందుబాటులోకి వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్య చక్రధరరావు తెలిపారు. ప్రస్తుతానికి శనివారం ఒక్కరోజు మాత్రమే స్లాట్ విధానం అమలు చేయగా త్వరలోనే అన్ని రోజుల్లోనే ఆన్‌లైన్ స్లాట్ విధానం అందుబాటులోకి వస్తుందన్నారు. ఆన్‌లైన్‌లో దేవస్థానానికి చెందిన వెబ్ సైట్ www.vsvstemple.com ద్వారా స్లాట్‌లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు.
వీఐపీలకోసం ప్రత్యేక సమయం..
వీఐపీ సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులకు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. దీనికి స్లాట్ విధానం అమలు చేయనుండగా దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ను రెడీ చేస్తున్నట్లు డిసి వెల్లడించారు. రెండు సంవత్సరాల లోపు వయసు పిల్లలతో వచ్చే తల్లులకు, నడవలేని, చూపులేని దివ్యాంగులకు వారికి సహాయంగా వచ్చే ఒకరికి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉచితంగా దర్శనం కల్పిస్తామని, మిగిలిన దర్శనాలన్నీ యథాతథంగా కొనసాగుతాయని డీసీ వివరించారు.
రూ.50, రూ.200, రూ.1116 ల దర్శనాలకు ఇబ్బంది లేకుండా యథావిధిగా క్యూలు కొనసాగుతాయి. రోజు రోజుకి పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, దర్శన సమయంలో ఒత్తిడికి గురవకుండా భక్తులందరికీ స్వామివారి దివ్య దర్శనం ప్రశాంతంగా జరగాలన్నదే తమ ఉద్దేశ్యం అన్నారు డీసీ. ఆ లక్ష్యంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. వీటిని అమలు జరిపిన అనంతరం ఏమైనా లోపాలు ఉంటే గుర్తించి, సరిదిద్ది భవిష్యత్తులో మరిన్ని ఫెసిలిటీస్ అమల్లోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు.





















